వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాల్తేరు వీర‌య్య మూవీ రివ్యూ: బాసు, గ్రేసు బాగున్నాయి, కానీ....

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వాల్తేరు వీరయ్య

చిరంజీవి సినిమా అన‌గానే భారీ అంచ‌నాలు నెల‌కొంటాయి. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు.

చిరంజీవి ఫైట్లు చేస్తే వాళ్లకు ఆనందం. కామెడీ చేస్తే ఉత్సాహం. డాన్సులు లేక‌పోతే అది అస‌లు చిరంజీవి సినిమా కానట్టే.

అందుకే క‌థ ఏదైనా స‌రే, ఈ హంగుల‌న్నీ అందులో ఇమ‌డ్చడానికి ద‌ర్శకులు ప్రయత్నిస్తుంటారు. సైరా, ఆచార్య, గాడ్ ఫాద‌ర్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌కి ఏమాత్రం అవ‌కాశాలు రాలేదు. దాంతో... అభిమానులు కాస్త నిరాశ‌కు లోన‌య్యారు.

అందుకే త‌న అభిమానుల‌కు ఏం కావాలో...అవ‌న్నీ ఇచ్చేయాల‌న్న ఉద్దేశ్యంతో చిరు చేసిన ప్రయత్నమే 'వాల్తేరు వీరయ్య’ . పైగా త‌న అభిమాని బాబీ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టారు చిరంజీవి. మ‌రో అభిమాని ర‌వితేజ‌కు ఓ కీల‌క పాత్ర అప్పగించారు.

అందుకే ఇది వ‌ర‌క‌టికంటే...ఎక్కువగా మెగా అభిమానులు వాల్తేరు వీర‌య్య రాక కోసం ఎదురు చూశారు. పూన‌కాలు లోడింగ్ అనే క్యాప్షన్...ఆ అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేశాయి. మ‌రి వాల్తేరు వీర‌య్య ఎలా ఉన్నాడు? పూన‌కాల‌తో థియేట‌ర్లు ఊగాయా, లేదా? ఈ సంక్రాంతికి వీర‌య్య చేసిన సంద‌డి ఎలా ఉంది?

వాల్తేరు వీరయ్య

వీర‌య్య వేట‌

వాల్తేరు వీర‌య్య (చిరంజీవి) ఓ స్మగ్లర్‌. స‌ర‌దా మ‌నిషి. త‌న చుట్టు ప‌క్కల వాళ్లంతా సంతోషంగా ఉండాల‌నుకొంటాడు.

ఓ కేసు నిమిత్తం...త‌న‌కు పాతిక ల‌క్షలు అవ‌స‌రం అవుతాయి. ఆ డ‌బ్బు కోసం ఓ అసాధ్యమైన ప‌ని ఒప్పుకొంటాడు. మ‌లేసియాలో దాక్కున్న డ్రగ్ డీల‌ర్‌, మాన్‌స్టర్ సాల్మన్ (బాబీసింహా)ని ఇండియాకు తీసుకురావ‌డ‌మే...వీర‌య్య మిష‌న్‌.

అందుకోసం వీర‌య్య మ‌లేషియా వెళ్తాడు. కానీ.. సాల్మన్ అంత తేలిగ్గా దొరికే ర‌కం కాదు. త‌న చుట్టూ ఓ వ‌ల‌యం ఉంటుంది.

మ‌రి.. వీర‌య్య ఆ వ‌ల‌యాన్ని ఛేదించి సాల్మన్‌ని ప‌ట్టుకొన్నాడా? అస‌లు ఈ మిష‌న్ వెనుక ఉన్న కార‌ణం ఏమిటి? సీజ‌ర్ (ప్రకాష్ రాజ్‌)కీ వాల్తేరు వీర‌య్యకీ ఉన్న వైరం ఏంటి? విశాఖ‌కి వ‌చ్చిన క‌మీష‌న‌ర్ విక్రమ్ (ర‌వితేజ‌)తో వీర‌య్యకు ఉన్న బంధం ఏమిటి? ఈ ప్రశ్నల‌కు స‌మాధానం తెలియాంటే వాల్తేరు వీర‌య్య చూడాలి.

వాల్తేరు వీరయ్య

కథ ఎలా నడిచింది?

ఇదో ప్రతీకార నేప‌థ్య చిత్రం. క‌థానాయకుడు త‌న వాళ్లకు జ‌రిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడ‌న్నదే సినిమాలో కీల‌కాంశం. ఈ జోన‌ర్‌లో ఇది వ‌ర‌కు చాలా చిత్రాలొచ్చాయి.

