• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలెక్సా, గూగూల్ లాంటి వాయిస్ అసిస్టెంట్లతో వచ్చే ప్రమాదాలేంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వాయిస్ అసిస్టెంట్

"హే అలెక్సా.. ", "ఓకే గూగుల్.. "అనే మాటలు ఇంటింటా వినిపిస్తున్నాయి. వాయిస్ అసిస్టెంట్ల హవా పెరుగుతోంది. చేతిలో పనులన్నీ వదిలేసి ఫోన్‍ తీసుకుని, దాని వంకే చూస్తూ, వేళ్లతో టైపు చేయాల్సిన అవసరం లేకుండాపోయింది వాయిస్ అసిస్టెంట్ల వల్ల. కొన్ని అడుగుల దూరంలో ఉండి, కొంచెం గట్టిగా పిలిచి పని అప్పజెప్తే క్షణాల్లో బుద్ధిగా చేసేస్తుంటాయి.

వచ్చిన కాల్స్ ఆన్సర్ చేయడం, మెసేజులు చెప్తుంటే టైప్ చేసి పంపడం, రిమైండర్లు సెట్ చేస్తే కరెక్టుగా గుర్తుచేయడం, గదుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటునుంచే లైట్లు, ఫ్యానులు వేయడం, ఆర్పడం, ఇంట్లో లేనప్పుడు కూడా ఇంటి స్థితిగతులను కనిపెట్టుకుని ఉండి అప్‍డేట్ చేయడం, పిల్లలకు కథలు వినిపిస్తూ వాళ్ల ధ్యాస మరల్చడం.. ఇలాంటివన్నీ చేసేస్తున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు పరికరాలు ఇవన్నీ చేయగలవని ఎవరూ ఊహించి ఉండరు.

అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లాంటి ప్రత్యేక పరికరాలెటూ ఉన్నాయి. అవి కాకుండా ప్రతి డివైజ్‌లో (ఫోన్లు వగైరా) కూడా వాయిస్ సూచనలతో పనిచేసే వీలుని ఏర్పాటు చేస్తున్నాయి కంపెనీలు. దీని వల్ల ఎన్ని ఉపయోగాలో అన్ని రకాల సమస్యలు కూడా. వాయిస్-కంట్రోల్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ అందించే సౌలభ్యంతో పాటు అది తెచ్చే ఇక్కట్లను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

వాయిస్ అసిస్టెంట్లు

వాయిస్ టెక్నాలజీ పెరుగుదల వెనుక కారణాలు

ఇంటర్నెట్ వృద్ధిలోకి వచ్చినప్పటి నుంచీ కీబోర్డే ప్రధాన ఇన్‍పుట్ పరికరంగా ఉంటూ వచ్చింది. కంప్యూటర్, డివైజ్‍కు ఏ సూచన ఇవ్వాలన్నా కీబోర్డే వాడాలి. మౌజ్/టచ్ కూడా కొంతవరకే ఉపయోగపడుతుంటుంది. అలాంటిది వాయిస్ ద్వారా సూచనలు ఇవ్వడం సాధ్యమయ్యాక టెక్నాలజీ వినియోగంలో కొన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

ముందుగా టైపింగ్ సమస్య పోయింది. ఒక సగటు మనిషికి టైపింగ్‍కన్నా మాట్లాడ్డం తేలిక. అలాగే, టైప్ చేయాలంటే స్పెల్లింగులు తెలియాలి, అవి అందరికీ బాగా రాకపోవచ్చు. అదే వాయిస్‍ అసిస్టంట్ ఉంటే, ఎలా పలకాలో తెలిస్తే చాలు. అన్నింటికన్నా ముఖ్యంగా, డివైజ్‍ పక్కన ఉండక్కర్లేదు. దూరంగా ఉన్నాచ వాయిస్‍ అసిస్టంట్‌తో పనులు జరిగిపోతాయి.

