Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసాధారణం : హైకోర్టు జడ్జికి సుప్రీం అరెస్ట్ వారంట్

న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ చరిత్రలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కార కేసులో ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని అరెస్ట్ చేసేందుకు అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం ఇదే మొదటిసారి. కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సీఎస్ కన్నన్‌ను అరెస్టు చేయాలని కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ సారధ్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 31న సుప్రీంకోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్ డీజీపీ స్వయంగా జస్టిస్ కన్నన్ అరెస్టుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.కోర్టు ధిక్కార కేసులో బెయిల్ పొందేందుకు రూ.10 వేల విలువైన వ్యక్తిగత బాండ్ వెంట తెచ్చుకోవాలని జస్టిస్ కన్నన్‌కు సూచించింది.

కోర్టు ధిక్కారం ఎందుకు పరిగణించరాదో తెలియజేయరాదని తాము జారి చేసిన నోటీసుపై జస్టిస్ కన్నన్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ కన్నన్ వద్ద ఉన్న వివిధ కేసుల ఫైళ్లను, కార్య నిర్వాహక ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ ను కూడా న్యాయస్థానం ఆదేశించింది.

 ప్రధాని సహా పలువురికి లేఖలు

ప్రధాని సహా పలువురికి లేఖలు

న్యాయవ్యవస్థలో అవినీతి జరుగుతున్నదని ఆరోపణలు చేసిన తర్వాత విచారణకు ఆయన గైర్హాజరు కావడంతో సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఆయన వ్యవహారశైలి, ప్రవర్తన సరిగా లేదని పేర్కొంటూ ఇంతకుముందే తమ ముందు విచారణకు హాజరు కావాలని జస్టిస్ కన్నన్‌ను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో అవినీతి తాండవిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జేఎస్ ఖెహర్, ఇతర రాజ్యాంగ వ్యవస్థలకు జస్టిస్ కన్నన్ లేఖలు రాశారు. పలువురు సిట్టింగ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తన లేఖల్లో పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థను పరిహసం చేస్తున్నారన్న రోహత్గి

న్యాయవ్యవస్థను పరిహసం చేస్తున్నారన్న రోహత్గి

జస్టిస్ కన్నన్ లేఖలను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం తమ ముందు విచారణకు హాజరు కావాలని గతంలోనే ఆదేశించింది. ఈ విచారణకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పందిస్తూ జస్టిస్ కన్నన్ రాసిన లేఖలు న్యాయవ్యవస్థను పరిహసం చేసేలా ఉన్నాయని, దాని అత్యున్నత ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయని తెలిపారు.ఇటువంటి అంశాలపై న్యాయస్థానం ఎటువంటి చర్యలైనా తీసుకునేందుకు వెనుకాడబోమన్న సందేశాన్ని దేశ ప్రజలకు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ కన్నన్ నుంచి పలు లేఖలు అందాయని జస్టిస్ జేఎస్ ఖేహార్ తెలిపారు. ఒకవేళ జస్టిస్ కన్నన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. ఇది న్యాయవ్యవస్థకు అసాధారణమని, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

జస్టిస్ ఖెహర్ ఇలా...

జస్టిస్ ఖెహర్ ఇలా...

ఒకవేళ జడ్జి ఆరోపణలు ఇలాగే కొనసాగినా, విధులు నిర్వహిస్తూ ధిక్కారానికి పాల్పడినా తగు చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాదుల సాయం కూడా తీసుకుంటామని జస్టిస్ జెఎస్ ఖేహార్ అన్నారు. గత నెల 13న విచారణకు గైర్హాజరైన జస్టిస్ కన్నన్ పై మరోసారి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ధిక్కార కేసు ఎందుకు నమోదు చేయకూడదో తెలియజేయాలని ఆదేశించింది. అంతేకాదు కార్య నిర్వాహక, జ్యుడీషియల్ విధులకు హాజరు కారాదని స్పష్టం చేసింది.

దళితుడినైనందు వల్లే బాధితుడ్ని చేస్తున్నారని ఆరోపణ
సుప్రీం కొలీజియం ఆదేశాలను ప్రశ్నించిన జస్టిస్ కన్నన్

తాను దళితుడినైందు వల్లే బాధితుడ్ని చేస్తున్నారని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కన్నన్ ఆరోపిస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేధిస్తున్నారని జస్టిస్ కన్నన్‌ ఆరోపించారు. ఆయన పనితీరు సరిగా లేదని ఇతర న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయడంతో సుప్రీంకోర్టు ఆయనను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేసింది. తొలుత కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే జారీచేసిన జస్టిస్ కన్నన్, తర్వాత మనస్సు మార్చుకుని కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. తర్వాత మళ్లీ తనను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం జారీచేసిన ఆదేశాలను ప్రశ్నించడంతో గత నెల 13న విచారణకు హాజరై తన వాదనలు వినిపించాలని గత నెల 8వ తేదీన న్యాయస్థానం స్పష్టం చేసింది.