క‌థ‌గా చెప్పాలనుకొంటే రొటీన్ డ్రామా. కానీ చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని రాసుకొన్న స‌న్నివేశాలు, కామెడీ బిట్లు, ఫైట్లు..వాల్తేరు వీర‌య్యకు కొత్త రంగు అద్దే ప్రయ‌త్నం చేశాయి.

సినిమాలో ర‌వితేజ క‌నిపించ‌డంతో మ‌రింత మైలేజీ వ‌చ్చిన‌ట్టైంది. సాల్మన్ పోలీస్ స్టేష‌న్‌లో విధ్వంసం సృష్టించ‌డం ద‌గ్గర్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. సాల్మన్ ఎంత క్రూరుడో.. ఆ స‌న్నివేశంతోనే చెప్పేశాడు ద‌ర్శకుడు. అలాంటి సాల్మన్‌కి ధీటుగా వెళ్లగ‌లిగే క‌థానాయ‌కుడు...ఇంకెంత శ‌క్తిమంతుడో అనిపిస్తుంది.

స‌ముద్రంలో పోటెత్తుతున్న అల‌ల‌కు ఎదురొడ్డి...నేవీ ద‌ళాన్ని కాపాడ‌డానికి హీరో చేసే ఫైట్ తో హీరోకి స‌రైన ఇంట్రడ‌క్షనే ఇచ్చారు. ఆ వెంట‌నే... బాస్ పార్టీ పాట మొద‌లైపోతుంది. మ‌లేసియాలో కామెడీ బిట్లు, శ్రుతి హాస‌న్ తో రొమాన్స్‌... ఇలా మెగా ఫ్యాన్స్‌కి కావ‌ల్సిన ఎలిమెంట్స్ అన్నీ వ‌రుస క‌ట్టేస్తుంటాయి.

సాల్మన్‌ని ఎత్తుకెళ్లిపోవ‌డానికి వీర‌య్య అండ్ కో వేసే ప్లాన్స్ నుంచి కూడా కామెడీ రాబ‌ట్టుకొనే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. చిరులోని కామెడీ యాంగిల్ ని వాడుకోవ‌డానికి ఏ చిన్న సంద‌ర్భం దొరికినా వ‌ద‌ల్లేదు. చిరు కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. కాబ‌ట్టి.. ఆయా సన్నివేశాలు ఫ్యాన్స్‌కి న‌చ్చేస్తాయి.

కానీ..క‌థ‌లో వేగం లేద‌న్న ఫీలింగ్ వెంటాడుతుంటుంది. ఓ అతి క్రూర‌మైన క్రిమిన‌ల్ ని ప‌ట్టుకోవ‌డానికి వ‌చ్చిన వీర‌య్య కాల‌క్షేపం చేస్తుంటాడు. కేవ‌లం నిడివిని పెంచ‌డానికి త‌ప్ప కొన్ని స‌న్నివేశాలు ఎందుకూ ఉప‌యోగ‌ప‌డ‌లేదన్న ఫీలింగ్ క‌లుగుతుంది. అయితే..ఇంటర్‌వెల్ బ్యాంగ్ లో చిరు గ్యాంగ్ లీడ‌ర్ అవ‌తారం ఎత్తుతాడు. ఆ ఫైటింగ్‌, బ్యాగ్రౌండ్‌లో వ‌చ్చిన పాట‌..ఇవ‌న్నీ పూన‌కాలు లోడింగ్ అన్నట్టే సాగుతాయి. వాల్తేరు వీర‌య్య అస‌లు మిష‌న్ ఏమిట‌న్నది ఇంటర్‌వెల్ బ్యాంగ్‌తో అర్ధమవుతుంది.

వాల్తేరు వీరయ్య

ర‌వితేజ రాక...

ర‌వితేజ రాకతో సెకండాఫ్ మొద‌ల‌వుతుంది. ఎప్పటిలానే మాస్ ఫైట్ తో ర‌వితేజ‌ని తెర‌కు ప‌రిచ‌యం చేయిస్తారు. వాల్తేరు వీర‌య్యని పోలీస్ స్టేష‌న్‌కి పిలిచి వార్నింగ్ ఇవ్వడం.. అక్కడ చిరు డైలాగ్ ని ర‌వితేజ‌, ర‌వితేజ డైలాగ్ ని చిరంజీవి ప‌ల‌క‌డం..కామెడీగా సాగిపోతాయి.

అన్నద‌మ్ముల టిట్ ఫ‌ర్ టాట్ ఎపిసోడ్లు... సెకండాఫ్‌లో ఒక‌దాని త‌ర‌వాత ఒక‌టి వ‌స్తూ పోతూ ఉంటాయి. అయితే.. వాటిని ద‌ర్శకుడు ప్రభావ‌వంతంగా తీర్చిదిద్దలేదు. అన్నాద‌మ్ముల మ‌ధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనేది చూపించ‌లేక‌పోయాడు. డ్రగ్స్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా పేల‌వంగా ఉంది.