భారత్ లాంటి దేశాల్లో కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నవారిలో అత్యధికులు ఇంగ్లిష్‌లో కాకుండా తమ మాతృభాషలో, అది కూడా వాయిస్ ద్వారా సూచనలు ఇస్తున్నారని గూగుల్ ఒక నివేదికలో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది గూగుల్ అసిస్టెంట్ వాడుతుండగా, అత్యధికంగా వాడే భాషల్లో ఇంగ్లిష్ తర్వాత హిందీ ఉందని గూగుల్ గణాంకాలు చెప్తున్నాయి. 60 శాతం భారతీయులు తమ ఫోన్లపై వాయిస్ సూచనలు ఇస్తున్నారు.

"వంటగదిలో లైట్లు ఆపేయి", "బాత్రూమ్‍లో గీజర్ ఆన్ చేయి" లాంటి సూచనలు కూడా "ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్" (IoT) ద్వారా సాధ్యమవుతుండడంతో వాయిస్-కంట్రోల్డ్ అసిస్టెంట్ల గిరాకీ పెరిగిపోతుంది. పక్కనే ఉన్న మరో మనిషితో మాట్లాడుతున్నంత సులువుగా మాట్లాడుతూ పనులు కానిచ్చుకోవచ్చు. పైగా స్క్రీన్ల మీద యూజర్ ఇంటర్‍ఫేస్ (UI)కి అలవాటు పడాలి. ఏ మెనూకి వెళ్లి ఏం క్లిక్ చేయాలి, ఏ కీబోర్డ్ షార్ట్‌కట్ వాడాలి లాంటివన్నీ తెలుసుండాలి. అదే వాయిస్‍తో అయితే "ఫలనాది చేయి" అని చెప్తే అదే చేసేస్తుంది.

బిజీగా ఉండే మనుషులకు వీలు కల్పించడం మాత్రమే కాదు, పిల్లలకు వయసు మళ్లినవారికి కూడా వాయిస్ డివైజులు ఒక వరం. కంటి ఇబ్బందులున్న వారికి, స్క్రీన్ ఎక్కువ సేపు చూడ్డం వల్ల సమస్యలు ఎదుర్కునేవారికి, టైపు చేయడానికి వేళ్లు సహకరించనివారికి ఈ టెక్నాలజీవల్ల అనేక లాభాలు.

ఇది ఇంకా అభివృద్ధి చెంది "డిజిటల్ హ్యూమన్"గా పరిణామం చెందితే తీవ్రమైన ఒంటరితనం ఎదుర్కునేవారికి కూడా కొంత ఉపశమనం ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.

వాయిస్-కంట్రోల్డ్ అసిస్టెంట్లతో సెక్యూరిటీ సమస్యలు

ఈ టెక్నాలజీ వల్ల కలిగే సెక్యూరిటీ సమస్యలు అర్థం చేసుకోడానికి ముందు, ఇవెలా పనిజేస్తాయో తెలుసుకోవాలి.

ఇప్పుడు అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లాంటి పరికరాలను తీసుకుంటే, అవి ఈ కింది విధంగా పనిచేస్తాయి.

 • వేక్ వర్డ్ (wake word): ఇది మనిషిని పేరు పెట్టి పిలవడం లాంటిది. డివైజ్ కూడా ఒక పదమో, పదబంధమో (హే అలెక్సా, ఓకే గూగుల్) అనగానే నిద్ర లేచి, మన సూచన తీసుకోడానికి సిద్ధమవుతుంది.
 • ఇండికేటర్స్ (indicators): నిద్ర లేచానని సూచించడానికి పరికరం మీద లైట్లు వెలగడమో, సమాధానం చెప్పడమో జరుగుతుంది.
 • వెరిఫికేషన్ (verification): మీ మాటను గుర్తించి, అది మీరే అన్నారని, సరిగ్గా అన్నారని నిర్ధారించుకుంటుంది. దీనికోసం కంపెనీవారి క్లౌడ్ సర్వీసులకు వెళ్లవచ్చు.
 • ఎన్‍క్రిప్షన్ (encryption): మీరిచ్చే సూచనలు మరెవ్వరూ తెలుసుకునే వీలు లేకుండా భద్రపరుస్తుంది.
 • వాయిస్ రికార్డింగ్స్ నిలువ: మీరిచ్చే సూచనలన్నింటినీ జాగ్రత్త చేస్తుంది. తరువాత కావాలంటే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీ పనిచేయాలంటే ముందుగా మెషీన్లకి మన భాష అర్థం కావాలి. వేర్వేరు ఉచ్ఛారణలు, భావోద్వేగాలు, ప్రాంతీయతకు అనుగుణంగా మారే పదాలు తెలియాలి. మనం ఎలా అయితే చిన్నప్పటి నుంచి భాష, పదాలు నేర్చుకుంటామో, అలానే మెషీన్లు కూడా డేటా ద్వారా నేర్చుకుంటాయి.