 సుప్రీంకు ఆదేశాలు లేవన్న జస్టిస్ కన్నన్

సుప్రీంకు ఆదేశాలు లేవన్న జస్టిస్ కన్నన్

ఒక రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తికి ధిక్కార నోటీసులు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు లేదని సుప్రీంకోర్టుకు జస్టిస్ కన్నన్ లేఖ రాశారు. జస్టిస్ కన్నన్ రాసిన లేఖ ప్రస్తుతం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు శుక్రవారం చేరింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్కానికి దొరకడం లేదని, ఆ ఆదేశాలు అమలు చేయడం సరి కాదన్నది. అగ్రవర్ణ కులాల కు చెందిన న్యాయమూర్తుల ఆదేశంగానే దీన్ని పరిగణనిస్తానని జస్టిస్ కన్నన్ ఆరోపించారు. ఒక ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తమకు గల న్యాయాధికారాలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. గత నెల ఎనిమిదో తేదీన సుమొటోగా జారీచేసిన నోటీసు తనకు వర్తించదని పేర్కొన్నారు.


జస్టిస్ ఖెహర్ రిటైర్మెంట్ తర్వాతే విచారణకు అభ్యర్థన
జస్టిస్ ఖెహర్ పైనా పిటిషన్‌కు యత్నం

గత ఏడాది ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్‌కు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును దాఖలుచేసేందుకు జస్టిస్ కన్నన్ ప్రయత్నించారు. అయితే జస్టిస్ ఖెహర్ రిటైర్మెంట్ తర్వాతే విచారించాలని ఆ పిటిషన్‌లో కన్నన్ కోరారు. 2010 మే 11న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ కేజీ బాలక్రుష్ణన్ రిటైర్మెంట్ తర్వాత సుప్రీంకోర్టులో ఒక ఎస్సీ గానీ, ఒక ఎస్టీ న్యాయమూర్తి గానీ లేరని ఆరోపించారు.

జస్టిస్ కన్నన్ చేసిన అవినీతి ఆరోపణలు ఇవి

జస్టిస్ కన్నన్ చేసిన అవినీతి ఆరోపణలు ఇవి

మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎస్ కిషన్ కౌల్ సహా 20 మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని జస్టిస్ కన్నన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను చేసిన ఫిర్యాదు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. తనపై కోర్టు ధిక్కార అభియోగాలు మోపడం ద్వారా జస్టిస్ కౌల్‌ను సుప్రీంకోర్టుకు పదోన్నతిపై పంపే ఆలోచన ఉన్నదని జస్టిస్ కన్నన్ ఆరోపణ. తాను దళితుడినైనందునే జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ విధులకు హాజరు కారాదని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇది అనైతికమని ఆరోపించారు. ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టునకు వ్యతిరేకమన్నారు. ఇది తప్పనిసరిగా జాతీయ సమస్య అని, దీన్ని పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ లేఖ రాసింది తానేనని కూడా జస్టిస్ కన్నన్ ద్రువీకరించారు.


రిటైరైన తర్వాత అసలు విషయాలు చెప్తా
రిటైర్మెంట్ పై జస్టిస్ కన్నన్ ఇలా
కొద్ది రోజుల్లో రిటైరవుతానని, ఆ తర్వాత తన వాదన వినిపిస్తానని ఓ ఇంటర్వ్యూలో కూడా జస్టిస్ కన్నన్ తెలిపారు. న్యాయవ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించిన తర్వాత తనకు తాను ఏకాకిగా మారిపోయారని న్యాయవాదులు చెప్తున్నారు. ఎవరితోనూ మాట్లాడేందుకు కూడా అంగీరించడం లేదన్నారు. 2009లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కన్నన్ నియమితులయ్యారు. సహచర న్యాయమూర్తులతో విభేదాల కారణంగా 2011లో తాను దళితుడినైందువల్లే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

ఇద్దరు న్యాయమూర్తులపై కేసు నమోదుకు ఆదేశం

ఇద్దరు న్యాయమూర్తులపై కేసు నమోదుకు ఆదేశం

2015లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కౌల్ తన పట్ల వివక్ష చూపుతున్నారని జస్టిస్ కన్నన్ ఆరోపించారు. 2016 ఫిబ్రవరిలో జస్టిస్ కౌల్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించడంతో అదే నెలలో సుప్రీంకోర్టు ఆయనను కలకత్తాకు బదిలీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ జస్టిస్ కన్నన్..న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ ఆర్ భానుమతిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించారు. దానిపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో రహస్య సమావేశం తర్వాత తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి తిరుగుబాటు చేసిన జస్టిస్ కన్నన్.. న్యాయవ్యవస్థలో అవినీతి తాండవిస్తున్నదని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురికి లేఖలు రాయడంతో పరిస్థితి విషమించింది.

మరో కేసులో చిక్కుకున్న జస్టిస్ కన్నన్

మరో కేసులో చిక్కుకున్న జస్టిస్ కన్నన్

తాజాగా జస్టిస్ కన్నన్ మరో కేసులో ఇరుక్కుకున్నారు. మద్రాస్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి భార్య.. జస్టిస్ కన్నన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కన్నన్ తన భర్తకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె ఆరోపణ. దీనిపైనా సుప్రీంకోర్టు విచారించనున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+