మాకు కాకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: పంజాబ్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు వైరల్, కాంగ్రెస్ హ్యాపీ
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు ఆదివారం జరిగిన క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వనీ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక, ప్రత్యర్థి పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యాఖ్యానించడం సొంత పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. ఆ తర్వాత సరిచేసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది.
ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం బీజేపీ చీఫ్ అశ్వని శర్మ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటేయకపోతే.. కాంగ్రెస్ పార్టీకైనా ఓటేయాలని అన్నారు. అంతేగాక, ఆమ్ ఆద్మీపార్టీకి మాత్రం ఓటు వేయకూడదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే ఉగ్రవాదులకు వేసినట్లేనని, పంజాబ్ విచ్ఛిన్నానికి ఓటేసినట్లేనని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ మారడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను స్వాగతించింది.

అయితే, తన పొరపాటు గుర్తించిన అశ్వనీ శర్మ తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని శనివారం వివరణ ఇచ్చారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అబద్ధాలను ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని అన్నారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలన మోసం చేయాలని చూస్తున్నారన్నారు. పంజాబ్ కు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి ప్రమాదకరమని అన్నారు.
ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే బీజేపీకి ఓటేసి క్షేమంగా ఉండాలని అశ్వనీ శర్మ కోరారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. కాగా, 1304 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో 93 మంది మహిళలు ఉన్నారు.
ఆదివారం పంజాబ్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు, పంజాబ్‌లో సగటున 63.44 శాతం ఓటింగ్ నమోదైంది, అదే సమయంలో, ఉత్తరప్రదేశ్‌లో మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలలో సగటున 57.43 శాతం ఓటింగ్ నమోదైంది.












Click it and Unblock the Notifications