వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివెంజ్ పోర్న్ అంటే ఏమిటి? రక్షణ కోసం ప్రత్యేక చట్టాలున్నాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ట్యాబ్లెట్‌ని చూస్తున్న యువతి

కవిత, రమేశ్ (పేర్లు మార్చాం) ఏడాది పాటు రిలేషన్‍షిప్‍లో ఉన్నారు. వాళ్ళ బ్రేకప్ అయిన మూడు నెలలకు కవిత ఫ్రెండ్స్ ఆమెకి వాట్సాప్‍లో కొన్ని మెసేజీలు పంపారు. ఆ ఫోటోలు అశ్లీలంగా అసభ్యంగా ఉన్నాయి. షాకింగ్ ఏమిటంటే అవి కవిత ఫోటోలే.

ఇది రమేశ్ పనేనని కవితకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కారణం.. ఆ ఫోటోలన్నీ రమేశ్ ఫోన్‍లో తీసినవే.

కొన్ని తనకి చెప్పి తీశాడు. చాలా తనకి తెలీకుండా తీశాడని ఇప్పుడు అర్థమైంది.

బ్రేకప్ అయ్యాక కవిత వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు, మెయిల్స్, చాట్స్ అన్నీ డిలీట్ చేసేసింది. రమేశ్ కూడా చేస్తానన్నాడు కానీ చేయలేదు. ఒకప్పటి తమ బంధం తాలూకు ప్రైవేట్ క్షణాల్లో కవిత ఫోటోలు మాత్రమే బయటపెడతానని కొన్నాళ్ళు బెదిరించాడు. అయినా కవిత అతనిని దూరం పెట్టడంతో అన్నంత పనీ చేశాడు.

కవితకు ఆ ఫోటోలు చూడగానే కాళ్ళ కింద నేల జారిపోతున్నట్టు అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలో, ఆ ఫోటోలు ఎలా డిలీట్ చేయించాలో అర్థం కాలేదు. ఎవరికి చెప్పుకున్నా, "నీదే తప్పు. నువ్వే తిరిగావు. అనుభవించు ఇప్పుడు" అని తననే నిందిస్తారని భయం, సిగ్గు. పైగా రమేశ్‍ని ఇష్టపడిన మాట వాస్తవం. అతనికి దగ్గరవ్వడం నిజం. ఇంత దారుణంగా దిగజారగలడు అతనని ఊహించలేకపోవడం, అప్రమత్తంగా ఉండకపోవడం తన తప్పనే నిందించుకుంది.

ఇంకొందరు స్నేహితులు కూడా ఇంటర్నెట్టులో అనేక చోట్ల తన ఫోటోలు అభ్యంతరక రీతిలో కనిపిస్తున్నాయని చెప్పేసరికి ధైర్యం చేసి మహిళా కమీషన్, పోలీసులని ఆశ్రయించింది. వాళ్ళు తగిన చట్టాల కింద కేసు నమోదు చేయించి, ఆయా ప్లాట్‍ఫార్మ్స్ నుంచి ఫోటోలు డిలీట్ చేయించారు. రమేశ్‍ కు కూడా శిక్ష పడేట్టు కోర్టులో కేసు వేశారు.

ఈ తరహా కేసులని "రివెంజ్ పోర్న్" అని అంటారు. ఇలాంటివాటికి మహిళలు ఎక్కువగా బాధితులే అయినా, మగవారు, పది పదకొండేళ్ళు దాటని పిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు.

మహిళలు, నీలిచిత్రాలు

రివెంజ్ పోర్న్ అంటే ఏమిటి?

ఇమేజీలు/వీడియోలతో చేసే సెక్స్యువల్ అబ్యూజ్‍కి ఉన్న పేరు అది. ఒక బంధంలో ఉన్నప్పుడు తీసుకున్న ప్రైవేట్ ఫోటోలను తర్వాత అవతలి వారి అనుమతి లేకుండా ఇంటర్నెట్ పై పబ్లిక్ డొమేన్‍లో అందరికో, లేదా ప్రైవేటుగా కొందరికో అందుబాటులో ఉండేట్టు చేయడమే రివెంజ్ పోర్న్.

ఇలా చేయడం వెనుక ముఖ్యంగా బెదిరించడం, మానసిక హింసకి గురిచేయడం లాంటి దురుద్దేశ్యాలే ఉంటూ ఉంటాయి. బంధంలో ఉన్నప్పుడు పంచుకున్న మధుర క్షణాలనే వాడుకుని అవతలివారి మానసిక క్షోభ కలిగించడానికి పూనుకుంటారు. కొందరు వీటిని అడ్డం పెట్టుకుని ముందుగా బెదిరిస్తారు, మరికొందరు చెప్పా పెట్టకుండా రిలీజ్ చేసేస్తారు.

పోర్నోగ్రఫీలో కూడా అందులో పాల్గొనే ఇద్దరివీ ఆమోదం ఉంటేనే జరుగుతుంది. అలాకాకుండా ఆమోదం లేకుండానే జరిగే దీన్ని "రివెంజ్ పోర్న్" అన్న పదబంధం వాడడం పట్ల కూడా కొందరు అభ్యంతరాలు లేపుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఇలాంటి నేరాలను ఆ పేరుతోనే పిలుస్తున్నారు.

ఈ నేరాలకు వేదికలు అనేకం. బాధితుల ఫోటోలని ఆఫ్‍లైన్, లేదా ఆన్‍లైన్ వేదికల్లో పంచుకుంటుంటారు. ఆన్‍లైన్‍లో అయితే సోషల్ మీడియా, అడల్ట్ వెబ్‍సైట్స్, ఈమెయిల్, చాట్స్ లో పంచుకోవచ్చు. లేదా, తెలిసిన వారున్న వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల్లో. చాలా వరకు ఇలాంటి ఫోటోలలో అవతలివారి వివారాలు (పేరు, అడ్రస్, సోషల్ మీడియా హాండిల్స్) కూడా పెడుతుంటారు.

అలా చేయడం ద్వారా ఆ మనిషి మన సమాజంలో తీవ్ర అవమానాలకి గురయ్యే అవకాశాలున్నాయి (ముఖ్యంగా మహిళలు అయితే) కాబట్టి వారికి వీలైనంత చెడ్డ పేరు తేవడానికి చూస్తుంటారు.

రివెంజ్ పోర్న్

టెక్నాలజీ అందుబాటుతో విజృంభిస్తున్న రివెంజ్ పొర్న్

ఈ తరహా ప్రైవేట్ ఫోటోలతో వ్యక్తులని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ముందు నుంచీ ఉన్న విషయమే అయినా టెక్నాలజీ వలన ఇది మరింత వికృత రూపాన్ని దాలుస్తుంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2012-2014 మధ్యనే అశ్లీల ఫోటోలు ఆన్‍లైన్‍లో అప్‍లోడ్ చేయడం 104% పెరిగింది. గత ఐదారేళ్ళల్లో మంచి కెమరాలతో ఉన్న ఫోన్లు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం, ఫోటోలు/వీడియోలు అప్‍లోడ్ చేయడానికి అనువుగా డేటా ప్లానులు చవకగా అందుబాటులో ఉండడం వల్ల ఈ రకమైన నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దానికి తోడు కోవిడ్ కాలంలో ఆన్‍లైన్ వినియోగం బాగా పెరిగిపోయి కూడా ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయి.

వీటన్నింటికి తోడు పోర్న్ సైట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడం, వాటిల్లో ఇంటరాక్టివ్ పోర్న్ సైట్లు (అంటే, యూజర్లే అశ్లీల కంటెంట్ అప్‍లోడ్ చేయనిచ్చేవి) మొదలవ్వడం ఒక కారణమైతే, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా అశ్లీల ఇమేజీలని పసిగట్టి వాటిని చూపించకుండా నివారించగలిగే చర్యలను పెద్ద టెక్ కంపెనీలు తీసుకోవాల్సినంతగా తీసుకోకపోవడం మరో కారణం.

గూగుల్ తమ సర్చ్ లో రివెంజ్ పోర్న్ కి సంబంధించిన ఇమేజీలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టూ, ఆ జాగ్రత్తల్లో ఉండే పరిమితుల గురించి రాశారు. అయితే, ఇలాంటి చర్యలు మరిన్ని కంపెనీలు మరింతగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఇండియాలో 18-45 సం|| మధ్య ఉన్నవారిలో 27% మంది రివెంజ్ పోర్న్ కి గురయ్యారని సైబర్ & లా ఫౌండేషన్ వారు నిర్వహించిన సర్వేలో వెల్లడించారు. అయితే, ఇలాంటి నేరాల విషయంలో మన సమాజంలో విక్టిమ్ షేమింగ్ (బాధితులనే నానామాటలు అనడం) ఉంటుంది కనుక చాలా వరకూ కేసులు నమోదు కానేకావు.

బెదిరిస్తున్న వారికి ఎంతో కొంత డబ్బు అప్పజెప్పి బయటపడుతుండడంతో ఇలాంటి నేరాలను కేవలం వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలోనే కాక బ్లాక్‍మెయిల్ రాకెట్స్ చేయడానికీ వాడుతున్నారు.

