• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడే ‘‘కంగారూ కేర్’’ ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కంగారూ కేర్

నైజీరియాకు చెందిన ఓజోమా ఎఖోమున్ తన తొలి శిశువుకు 31 వారాల్లోనే జన్మనిచ్చారు.

పుట్టినప్పుడు ఆమె బిడ్డ కేవలం 700 గ్రాములు మాత్రమే ఉంది. తనను లాగోస్‌లోని అమూవో ఆడాఫిన్ మెటెర్నల్ అండ్ చైల్డ్ సెంటర్‌లోని ఇంక్యుబేటర్‌లో పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా తన బరువు ఒక కేజీకి పెరిగింది. ఆ తర్వాత అతడిని తల్లి ఛాతీపై చర్మం శిశువు చర్మాన్ని తాకేలా పడుకొబెట్టారు.

ఇలా చర్మం-చర్మం కలిసేలా తల్లి ఛాతిపై బిడ్డను పడుకోబెట్టే విధానాన్నే ''కంగారూ కేర్’’గా పిలుస్తారు. ఇది ఓజోమా విషయంలో బాగా పనిచేసింది.

''ఇప్పుడు నా బిడ్డ సురక్షితంగా ఉన్నాడు’’ అని 26ఏళ్ల ఎఖోమున్ తెలిపారు. ''బిడ్డ నా ఛాతీపై నిద్రపోతున్నప్పుడు కలిగే వేడిని నేను ఆస్వాదించాను’’ అని ఆమె చెప్పారు.

కంగారూ కేర్

ఇంక్యుబేటర్ కంటే మేలా?

కొలంబియా బొగోటాలోని శాన్ జువాన్ డే డియో హాస్పిటల్‌లో మెటర్నిటీ యూనిట్‌లో 1978లో ఇద్దరు శిశు వైద్య నిపుణులు మొదట ఈ విధానాన్ని ప్రతిపాదించారు. నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విధానం మేలైనదని చెబుతోంది.

ఇదివరకు ఇంక్యుబేటర్‌లు మాత్రమే ఉపయోగించాలని తమ మార్గదర్శకాల్లో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

అయితే, తాజా మార్గదర్శకాల్లో కంగారూ కేర్ కూడా మేలైనదేనని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా అందుబాటులోలేని ప్రాంతాల్లో ఇది మెరుగ్గా పనిచేస్తుందని వివరించారు.

''కంగారూ కేర్’’తోపాటు పుట్టిన వెంటనే తల్లిపాలను ఇవ్వడంతో ఏటా 1,50,000కుపైగా శిశు మరణాలను అడ్డుకోవచ్చని కొత్త పరిశోధన చెబుతోంది.

కంగారూ కేర్

కంగారూ కేర్ ఎలా పనిచేస్తుంది?

ప్రీమెచ్యూరిటీ అనేది అత్యవసరంగా దృష్టిపెట్టాల్సిన ఆరోగ్య సమస్య అని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది నెలలు నిండకుండానే జన్మిస్తున్నారు.

అంటే ప్రతి పది మంది శిశువుల్లో ఒక శిశువు ఇలానే పుడుతోంది.

మరోవైపు 2 కోట్ల మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు.

ఈ నంబర్లు వరుసగా పెరుగుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో ప్రీమెచ్యూరిటీ వాటా క్రమంగా పెరుగుతోంది.

బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకుండా పుట్టడం లాంటివి పిల్లల్లో చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.

శరీరంలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటంతో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు.

శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చూసేందుకు కొంత వరకు ఇంక్యుబేటర్లు తోడ్పడతాయి.

మొత్తం ప్రీమెచ్యూర్ కేసుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు అల్ప, మధ్యాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి.

కంగారూ కేర్

ఎందుకు ముఖ్యం?

పిల్లలను తల్లి ఛాతీపై చర్మం-చర్మం తగిలేలా పడుకోబెట్టడంతో పిల్లల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించొచ్చు.

ఫలితంగా హైపోథెర్మియా సమస్య వచ్చే ముప్పు తప్పుతుంది. హైపోథెర్మియాతో పిల్లల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది.

కంగారూ కేర్ విధానంతో ఆరోగ్య సదుపాయాలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఈ విధానంతో తల్లి, బిడ్డలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో యూనిసెఫ్ కూడా తాజా వెల్లడించింది. అవి ఏమిటంటే..

  • ఇటు తల్లి, అటు బిడ్డ.. ఇద్దరూ ప్రశాంతంగా ఉండేందుకు ఈ విధానం తోడ్పడుతుంది
  • పిల్లల గుండె కొట్టుకునే విధానం, శ్వాసను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది. తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన పిల్లలు బాహ్య ప్రపంచానికి అలవాటు పడేందుకు సాయం చేస్తుంది.
  • పిల్లల జీర్ణ ప్రక్రియలు మెరుగ్గా అయ్యేలానూ ఇది చూస్తుంది
  • శరీర ఉష్ణోగ్రతను కూడా ఇది నియంత్రిస్తుంది
  • తల్లి చర్మంపై ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు పిల్లల చర్మంపైకి వెళ్లేందుకు కంగారు కేర్ తోడ్పడుతుంది. దీని వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పిల్లలకు వస్తుంది
  • బిడ్డకు పాలివ్వడానికి తోడ్పడే హార్మోన్ల నియంత్రణకూ ఇది దోహదపడుతుంది

ఏం చేయాలి?

నెలలు నిండకుండా పుట్టే పిల్లలు, బరువు తక్కువగా ఉండే శిశువుల విషయంలో రోజుకు 18 గంటల వరకు కంగారు కేర్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది తల్లులు ఇంత సమయం పిల్లలను తమపైనే పడుకోబెట్టుకోవడంతో ఇబ్బంది పడొచ్చు.

కానీ, లాగోస్‌కు చెందిన 40ఏళ్ల అంతిన్ ఏహీ మాత్రం ఇది తనకు దొరికిన చక్కని అవకాశం అని అంటున్నారు.

గత ఏప్రిల్‌లో నెలలు నిండకుండానే ఆమెకు పాప జన్మించింది.

పాప ఆరోగ్యం కుదుటపడేవరకూ ఛాతీపై ఆమెను పడుకోబెట్టుకున్నారు.

''అసలు మనం ఆ అనుభూతిని అనుభవించేవరకు అది ఎలా ఉంటుందో చెప్పలేం. నిజంగా అదొక గొప్ప అనుభూతి. నేను నైట్‌గౌన్ వేసుకుని పాపను లోపలకు తీసుకునేదాన్ని. చాలా సేద తీరుతున్నట్లుగా అనిపిస్తుంది’’అని ఆమె చెప్పారు.

''రోజు మొత్తం అలానే ఉండిపోవచ్చు. ఒకసారి ఛాతీపై వారిని పడుకోబెట్టి తర్వాత, వారు ప్రశాంతంగా అలానే ఉండిపోతారు. అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది’’అని ఆమె వివరించారు.

మరోవైపు కంగార్ కేర్‌ తీసుకునే పిల్లలు తక్కువగా ఏడుస్తారని, ప్రశాతంగా నిద్రపోతారని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కంగార్ కేర్ అనేది తల్లి-బిడ్డల చుట్టూ తిరుగుతోంది. అయితే, తండ్రులు కూడా పిల్లలను తమపై పడుకోబెట్టుకుంటే ఇలాంటి ఫలితాలే ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

మెరుగైనది.. రక్షణ కల్పిస్తుంది..

తొలిసారి తల్లైన ఎఖోమున్.. ఈ విధానం సాయంతో తన బాబును మెరుగ్గా సంరక్షించ గలుగుతున్నారు.

ఇప్పుడు ఆమెకు పుట్టిన శిశువుకు ఎలాంటి ఆరోగ్య ముప్పూలేదు. తన ఎదుగుదల కూడా సవ్యంగానే ఉంది. ఇప్పటికీ తన ఛాతీపైనే తన శిశువును పడుకోబెట్టుకోవడానికి ఎఖోమున్ మొగ్గు చూపుతున్నారు.

''నా బిడ్డ నడవడం మొదలుపెట్టే వరకు ఈ విధానాన్ని నేను కొనసాగిస్తాను’’అని ఆమె అంటున్నారు.

(ఆధారం: బీబీసీ ఫ్యూచర్ కోసం అయోడేల్ జాన్సన్ రాసిన కథనం)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is "Kangaroo Care" that protects premature babies?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X