వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: రాష్ట్రంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఒవైసీ ఎంత ప్రభావం చూపగలరు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అసదుద్దీన్ ఒవైసీ

"ముస్లిం ఓటర్లు ఇప్పటివరకూ ఓటు వేయడం నేర్చుకోలేదు. ఏం చేయాలో దానికి పూర్తి భిన్నంగా చేస్తారు. మా వర్గం వారు ఇంకా వెనకబడి ఉన్నారు. మా వరకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. దేశాన్ని ఎవరు సమర్థవంతంగా నడిపితే వారికే మా ఓటు"

పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా పలాసీలో హైవే పక్కన షాపు పెట్టుకున్న అబ్దుల్ వహాబ్ షేక్ ఈ మాటను చాలా ఆచితూచి అన్నారు. ఆయన చాలా ఏళ్లపాటు గల్ఫ్ దేశాల్లో పనిచేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి 27 నుంచి 30 శాతం వరకూ ముస్లిం ఓటర్ల గురించి చాలా చర్చ జరుగుతోంది.

అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎంతోపాటూ, ఫుర్‌ఫురా షరీఫ్ పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ వర్గం ఓట్లు ఈసారీ ఎవరికి పడతాయనే సందేహం నెలకొంది.

అయితే, ఈ రెండు పార్టీలూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి తేడా ఉండదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఈ పార్టీల వల్ల ముస్లిం ఓటు బ్యాంకుకు కాస్త గండిపడే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఎన్నికల్లో 30 శాతం ముస్లిం ఓట్లే కీలకం

దాదాపు గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో మైనారిటీల పాత్ర చాలా కీలకం అవుతోంది. అధికారం ఎవరికి దక్కేదీ ఈ వర్గం ఓటర్లే నిర్ణయిస్తూ వస్తున్నారు.

మొదట్లో లెఫ్ట్ ఫ్రంట్ చాలాకాలంపాటు ఈ ఓటు బ్యాంక్ నుంచి రాజకీయ లబ్ధి పొందింది. ఇప్పుడు, గత ఒక దశాబ్దంగా ఈ వర్గం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌కు అండగా ఉంది. కానీ, ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వల్ల తృణమూల్ ఓటు బ్యాంకుకు ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హుగ్లీ జిల్లాలోని ఫుర్‌ఫురా షరీఫ్ మైనారిటీల పవిత్ర స్థలం. దక్షిణ బెంగాల్‌లోని దాదాపు 2500 మసీదులపై దాని నియంత్రణ ఉంది.

ఎన్నికల సమయంలో ఫుర్‌ఫురా షరీఫ్‌ ప్రాధాన్యం చాలా పెరుగుతుంది. లెఫ్ట్ నుంచి టీఎంసీ, కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీల నేతలు ఇక్కడికి బారులు తీరుతుంటారు.

ఈ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ప్రబావం ఎమేరకు ఉండవచ్చు అనే ప్రశ్నకు సమాధానం తర్వాత తెలుస్తుంది. కానీ, రాష్ట్రంలో కులమత సమీకరణాలు దృష్ట్యా అది రంగంలోకి దిగడమనేది చాలా ముఖ్యమైన విషయం.

2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ మొత్తం జనాభాలో 27.01 శాతం ముస్లింలు ఉన్నారు. ఇప్పుడది 30 శాతానికి దగ్గరగా చేరుకుంది.

రాష్ట్రంలోని ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 40 శాతం కంటే ఎక్కువ.

కొన్ని ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ముర్షీదాబాద్‌లో 70 శాతం, మాల్దాలో 57 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు.

ముర్షీదాబాద్, మాల్దాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 100 నుంచి 110 స్థానాల్లో ముస్లింల ఓట్లు నిర్ణయాత్మకం అవుతాయి.

ముర్షీదాబాద్-మాల్దా ముస్లింలు ఏమంటున్నారు

రాష్ట్రంలో ముస్లిం రాజకీయాల గురించి అర్థం చేసుకోడానికి, ఆ వర్గం ఓటర్ల మనసు తెలుసుకోడానికి ముర్షీదాబాద్, మాల్దాను మించిన ప్రాంతాలు ఏవీ ఉండవు.

ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జనాభాను బట్టి, అక్కడి వారికి మైనారిటీ అనే మాట ఉపయోగించడం, తప్పుదారి పట్టించడమే అవుతుంది. నిజానికి, ఈ జిల్లాల్లో హిందువులే మైనారిటీలు.

కోల్‌కతా నుంచి ముర్షీదాబాద్, మాల్దాకు వెళ్తూ మేం మొదట పలాసీలో ఆగాం. కోల్‌కతాను ఉత్తర బెంగాల్‌తో కలిపే హైవే-34 పక్కనే ఉన్న ఈ పట్టణానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది.

ముర్షీదాబాద్ అప్పటి నవాబు సిరాజుద్దౌలా, ఆంగ్లేయుల మధ్య ఇక్కడ 1751 జూన్ 23న జరిగిన యుద్ధం.. తర్వాత దాదాపు 200 ఏళ్ల పాటు దేశంలో బ్రిటిష్ పాలనకు దారులు తెరిచింది.

చాలావరకూ, పలాసీ యుద్ధం దేశ భవిష్యత్తును, చరిత్రనే మార్చేసిందని చెప్పవచ్చు. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఆంగ్లేయుల చేతిలో ఎందుకు ఓడిపోయాడు, అందులో ఆయన సేనాధిపతి మీర్ జాఫర్ ఎలాంటి పాత్ర పోషించాడు అనేవి.. చరిత్ర పుటల్లో వివరంగా ఉన్నాయి.