అంటే, ఈ పరికరాలు మన మాటలను సేకరించి, వాటిని విశ్లేషించి, నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే అవి బాగా పనిచేయగలవు. అందుకని కంపెనీలన్నీ మన మాటల రికార్డింగులను వాళ్ల సర్వర్లలో నిలువ చేస్తారు. వీటితో మెషీన్ లెర్నింగ్ మోడల్స్‌కు శిక్షణ ఇస్తుంటారు. కొన్నిసార్లు, దీని కోసమే ప్రత్యేకంగా మనుషులను నియమించి మెషీన్ల పనితీరును గమనిస్తారు. అవి మాటలను, సూచనలను సరిగా గుర్తుపడుతున్నాయో లేదో నిర్థారిస్తారు.

అలెక్సాకి, ఒకే గూగుల్‍కి టైప్ చేయమని చెప్పిన ప్రతీ మాట రికార్డ్ అవుతుందన్న మాట. పర్సనల్ విషయాలే కావచ్చు, ఆఫీసు వివరాలు, అభిరుచులు అన్నీ మన పెదవి దాటగానే మరో చోట నిక్షిప్తమవుతాయి. వీటిని ఎవరెవరు వింటారో, ఎలా వాడతారో మనకు తెలియకపోవడం మొదటి సమస్య.

అలెక్సా

నిజానికి, "వేకప్ వర్డ్" చెప్పాకే పరికరం మన మాటలను విని, మనం చెప్పినవి చేయాలి. కాకపోతే మనం ఎప్పుడు "వేకప్" చెప్తామోనని అది నిద్రపోతున్నా (ప్లగ్ తీసేస్తే తప్ప) వింటూనే ఉంటుంది. ఇలా ఎప్పుడూ వింటూ ఉంటుంది కాబట్టి, ఇంట్లో అందరి గొంతులను, మాటలను రికార్డ్ చేసుకుంటూ పోయే అవకాశం ఉంది. ఇది రెండో సమస్య.

వాయిస్ అసిస్టెంట్లు పనిచేయాలంటే ముందుగా వాటికి అకౌంట్ ఇన్ఫో ఇవ్వాలి. ఉదాహరణకు, ఈమెయిల్ చదవాలంటే ఈమెయిల్ అకౌంట్‍కు పర్మిషన్ ఇవ్వాలి, బ్యాంక్ బాలెన్స్ చూడాలంటే బ్యాంకింగ్ ఆప్ వివరాలు ఇవ్వాలి. ఎప్పుడైనా ఈ పరికరాలు హ్యాక్ అయితే, వాటితో పాటు ఇలాంటి సమాచారం కూడా దుండగుల చేతిలోకి వెళ్లే ప్రమాదముంది.

మన ఫోన్లకు పాస్‍వర్డ్‌లు ఉంటాయి. మనం ఆ వివరాలు ఇస్తేనే అవి తెరుచుకుంటాయి. వాయిస్ టెక్నాలజీలో ఇలాంటి "ఎంట్రీ గేట్లు" తక్కువ.

ఈ పరికరాలను హైజాక్ చేయడం సులభం. మనుషులకి వినపడని అల్ట్రా-సోనిక్ తరంగాల ద్వారా "వేకప్ వర్డ్" వినిపిస్తే, నిజంగానే పిలిచారనుకుని పరికరం నిద్రలేచి దుండగులు చెప్పిన పనులన్నీ చేసిపెడుతుంది.

అల్ట్రా-సోనిక్ తరంగాలు డాల్ఫిన్లకి మాత్రమే వినిపిస్తాయి కనుక, ఈ రకం అటాక్‍ను డాల్ఫిన్ అటాక్ అంటున్నారు. పరికారలను తయారుచేసే కంపెనీలు ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేయవచ్చు, కానీ దానికి మొత్తం హార్డ్‌వేర్ మార్చాల్సి రావచ్చు. అందుకని అరకొర సెక్యూరిటీ నియమాలతోనే పరికరాలను మార్కెట్‍లోకి విడుదల చేసేస్తున్నారు.

