సచిన్ దోస్త్ కాంబ్లికి గుండెపోటు, ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీకి శుక్రవారం ఉదయం గుండె పోటు రావడంతో ఆయనను మహారాష్ట్రలోని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాంబ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందలేదు.
చెంబూర్ మీదుగా బాంద్రా వెళుతున్న సమయంలో కాంబ్లికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. 42ఏళ్ళ ఈ మాజీ ఆటగాడు ఇటీవల తన స్నేహితుడు సచిన్ టెండూల్కర్ తన చివరి మ్యాచుకు ఆహ్వానం పంపలేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ తనను ఆహ్వానించకపోవడంపై వినోద్ కాంబ్లీ ఏడ్చేశాడు.

1988 ఫిబ్రవరిలో పాఠశాల స్థాయిలో జరిగిన ఓ మ్యాచులో ముంబైలోని శారదాశ్రమం విద్యామందిర్ పాఠశాల తరపున ఆడిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు అత్యుత్తమంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత్ తరపున అంతర్జాతీయంగా 17 టెస్టులు, 104 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు వినోద్ కాంబ్లి. చివరిగా 1995లో జరిగిన టెస్ట్ మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్‌కు వినోద్ కాంబ్లి దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు 2009లో వినోద్ కాంబ్లి ప్రకటించాడు. కాగా 2011లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు కూడా కాంబ్లి ముగింపు పలికాడు.












Click it and Unblock the Notifications