ఒవైసీ ప్రభావం ఏమాత్రం ఉండదు

గల్ఫ్ దేశాల్లో ఏళ్ల తరబడి ఒక అమెరికా కంపెనీలో పనిచేసి, తర్వాత తన పూర్వీకుల నగరానికి వచ్చిన అబ్దుల్ వహాబ్ షేఖ్ అదే పలాసీలో కిరాణా షాపు నడుపుతున్నారు.

"ఇక్కడ, హిందూ-ముస్లిం అనే సమస్య లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే నేతలు దేశాన్ని నడపలేరు. అందుకే, ఈసారీ ముస్లింలు అన్ని ప్రత్యామ్నాయాలనూ దృష్టిలో పెట్టుకునే ఓటు వేస్తారు" అన్నారు.

"మా వర్గం ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తి, మా సమస్యలు అర్థం చేసుకునేవారికే ఈసారీ ముస్లింలు ఓటు వేస్తారు. సమర్థంగా ప్రభుత్వాన్ని నడిపించగలిగే వారికే మా ఓటు వేస్తాం" అని పలాసీలో మొబైల్ షాప్ నడిపే యువకుడు మొయినుద్దీన్ షేక్ అన్నారు.

పలాసీ నుంచి ముర్షీదాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ బెర్హమ్‌పూర్‌ వెళ్లాం. అక్కడ వారి నుంచి మిశ్రమ స్పందన లభించంది.

భాగీరథి నది ఒడ్డున ఉన్న బర్హమ్‌పూర్ నగర ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. నది మీద హైవేపై ఒకే ఒక బ్రిడ్జ్ ఉండడంతో, ప్రజలు నిత్యం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మోటార్ బోట్లపై నది దాటుతుంటారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

ఈ నగరంలో ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు తమ సమస్యల గురించి చర్చించడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు.

నగరంలోని లాల్‌బాగ్ ప్రాంతంలో హజార్‌దువారీ పాలెస్‌కు కుటుంబ సమేతంగా వచ్చిన షంసాద్ "ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ ఎవరు గెలిచినా, మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటాయి" అన్నారు.

ముస్లిం నేత, నగరంలోని లాల్‌బాగ్ స్థానం టీఎంసీ అభ్యర్థి మొహమ్మద్ అలీ, రాష్ట్ర ప్రజలకు ఒవైసీ, ఐఎస్ఎఫ్ గురించి వాస్తవాలు తెలీదని అంటున్నారు.

"మతం ఆధారంగా దేశాన్ని విభజించిన తర్వాత కూడా, కేవలం భాష ఆధారంగా తూర్పు పాకిస్తాన్‌ స్వయంగా ఒక దేశంగా మారింది. ఉర్దూ మాట్లాడే, బెంగాలీ మాట్లాడే ముస్లింల మధ్య చాలా వ్యత్యాసం ఉందనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. అందుకే, ఒవైసీ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించలేరు" అని ఆయన చెప్పారు.

"ఇక్కడ ఐఎస్ఎఫ్, ఒవైసీ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు. ఎంఐఎం గురించి ఇక్కడ కష్టంగా పది శాతం మందికి తెలిసుంటుంది. ఇక ఐఎస్ఎఫ్ గురించి తెలిసినవారు ఒక్క శాతం కంటే ఎక్కువ లేరు" అని బెర్హమ్‌పూర్‌లోని ఒక మసీదు మౌలానా షాజహాన్ షేఖ్ అన్నారు.

మరో మసీదు ఇమామ్ రకీబ్ "ఒవైసీ పార్టీ ఇక్కడ ఒక విధంగా చురుకుగా ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ ఆయన లేదా ఐఎస్ఎఫ్‌ ప్రభావం ఇక్కడ ఓటర్లపై ఏమాత్రం ఉండదు. ఇక్కడ టీఎంసీ, కాంగ్రెస్ ప్రభావం ఉంది" అన్నారు.

ప్రభావం లేకుంటే, మమతకు భయం ఎందుకు

కానీ జిల్లాలోని సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ మహతో దీనితో ఏకీభవించడం లేదు.

"ఒవైసీ పార్టీ లేదా ఐఎస్ఎఫ్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపవని అన్ని పార్టీల నేతలూ చెబుతూ ఉండచ్చు. కానీ, ముర్షీదాబాద్, మాల్దా మిగతా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో అది ఒక పెద్ద ఫ్యాక్టర్ కావచ్చు" అన్నారు.

మరోవైపు, "బెంగాల్‌లో మా పార్టీ ప్రభావం ఎమాత్రం లేదని చెబుతున్న మమతా బెనర్జీ, ప్రతి ర్యాలీలో ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు" అని జిల్లా ఎంఐఎం ఇన్‌ఛార్జ్ అసాదుల్ షేఖ్ ప్రశ్నించారు.

"మాకు ర్యాలీలకు అనుమతులు ఇవ్వడం లేదు. కోల్‌కతాలో ఒవైసీ ర్యాలీకి కూడా అనుమతి దొరకలేదు. మా పార్టీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ అసలు మా ప్రభావమే లేనప్పుడు.. మమత ఎందుకంత భయపడుతున్నారు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
West Bengal elections: How much influence can the Owaisi have on the Muslim majority areas of the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X