ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ; సాయం ప్రకటన!!
క్షణాల వ్యవధిలోనే ఎవరూ ఊహించని ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వందల మంది మృతి చెందటంతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. 900 మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కోరమాండల్, బెంగళూరు హౌరా, ఒక గూడ్స్ రైలు డీకొన్న దారుణ ఘటన దేశాన్ని షాక్ కు గురి చేసింది. ఈ రైలు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ వాసులు కూడా మరణించటంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఒడిశాలోని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు.

హౌరా జిల్లాలోని డుముర్జల నుండి ప్రమాద స్థలానికి చేరుకున్న మమతాబెనర్జీ ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. ఒడిస్సాలో రైలు ప్రమాద ఘటన స్థలం వద్ద మీడియాతో మాట్లాడిన మమతాబెనర్జీ ఈ ప్రమాదంలో పశ్చిమబెంగాల్ వాసులు మరణించారని, మరణించిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.
రైల్వేశాఖ మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిందని మమతా బెనర్జీ తెలిపారు. నిన్న రాత్రి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఫోన్లో మాట్లాడారు. సహాయం అందించడానికి, చికిత్సకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుంది అని హామీ ఇచ్చారు. నిన్న రాత్రి ఒక బృందాన్ని కూడా బాలాసోర్ కు పంపించారు.
ఇదిలా ఉంటే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘోర రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనపై సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించనున్నారు.












Click it and Unblock the Notifications