లుంగీ కడితే ఓటు లేదు.. ప్యాంటు వేస్తేనే అనుమతి!
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా గాయఘాటా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా వింత పరిస్థితి ఎదురైంది. కుచులియా ప్రైమరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు లుంగీలు ధరించి వచ్చిన పలువురు వృద్ధులను కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. లుంగీలతో లోపలికి రావడానికి వీల్లేదని.. ప్యాంట్లు వేసుకుని వస్తేనే ఓటు వేయనిస్తామని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఓటు వేయడానికి వెళ్లిన వృద్ధులను క్యూ లైన్ నుంచి బయటకు పంపడం తీవ్ర వివాదానికి దారితీసింది.
దుస్తులు మార్చుకుంటేనే ఓటు.. వృద్ధుడి ఇబ్బందులు
ఈ రూల్ వల్ల అనేక మంది వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 78 ఏళ్ల దిషార్ అలీ మొండల్ అనే వృద్ధుడిని భద్రతా సిబ్బంది క్యూ నుంచి పక్కకు పంపేసి, బట్టలు మార్చుకుని రమ్మని చెప్పారు. పాపం ఆయన వద్ద ప్యాంట్లు లేకపోవడంతో తన కుటుంబ సభ్యుడి దగ్గర ఓ ప్యాంటు అప్పుగా తీసుకుని.. దానిని వేసుకుని వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చింది.మరొక వృద్ధుడు గణేష్ మజుందార్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గ్రామీణ ప్రాంతం కావడంతో ఇక్కడ లుంగీ ధరించడం సర్వసాధారణమని.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆంక్షలు లేవని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ రంగు పులుముకున్న వివాదం
కేంద్ర బలగాల ప్రవర్తనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఓటర్లను వేధించడం కోసమే ఇలాంటి వింత నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో స్థానికులు నిరసనలు చేపట్టారు. పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆ ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాతే లుంగీ ధరించిన ఓటర్లను యథావిధిగా లోపలికి అనుమతించారు. అయితే ఈ ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్ గానీ.. కేంద్ర బలగాల అధికారులు గానీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications