• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సింఘు బోర్డర్‌లో దళిత సిక్కును నరికి, బ్యారికేడ్‌కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews

సింఘు బోర్డర్‌లోని నిహంగ్ సిక్కుల 'పంథ్ అకాలీ నిర్బైర్ ఖాల్సా' గ్రూప్ గురుద్వారా బయట జర్నలిస్టులు గుమిగూడి ఉన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున ఇదే గురుద్వారా బయట పంజాబ్ తర్న్ తారన్ జిల్లాకు చెందిన దళిత సిక్కు లఖ్‌బీర్ సింగ్‌ను హత్య చేసి, అతడి శవాన్ని బారికేడ్‌కు వేలాడదీశారు.

లఖ్‌బీర్ సింగ్ ఇదే గురుద్వారాలోని సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అవమానించాడని, ఆ సమయంలో అతడిని పట్టుకుని, తర్వాత క్రూరంగా శిక్షించామని నిహంగ్ సిక్కులు చెబుతున్నారు.

అక్కడే ఉంటున్న నిహంగ్, వారి జత్థేదార్ దీనిని నిహంగ్ సిక్కులు విధించిన శిక్షగా చెబుతున్నారు.

ఈ గురుద్వారాకు ఇన్‌ఛార్జ్, దళంలోని నిహంగుల జత్థేదార్ అయిన బల్విందర్ సింగ్ జర్నలిస్టులకు అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

"ముందే ఇలాంటి శిక్ష వేసుంటే పవిత్ర గ్రంథానికి అవమానం జరిగేది కాదు. ఇలా చేసినందుకు గర్వంగా ఉంది" అంటున్నారు.

నిహంగ్ సిఖ్ సరబ్‌జీత్ సింగ్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు.

"నాకు ఈ ఘటన గురించి ఎలాంటి విచారం లేదు. నేను చేసింది, ముమ్మాటికీ సరైనదే" అని బీబీసీతో అన్నారు.

నిహంగ్ సిక్కులు

శుక్రవారం ఏం జరిగింది?

లఖ్‌బీర్ సింగ్‌ పవిత్ర గ్రంథాన్ని ధ్వంసం చేయడం మొదట తానే చూశానని భగ్‌వంత్ సింగ్ చెబుతున్నారు. తను అతడిని పట్టుకున్న తర్వాత, జనం గుమిగూడారని బీబీసీతో అన్నారు.

"తెల్లవారుజామున 3 గంటలు అయ్యుంటుంది. మేం స్నానం చేసి తలపాగా కట్టుకుంటున్నాం. అప్పుడే గురుద్వారా కర్టెన్లు తీసి ఉండడం, రుమాలా కిందకు ఉండడం నాకు కనిపించింది. అతడు గ్రంథం పైన రుమాలా తీశాడు. అక్కడ రెండు అగ్గిపుల్లలు కూడా ఉన్నాయి. బహుశా తను నిప్పుపెట్టాలని కూడా అనుకున్నాడు" అని ఆయన చెప్పారు.

తర్న్ తారన్ జిల్లా చీమా కలా గ్రామానికి చెందిన లఖ్‌బీర్ సింగ్ కొన్ని రోజుల క్రితమే ఈ గురుద్వారాకు వచ్చారు. అక్కడ సేవలు కూడా చేస్తున్నారు.

"అతడు చాలా నమ్మకంగా ఉంటూ మా దళంలో చేరిపోయాడు. తను డ్రగ్స్ కూడా తీసుకుని ఉండచ్చు. ఏదో పథకంతోనే తను ఇక్కడకు వచ్చినట్లు మాకు అనిపిస్తోంది" అన్నారు భగవంత్ సింగ్.

భగవంత్ సింగ్, ఈ ఘటనలో మిగతా ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం లఖ్‌బీర్‌ను రైతు ఉద్యమ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు.

కలకలం రేగడంతో జనం భారీగా గుమిగూడారు. లఖ్‌బీర్‌ను మొదట అక్కడే విచారించారు. అతడు చెప్పింది మొబైల్లో రికార్డ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన చాలా వీడియోల్లో గాయపడిన లఖ్‌బీర్ నేలపై పడి ఉండడం, నిహంగ్ సిక్కులు అతడిని ప్రశ్నించడం కనిపిస్తోంది.

ఈ వీడియోలో కనిపించే నిహంగ్‌లలో బుధా దళ్ జత్థేదార్ అమాన్ సింగ్ కూడా ఉన్నారు. జరిగిన దానికి తనకు ఎలాంటి విచారం లేదని ఆయన బీబీసీతో అన్నారు.

"గురు సాహబ్‌ను ధ్వంసం చేశారు. మొత్తం సృష్టికి ఆయనే గురువు. శిక్ష ఆయనే వేశాడు. మా సిక్కులు దాన్ని అమలు చేశారు. ఈ దుష్టుడు గీత లేదా ఖురాన్‌ను అవమానించినా అప్పుడు కూడా అతడికి అదే శిక్ష విధించేవారు. రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాలు చేసుకోండి. కానీ గురువుకు దూరంగా ఉండి చేసుకోండి" అన్నారు.

లఖ్‌బీర్ సింగ్‌ను మొదట ప్రశ్నించారని, తర్వాత అతడి చేతిని నరికేశారని, మళ్లీ విచారించిన తర్వాత అతడిని పంథ్ నిర్బైర్ గురుద్వారా బయట బారికేడ్‌కు వేలాడదీశారని ప్రత్యక్ష సాక్షుల వివరాలను బట్టి తెలుస్తోంది.

ఈ కేసులో అమృత్‌సర్ దగ్గర పోలీసులు మరో నిహంగ్ నారాయణ్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు అమృత్‌సర్ రూరల్ ఎస్ఎస్‌పీ రాకేష్ కౌశల్ శనివారం చెప్పారని జర్నలిస్ట్ రవీంద్ర సింగ్ రాబిన్ బీబీసీకి తెలిపారు.

లఖ్‌బీర్ సింగ్‌ను హత్య చేసినవారిలో తాను కూడా ఉన్నానని నారాయణ్ సింగ్ చెబుతున్నారు.

షాక్‌లో రైతులు

ఒకవైపు నిహంగ్ సిక్కులు జరిగిన ఘటనను సమర్థించుకుంటుంటే, మరోవైపు నిరసనలు జరిగే ప్రాంతంలోని రైతులు దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మేం మాట్లాడాలని ప్రయత్నించిన రైతుల్లో చాలా మంది కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు.

సింఘు బోర్డర్‌లో మృతుడిని వేలాడదీసిన ప్రాంతానికి రెండు వందల మీటర్ల దూరంలో రైతులు నిరసనలు చేస్తున్న వేదిక ఉంది. శుక్రవారం ఈ ఘటన తర్వాత కూడా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వేదిక మీద నుంచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

https://twitter.com/Kisanektamorcha/status/1449348767539359749?

ఈ ఘటనను ఖండించిన సంయుక్త్ కిసాన్ మోర్చా దీనికి పూర్తిగా దూరంగా ఉండాలని భావించింది. నిరసనలు జరిగే ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని నిహంగ్ సిక్కులను కోరింది.

కిసాన్ మోర్చా ప్రకటనపై నిహంగ్ సిక్కుల జత్థేదార్ బల్విందర్ సింగ్ స్పందించారు.

"వారికి సంబంధాలు వద్దనిపిస్తే, పోనివ్వండి. కానీ ప్రజలందరితో మా సంబంధాలు ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే అక్కడ మేముంటాం. మమ్మల్ని రక్షించడం కోసమే సృష్టించారు. మోర్చా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మంటే, మేం వెళ్లిపోతాం. మేం ఉద్యమాన్ని విఫలం కానివ్వం. ఉద్యమం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం" అన్నారు.

పోలీసుల తీరు

ఘటనాస్థలం హరియాణా సోనిపత్ జిల్లా కోండలీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అది రాజధాని దిల్లీకి పక్కనే ఉంటుంది. ఘటనాస్థలాన్ని హరియాణా పోలీసు టీమ్ చాలాసార్లు పరిశీలించింది. కానీ పోలీసులు ఎవర్నైనా విచారించడం, నిహంగ్ సిక్కుల క్యాంప్‌లోకి వెళ్లడంగానీ జరగలేదు.

హరియాణా పోలీసు ఉన్నతాధికారి రోజంతా కోండలీ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. రోహ్తక్ రేంజ్ ఐజీ సందీప్ ఖిర్వార్ ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడారు.

"మేం ఘటనాస్థలం నుంచి సాక్ష్యాలు సేకరించాం. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం. మా దగ్గర నిందితుల సమాచారం ఉంది. ఈ ఘటన గురించి ఉదయం 5 గంటలప్పుడు పోలీసులకు సమాచారం అందింది. కొందరు అనుమానితులను మేం గుర్తించాం, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం" అని ఆయన చెప్పారు.

https://twitter.com/ANI/status/1449013431273603074?

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నిహంగ్ సిక్కు సరబ్‌జీత్ సింగ్ శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. ఆయన అరెస్టును సోనిపత్ పోలీసులు కూడా మీడియాకు ధ్రువీకరించారు.

"ఏం జరిగిందో, అది నేనే చేశాను, దీనిలో వేరే ఎవరి ప్రమేయం లేదు. ఈ దుష్టుడిని చంపినందుకు నాకు ఎలాంటి విచారం లేదు" అని లొంగిపోవడానికి ముందు సరబ్‌జీత్ అన్నారు.

సింఘు బోర్డర్ దగ్గర ఉన్న నిహంగ్ సిక్కులు లొంగిపోవడానికి ముందు సరబ్‌జీత్ సింగ్‌ను గౌరవించారు.

"మేం రైతులతో కలిసి పోరాడుతూ పది నెలలు అయిపోయింది. ఎవరో దుష్టుడు మా గురువును అవమానించాలని ప్రయత్నించాడు. మేం అతడికి శిక్ష విధించాం" అని ఆయన లొంగిపోయే సమయంలో అక్కడే ఉన్న జత్థేదార్ అమాన్ సింగ్ అన్నారు.

"సరబ్‌జీత్‌ను చూసి మాకు గర్వంగా ఉంది. రైతుల సమస్యకు పరిష్కారం లభించేవరకూ మేం ఇక్కడే ఉంటాం. మేం సరబ్‌జీత్‌ను గౌరవంగా అధికారులకు అప్పగిస్తున్నాం" అని మరో జత్థేదార్ రాజా రాజ్ సింగ్ అన్నారు.

జత్థేదార్ అమాన్ సింగ్ కిసాన్ మోర్చాకు హెచ్చరికలు కూడా చేశారు.

"రాజకీయాలు చేయాలనుకుంటే, గురువుకు దూరంగా ఉంటూ చేసుకోండి. మేం ఇప్పటివరకూ రైతు నేతలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మీరు కూడా బాగా ఆలోచించి ప్రకటనలు చేయాలని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాం. ఇక్కడ జరిగింది గురు సాహెబ్ ఆదేశాలతో జరిగింది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What happened before and after the incident where a Dalit Sikh was cut down and hung on a barricade on the Singh Border? - Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X