విక్రమ్ పాత్రని ముగించి..వీర‌య్యకు కొత్త ల‌క్ష్యం నిర్దేశించ‌డం ద‌గ్గర‌.. కాస్త ఎమోష‌న్ పండుతుంది.

కార్లో..చిరు, ర‌వితేజ మాట్లాడుకోవ‌డం ద‌గ్గర ప్రేక్షకులు ఎమోష‌న్‌గా క‌నెక్ట్ అవుతారు. అంత‌కు ముందు సీన్లు కూడా ఇలానే ఎమోష‌న్ పండించి ఉంటే బాగుండేది. కానీ అది జ‌ర‌గ‌లేదు.

చివ‌ర్లో...మాస్, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల సూత్రాల‌కు అనుగుణంగానే హీరో శ‌త్రుసంహారం చేసి, త‌న ప్రతీకారం తీర్చుకోవ‌డంతో క‌థ ముగుస్తుంది.

చిరంజీవి సినిమాలో ర‌వితేజ ఉన్నాడు... అని తెలిసిన‌ప్పటి నుంచీ వారిద్దరి మ‌ధ్య ఎలాంటి సీన్లు ఉంటాయి? వాళ్ల క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేసి ఉంటాడు? అనే ఆస‌క్తి మొద‌లైపోతుంది. పైగా ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ల అనుబంధం బాగుంటుంది. అందుకే.. ఓ ర‌క‌మైన అంచ‌నాలు ఏర్పడ‌తాయి. అయితే...ఆ అంచ‌నాల్ని ఆ ఎపిసోడ్లు అందుకోలేక‌పోయాయి. విక్రమ్ పాత్రలో ర‌వితేజ కాకుండా ఎవ‌రైనా ఓకే క‌దా అనిపిస్తుంది.

ర‌వితేజ వ‌ల్ల...స్క్రీన్‌కి నిండుద‌నం వ‌చ్చిందంతే. పైగా ఆ పాత్రలో ర‌వితేజ కొత్తగా చేసిందేం లేదు. త‌న పాత పోలీస్ సినిమాలు గుర్తొస్తుంటాయి. అంత‌కు మించి ఏమీలేదు.

వాల్తేరు వీరయ్య

కొత్తగా ఆలోచించాల్సింది క‌దా..?

హీరో ఎలివేష‌న్లకు బోలెడు మార్గాలున్నాయి. హీరో క‌నిపిస్తే...పూన‌కాల‌తో ఫ్యాన్స్ ఊగిపోవాల‌ని ఏ ద‌ర్శకుడైనా భావిస్తాడు. దానికి త‌గ్గట్టే ఎలివేష‌న్లు రాసుకొంటారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలివేష‌న్ కూడా బాగుంది. కానీ...హీరోయిజం చూపించ‌డానికి ఇండియ‌న్ నేవీని చిన్నబుచ్చేలా స‌న్నివేశాలు రాసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

స‌ముద్రంలో ఓ ముఠాని ప‌ట్టుకోవ‌డానికి నేవీ మొత్తం హీరో ముందుకొచ్చి చేతులు జోడిస్తుంది. స‌ముద్రంలో పారిపోతున్న ఓ స్మగ్లర్‌ని ప‌ట్టుకోవ‌డానికి మ‌రో స్మగ్లర్ స‌హాయం కోరుతుంది. ఇలాంటి స‌న్నివేశాలు చూస్తున్నప్పుడు ఇంత‌కంటే.. ద‌ర్శకులు కొత్తగా ఆలోచించ‌లేరా? అనిపిస్తుంది.

విదేశాల్లో ఉన్న సాల్మన్‌ని ప‌ట్టుకోవ‌డానికి ఇండియా నుంచి 'రా’ అధికారులు వెళ్తారు. వాళ్లతో హీరో 'మీరు ఇండియా వెళ్లిపోండి.. వాడి సంగ‌తి నేను చూసుకొంటా’ అంటాడు. దానికి 'రా’ కూడా త‌లాడిస్తుంది? మ‌రీ..ఈ స్థాయిలో స‌న్నివేశాలు రాసుకోవాల్సిన అవ‌స‌రం లేదు క‌దా..?

చిరంజీవి కామెడీ టైమింగ్ సూప‌ర్ గా ఉంటుంది. అందులో మరో మాట‌కు తావులేదు. వాల్తేరు వీర‌య్యలో కూడా చాలా స‌న్నివేశాల్లో అది క‌నిపిస్తుంది. కాక‌పోతే.. జంబ‌ల‌కిడి జారుమిఠాయి లాంటి డైలాగుల్ని చిరుతో పేర‌డీ చేయించాల్సిన అవ‌స‌రం లేదు. ఫ‌స్ట్రేటెడ్ న్యూస్ యాంక‌ర్‌... ఎపిసోడ్‌ని ఇంకెన్నిసార్లు పేర‌డీ చేస్తారో అర్థం కాదు. అది కూడా మెగాస్టార్ లాంటి న‌టుడితో ఆ డైలాగులు ప‌లికించ‌డం అంత స‌వ్యంగా అనిపించ‌దు.

వాల్తేరు వీరయ్య

బాసు గ్రేసు

వాల్తేరు వీర‌య్యగా చిరంజీవి లుక్‌, గ్రేస్ అన్నీ బాగున్నాయి. ఈ పాత్రతో ఉత్తరాంధ్ర యాస‌లో మాట్లాడించారు. అయితే.. ఆ యాస చాలా సంద‌ర్భాల్లో కంటిన్యూ చేయ‌లేదు. ఇష్టానుసారం... ఈ యాస మారుతుంటుంది. పాట‌ల్లో చిరు స్టెప్పులు, దుస్తులు బాగున్నాయి.

చిరు క్యారెక్టర్ లో అంద‌రివాడు ల‌క్షణాలు క‌నిపిస్తుంటాయి. గ్యాంగ్ లీడ‌ర్‌, శంక‌ర్ దాదా రిఫ‌రెన్సులు పుష్కలం. శ్రుతి హాస‌న్‌ని సాదాసీదాగా ప‌రిచ‌యం చేసినా... క‌థ‌లో ఓ ట్విస్టు త‌న పాత్ర వ‌ల్ల వ‌స్తుంది. అయితే ఆ త‌ర‌వాత‌....ఆ ఇంపాక్ట్ మాయం అవుతుంది.

మిగిలిన సినిమాల్లోలానే పాట‌ల‌కే ఈ పాత్రని ప‌రిమితం చేశారు. యాక్షన్ ఎపిసోడ్‌లలోనూ శ్రుతిని వాడుకొంటే బాగుండేది. ర‌వితేజ‌ది కీల‌క‌మైన పాత్రే. కాక‌పోతే... త‌న నుంచి, ఆ పాత్ర నుంచి కొత్తగా ఏం ఆశించ‌లేం.

బాబీసింహా, ప్రకాష్‌రాజ్‌ల‌ది రొటీన్ విల‌జ‌నిజ‌మే. కామెడీ గ్యాంగ్ లో వెన్నెల కిషోర్ ఒక్కడికే కొంచెం స్పేస్ ఎక్కువ‌.

బాబీ రాసుకొన్న డైలాగులు కొన్ని పేలాయి. చిరుని బాగా ఎలివేట్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ్డాయి. దేవిశ్రీ ట్యూన్లు క్యాచీగా ఉన్నాయి. తెర‌పై అందంగా చూపించారు. భ‌గ‌భ‌గ‌మండే పాట‌ని యాక్షన్ ఎలివేష‌న్ కోసం వాడుకోవ‌డం బాగుంది. ఆ పాట‌తోనే పూన‌కాలు ఆరంభం అవుతాయి.

ద‌ర్శకుడు బాబీ ఓ రొటీన్ క‌థ‌ని రాసుకొన్నాడు. చిరంజీవి ఇమేజ్‌పై దృష్టి పెట్టి.. దానికి త‌గ్గట్టుగా స‌న్నివేశాలు డిజైన్ చేసుకొన్నాడు. కొన్ని సీన్లు మెగా అభిమానుల‌కు న‌చ్చుతాయి. కొన్ని చోట్ల పూన‌కాలు కూడా వ‌స్తాయి. అయితే. చాలా చోట్ల ద‌ర్శకుడిగా బాబీ దొరికిపోయాడు. క‌థ‌లోని బల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డిపోతాయి.

అక్కడ మాత్రం ప్రేక్షకుల‌కు నీర‌సాలు మొద‌ల‌వుతాయి. ఓ హీరోకి అభిమానిగా...అభిమానుల‌కు న‌చ్చేలా సినిమా తీయాల‌నుకొన్నాడు బాబీ. ఆ విష‌యంలో విజ‌యం సాధించినా, వెండి తెర‌పై ఓ సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు మిగల్చడంలో త‌డ‌బ‌డ్డాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Waltair Veeraiya Movie Review: Chiranjeevi Grace are good, but….
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X