మీ వాయిస్ అసిస్టెంట్‍ను భద్రపరచుకోవాలంటే…

వాడుకోడానికి తేలికగా, ఉపయోగకరంగా ఉంది కదా అని డివైజ్ కొన్నప్పుడు ఉన్న సెట్టింగ్స్‌తో వదిలేయకుండా, మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ టెక్నాలజీ కూడా లాభదాయకం.

వాటిల్లో కొన్ని:

 • వాయిస్ అసిస్టెంట్ పరికరాలను ఎప్పుడూ నమ్మదగిన నెట్క్‌వర్క్‌లకే కనెక్ట్ చేయాలి. పబ్లిక్ నెట్కవర్క్, హాట్‍స్పాట్లకి కనెక్ట్ చేయకూడదు.
 • వాయిస్ అసిస్టెంట్‍లతో పాటు వచ్చే మొబైల్ ఆప్స్, ఆకౌంట్లకు వీలైనంతగా బలమైన పాస్‍వర్డ్‌లు, మల్టీ ఫాక్టర్ అథెన్‌టికేషన్ పెట్టుకోవాలి.
 • అవసరమైన ఫీచర్లను మాత్రమే వాడాలి. వాడుకలో లేని ఫీచర్లకు ఊరికే పర్మిషన్ ఇవ్వకూడదు. దానివల్ల ఆ అకౌంట్ ఇన్‍ఫర్మేషన్ లీక్ అవ్వడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
 • వాడకంలో లేనప్పుడు డివైజ్‌ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. లేకపోతే అవసరం లేని మాటలను కూడా వింటూ, చెప్పని పనులు కూడా చేసి ఇబ్బందులు తెస్తుంది.
 • మనుషులకు వినిపించని శబ్దాలకు కూడా ఈ డివైజులు స్పందిస్తాయి. కాబట్టి (పైన చెప్పుకున్న డాల్ఫిన్ అటాక్) కీలకమైన సర్వీసులకు వీటిని వాడకూడదు. ఉదా: డోర్ సెక్యూరిటీ సిస్టం వాడితే, అది హైజాక్ అయితే, అప్పుడు ఇంటికే ప్రమాదం కదా.
 • ఎప్పటికప్పుడు డివైజ్‌లను ఆలస్యం/అలక్ష్యం చేయకుండా అప్‍డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త firmwareలు పాతవాటికన్నా ఎక్కువ భద్రత కల్పిస్తాయి.
 • వాయిస్ ద్వారా కొనుగోళ్లను (voice purchase) అవసరమైనప్పుడే వాడి, వెంటనే ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే, అనవసరపు కొనుగోళ్లు జరిగి డబ్బులు పోతాయి.
 • కొత్త పరికరం కొనగానే దానిలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమిటన్నది చూసుకుని, అవసరం అనుకున్నవే ఉంచి, మిగితావి తీసేయాలి.
 • ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డివైజ్‌లకు మన అకౌంట్ల పాస్‍వర్డ్స్/పిన్‍కోడ్స్ గుర్తుపెట్టుకోమని చెప్పకూడదు. ఆ వివరాలు బయటకు పొక్కితే చాలా ప్రమాదం.
 • 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసేవారు ఈ డివైజ్‌లను ఆఫీస్/పర్సనల్ అకౌంట్లను వేరుగా ఉంచడం మేలు. అలాగే, ఏదైనా గుప్త సమాచారం గురించి మాట్లాడుతుంటే ఈ పరికరాలకు దూరంగా ఉండడమో, స్విచాఫ్ చేసి మాట్లాడడమో మంచిది.

రానున్న కాలంలో వాయిస్-కంట్రోల్ అసిస్టెంట్లు, వర్చువల్ అసిస్టెంట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వాటితో పాటే సెక్యూరిటీ సమస్యలూ పెరుగుతాయి . వీటిని వినియోగించడంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేకపోతే, మన కీలక సమాచారమంతా ఇతరులకు చేరే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the dangers of voice assistants like Alexa and Google?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X