గాంధీలకు కొత్త కంచుకోట-వాయనాడ్ లో రాహుల్ రికార్డు బద్దలు కొట్టేలా ప్రియాంక..!
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉన్న పరిస్ధితుల్లో కొత్త ఆప్షన్లు వెతికే క్రమంలో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లకు ఆవల మరో సేఫ్ సీటు కోసం వెతికారు. అప్పట్లో రాయ్ బరేలీ స్ధానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. కానీ అమేథీతో పాటు రాహుల్ ఎక్కడో కేరళలోని వాయనాడ్ లోనూ పోటీ చేశారు. అప్పట్లో వాయనాడ్ ను రాహుల్ ఎందుకు ఎంచుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు.
కానీ అప్పట్లో అమేథీలో ఓడిన రాహుల్.. వాయనాడ్ లో భారీ మెజార్టీతో గెలవడంతో గాంధీల వ్యూహం అందరికీ అర్ధమైంది.
ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన తల్లి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో మరో కంచుకోట రాయ్ బరేలీ సీటు నుంచి తిరిగి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ రాహుల్ బరిలోకి దిగారు. దీంతో పాటు మరోసారి వాయనాడ్ లోనూ పోటీ చేశారు. రెండు చోట్లా భారీ విజయాలు నమోదు చేసుకున్న రాహుల్.. ఆ తర్వాత వాయనాడ్ సీటును వదిలి రాయ్ బరేలీలో కొనసాగాలని నిర్ణయించారు. దీంతో వాయనాడ్ లో ఎవరు పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

అప్పట్లో రాయ్ బరేలీలో తాను పోటీ చేసి అమేథీలో చెల్లెలు ప్రియాంక గాంధీని పోటీ చేయించే అవకాశం ఉన్నా రాహుల్ మాత్రం అలా చేయలేదు. అమేథీలో పార్టీ ఆఫీస్ బేరర్ ను పోటీ చేయించి గెలిపించారు. అప్పట్లో అమేథీలో పోటీ చేయని ప్రియాంక గాంధీని ఇప్పుడు తాను పదులుకున్న వాయనాడ్ లో పోటీ చేయించారు. అయితే రాహుల్ లాగే ప్రియాంకనూ ఓటర్లు ఆదరిస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ రాహుల్ మాత్రం పట్టుదలగా ఓటర్లను తనలాగే చెల్లినీ గెలిపించుకోవాలని వాయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో కోరారు.
ఇవాళ జరుగుతున్న వాయనాడ్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. బీజేపీ, సీపీఎం అభ్యర్ధుల్ని వెనక్కి నెట్టి వాయనాడ్ లో గాంధీ కుటుంబానికి హ్యాట్రిక్ గెలుపు అందించే దిశగా ప్రియాంక ముందుకు సాగుతున్నారు. తాజా వార్తలు అందే సరికి ప్రియాంక ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ కు వచ్చిన మూడున్నర లక్షల మెజార్టీని దాటిపోయి మరీ దూసుకువెళ్తున్నారు. తద్వారా వాయనాడ్ ను గాంధీ కుటుంబానికి కంచుకోటగా మార్చే దిశగా అడుగులేస్తున్నారు.













Click it and Unblock the Notifications