రివెంజ్ పోర్న్

రివెంజ్ పోర్న్ కి ప్రత్యేక చట్టాలు లేవు, అయినా…

భారతదేశంలో రివెంజ్ పోర్న్ కోసం ప్రత్యేకమైన చట్టాలేమీ లేవు. అయితే, ఇన్‍ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ (IT Act 2000)లోని సెక్షన్ Sections 66E, 67, 67A, 67B, and 72 ద్వారా కేసులు నమోదు చేయవచ్చు.

ఇన్ డీసెంట్ రెప్రెసెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) (ఐ ఆర్ డబ్ల్యు ఏ) చట్టం కింద సెక్షన్ 4, సెక్షన్ 6 కూడా వర్తిస్తాయి.

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద 292, 354, 354 A, 354 C, 120 B, 406, 499, 500, 506, and 509 సెక్షన్లులలో కూడా కేసు నమోదు చేసుకునే అవకాశాలు ఉండొచ్చు.

ప్రత్యేక చట్టాలు లేకపోవడంతో కేసును బట్టి ఏ సెక్షన్ కింద నమోదయ్యేది, శిక్షలు పడేది మారుతుంటాయి.

పైగా, ఇలాంటి కేసుల విషయంలో మహిళా బాధితులుంటే వాటిని మహిళా ఆఫీసర్లే చూసుకోవాలన్న నియమాలు కూడా ఏమీ లేకపోవడం, ఇబ్బందికరమైన ఈ విషయాన్ని పురుష అధికారులతో పంచుకోలేక కూడా మహిళా బాధితులు వెనుకాడుతుంటారు.

భారత్ పోర్న్ బ్యాన్

అయితే, అలా చేయడం ద్వారా నేరస్తులకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి, వీలైనంత వరకూ ఇలాంటి నేరాలను ఎదుర్కున్నప్పుడు ఈ కింద చర్యలు తీసుకోవడం ఉత్తమం:

1.సైబర్ సెల్స్ కి రిపోర్ట్ చేయాలి. ప్రతీ రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఈ సెల్స్ ఉన్నాయి. వీరికి వీడియోలు/ఫోటోలు ఎక్కడ, ఎవరు, ఎప్పుడు అప్‍లోడ్ చేశారు వగైరా తెలుసుకోగలిగే వీలు ఉంటుంది. కంప్లెంట్ అందుకోగానే వాళ్ళు ఆ ఫోటోలను డిలీట్ చేయించి, వాటిని సైబర్ ఫోరెన్సిక్ కి పంపుతారు.

2.ఏ వేదికలపైన అయితే అభ్యంతరకర/ఆమోదం లేని ఫోటోలు అప్‍లోడ్ అయ్యాయో ఆ వేదికలకు రిపోర్ట్ చేయాలి. సోషల్ మీడియాలో దాదాపు అన్ని వేదికల్లో "రిపోర్ట్ అబ్యూజ్" అన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని బాధితులు నొక్కడంతో పాటు, విషయం తెలిసిన అందరూ నొక్కితే ఆయా వేదికవాళ్ళు దాన్ని త్వరగా తొలిగించే అవకాశం ఉంటుంది. అలాంటి ఆప్షన్‍ లేని చోట లీగల్ సహాయం తీసుకుని ఆ వేదికకు రిపోర్ట్ చేయవచ్చు.

3.బెదిరించే వారు పంపిన టెక్స్ట్, వీడియో, ఆడియో మెసేజీలను భద్రపరచి ఉంచాలి. స్క్రీన్ షాట్లు, రికార్డింగులుంటే అవి కూడా. ఇలాంటివన్నీ కేసుని బలపర్చడంలో సహాయపడతాయి. బాధితులే అనుకోకుండా షేర్ చేశారా, లేదా వారి డివైజుని హాక్ చేసి నిందుతులు తీసుకున్నారా అన్న వివరాలన్నీ వీలైనంత నిజాయితీగా ఆఫీసర్లతో పంచుకోవాలి.

4.నేషనల్ కమీషన్ ఆఫ్ విమెన్, లేదా లోకల్ పోలీస్ స్టేషన్‍లో కూడా కేసు నమోదు చేయవచ్చు. బాధితులే కంప్లెంట్ చేయాల్సిన అవసరం లేదు. వారి తరఫున ఎవరైనా సరే చేయవచ్చు.

రివెంజ్ పోర్న్‌ను నివారించాలంటే…

రివెంజ్ పొర్న్ లాంటి నేరాలు తిరకాసు వ్యవహారాలు. నమ్మినవారి వల్ల మోసపోయిన ఉదంతాలు. ఇవి అర్థం చేసుకోవడానికి, సహానుభూతి చూపించడానికి కూడా సంక్లిష్టమైన వ్యవహారాలు. ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అనేవాటి మీద, కనీసం మన పితృస్వామ్య సమాజంలో, వాదోపవాదాలు తీవ్రంగానే జరుగుతాయి. అయితే, ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా మన చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి. వాటిల్లో కొన్ని:

●అసలు అలాంటి అశ్లీల ఫోటోలు, ఇమేజీలు ఉండకుండా చూసుకోవడం మంచిది. గొడవంతా అవి ఉండడం, వాటిని ఇతురులతో పంచుకోవడం, ఇతురులు అనుమతి లేకుండా వాటిని వాడడం వల్లే మొదలవుతుంది కనుక, ప్రైవేట్ క్షణాలను అచ్చంగా ప్రైవేట్‍గానే ఉంచుకుంటూ, వాటిని రికార్డ్ చేయకపోవడం ఉత్తమం.

●సెక్స్టింగ్ (sexting), న్యూడ్ ఫోటోలు పంపడం లాంటివి చేస్తే వాటి పరిణామాలు దారుణంగా ఉండచ్చునని గమనించాలి. క్షణికావేశాల్లో చేసిన పనులు తర్వాత తీవ్ర మనస్తాపాన్ని కలిగించవచ్చు. ఇలాంటివి పంపుతున్నప్పుడు కూడా ఆప్‍లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ (ఆటో డిలీట్, ఒకేసారి చూసే అవకాశం లాంటివి) ఉపయోగించుకోవాలి.

●కంప్యూటర్లు/ఫోన్లు/డివైజులను వీలైనంతగా బలమైన పాస్‍వర్డ్ లతో సంరక్షించుకోవాలి.

●అలానే ఫోటోలు, వీడియోలు ఏ క్లౌడ్ స్టోరేజ్ (గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లాంటివి) వాడితే, వాటికీ పాస్‍వర్డ్ అవీ బలంగా పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో "ఎవరన్నా ఈ ఫైల్స్ చూడవచ్చు" అన్న సెట్టింగ్ ఉండకుండా చూసుకోవాలి.

●పాస్‍వర్డ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోకూడదు. ఒకరి పాస్‍వర్డ్ ఒకరు పంచుకోవడం ప్రేమ, నమ్మకాలకు ప్రతీకలుగా భావిస్తున్నారు కొందరు యువత. ఆరోగ్యకరమైన అలవాటు కానే కాదు. ప్రైవేట్ వివరాలు ప్రైవేట్‍గానే ఉండాలి.

●ఇలాంటి అశ్లీల ఫోటోలు, వీడియోలు నచ్చనివారు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగక వాటిని నిరాకరించచ్చు. తీసేవారిని ఆపవచ్చు. మన అనుమతి, ఆమోదం లేనిదే ఎవరికీ ఇలాంటివి తీసే హక్కులేదని గుర్తించాలి.

●ఫోన్ కెమరాలు, వెబ్ కామ్‍లు ఏకాంత ప్రదేశాల్లో (బెడ్‍రూమ్, బాత్‍రూమ్) ఆన్ లేకుండా చూసుకోవాలి.

●స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఇలాంటి నేరాలపై అవగాహన పెంపొందేలా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాలి.

●క్లబ్బులు, ప్లబ్బులు లాంటి ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండి, అక్కడ ఎవరన్నా అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారా అన్నది గమనించుకోవాలి. మద్యాన్ని తగిన మోతాదులోనే సేవించాలి. అదుపు తప్పితే దురుద్దేశ్యాలున్న వారికి దారి ఇచ్చినట్టవుతుంది.

●ఎవరన్నా వారి ఫోనులో ఫోటోలు తీసి ఉంటే వారిని డిలీట్ చేయమని అడగాలి.

●ఫోటోలు పంచుకునేటప్పుడు వీలైనన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి పోస్ట్ చేయాలి. వాట్సాప్ లాంటి ఆప్స్ "ఒకసారే చూడనివ్వు" లాంటి ఫీచర్లున్నాయి. అవతలివారు ఒకసారి ఆ ఇమేజ్ చూడగానే దానంతట అదే డిలీట్ అయిపోతుంది. అలాంటివి వీలున్నప్పుడల్లా వాడాలి.

తక్కిన సైబర్ నేరాల్లానే రివెంజ్ పోర్న్‌ని కూడా సరైన అవగాహనతో తిప్పికొట్టవచ్చు. తగినంత కాకపోయినా చట్టాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించవచ్చు అని తెలుసుకోవాలి. జరిగినదాంట్లో మన ప్రమేయం ఎంతో కొంత ఉన్నా, దాన్ని అవకాశంగా తీసుకోనిచ్చి మనం బాధపడుతూనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ సంగతులు తెలుసుకుని మనం వ్యవహరిస్తే నేరాలను ఆపలేక పోయినా, వాటివల్ల జరిగే ప్రమాదాన్ని, నష్టాన్ని అదుపుచేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is Revenge Porn? Are there special laws for protection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X