Rain alert: ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, 50 కి.మీ వేగంతో గాలులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి, సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొంది.
పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. కాగా, హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచీ మేఘావృతమైంది. అయితే, మధ్యాహ్నం ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట్, కోఠి, ఉప్పల్, నాగోల్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. సముద్రమట్టానికి ఇది 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని వెల్లడించింది.
కాగా, వర్షం కురుస్తున్న సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications