పాక్ కు శ్రీలంక పరోక్ష హెచ్చరిక: మూల్యం చెల్లించాలి: రణిల్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే అన్నారు. దక్షిణాసియాలో ఇప్పటికే భారత్ కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన గుర్తు చేశారు.
ఉద్రిక్తతలు నివారించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని రణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. ఊరీ ఉగ్రదాడిని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ఖండించారు.
ఉరీ ఉగ్రదాడి, పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.

అంతే కాకుండా పాకిస్థాన్ ను పరోక్షంగా శ్రీలంక హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఎప్పటికి మంచిది కాదని, దానికి కచ్చితంగా ఎప్పుడో ఓ సారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాక్ పేరు ప్రస్థావించకుండానే చెప్పారు.
భారత్, శ్రీలంకలకు ప్రస్తుతం కీలకమైన సమయం అని, ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని రణిల్ విక్రమ్ సింఘే వివరించారు. సార్క్ సమావేశాలు జరిగితే ఉగ్రవాద అంశం పైన ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
ఉరీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ సమ్మిట్ ను భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. భారత్ కు మద్దతుగా దక్షిణాసియా దేశాలు బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక బాసటగా నిలిచి సార్క్ సమావేశాలను బహిష్కరించాయి.












Click it and Unblock the Notifications