హృదయాలు గెల్చుకుంటాం: మోడీ, కత్రా రైలు ప్రారంభం
శ్రీనగర్: అభివృద్ధి ద్వారా జమ్మూకాశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని కత్రా-ఉధంపూర్ రైల్వే సర్వీసును ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్‌లోని త్రికుట కొండల్లో ఉన్న రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని, రైల్వే మంత్రి సదానంద గౌడ, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి కత్రాకి వెళ్లే రైలును జెండా వూపి ప్రారంభించారు. దీంతో వైష్ణోదేవి ఆలయానికి రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఈ రైలు పేరును ‘శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్'గా నామకరణం చేసే అవకాశం ఉంది. ఏటా కోటిన్నర భక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. రైలు సర్వీసును ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయి చూపిన మార్గం అభివృద్ధి అన్న ఆయన, ఆ అభివృద్ధితోనే ప్రజల హృదయాలను గెలుచుకుంటామని చెప్పారు.
ఓ వైపు పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర, మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో వైష్ణోదేవి పాదాల చెంతకు భారతీయులను చేర్చేందుకు ఉపయోగపడే రైలు మార్గం ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలని, తద్వారా మాతా వైష్ణోదేవి సందర్శనకు వెళ్తున్న భక్తులు పవిత్రతో ప్రయాణమంతా అనుభూతి పొందుతారని అన్నారు.

కత్రాకు సులభమైన మార్గంలో చేరుకునే అవకాశం లభించినందున.. వచ్చే పదేళ్లలో ఈ ప్రాంతం ఊహించనంత వేగంగా సుసంపన్న అవుతుందని ఆయన అన్నారు. ఇది కేవలం రైలు కాదని.. అభివృద్ధికి ఆరంభమని మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ ప్రగతిలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications