లంచం కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు!(వీడియో)
లక్నో: అన్యాయం జరిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే.. అవినీతి సొమ్ము కోసం కొట్టుకున్నారు. అది కూడా అందరూ చూస్తుండగా నడ్డురోడ్డుపైనే. వారి హంగామాతో జనం బెంబేలెత్తిపోయారు. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీన్ని చూసిన ఉన్నతాధికారులు బాధ్యుడ్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. లక్నోలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఇతౌంజా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్నారు కొందరు పోలీసులు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ.. ఇద్దరు పోలీసులు వాగ్వాదానికి దిగారు. కొద్ది క్షణాల్లో వారిద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ.. నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. ఇది చూసిన మిగతా పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించినా.. ఫలితం లేకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. చివరకు ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కొట్లాటకు దిగిన.. ఇద్దరు పోలీసులు ఆ ప్రాంతంలో వెళ్లే ట్రక్కులు, మిగతా వాహనాల వద్ద లంచం తీసుకున్నారని.. అవి పంచుకోవడంలో వారికి విభేదాలు తలెత్తడంతో కొట్టుకున్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ఘటననంతా ఓ వ్యక్తి వీడియో తీసి.. సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్ల నుంచి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చివరకు ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసుల మధ్య ఘర్షణ లంచం కోసం కాదని.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగిందని వివరించే ప్రయత్నం చేశారు. వీరేంద్ర యాదవ్ అనే పోలీసును సస్పెండ్ చేసి, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications