వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన 'దళిత బంధు' పథకం ఏంటి? ఇప్పుడే ఎందుకు? రూ.10 లక్షలు ఎలా పొందాలి? ఎలా ఖర్చు చేయాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతుంటే, హుజురాబాద్ ఉపఎన్నికలు మాత్రం దళితుల చుట్టూ తిరుగుతున్నాయి.

ఈ స్థానం కోసం జరగబోయే ఉప ఎన్నికకు ఎవరి ప్రణాళికల్లో వాళ్లున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 'దళిత బంధు' కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రణాళికలో భాగమని చెప్పకనే చెబుతోంది.

రాజకీయ వ్యూహాల విషయం ఎలా ఉన్నా, ఒక ఎన్నికకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్మును ఎలా ఖర్చు చేస్తారనేదానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

దళిత బంధును మొదట హుజూరాబాద్ నుంచే మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ, విపక్షాలు, రాజకీయ విశ్లేషకుల విమర్శల వల్ల దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. కానీ, అసలైన దళిత బంధు పథకం హుజూరాబాద్‌లోనే మొదలైంది.

అసలేంటీ దళిత బంధు?

'దళిత బంధు' అనే ఈ పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకులో వేస్తారు.

మొదటి దశలో తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 11,900 మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలనుకున్నారు.

"ఈ బడ్జెట్‌లో 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్' పథకం కోసం రూ. 1200 కోట్లు కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో రూ.35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు అదనం'' అని సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు.

ఈ పథకం రాష్ట్రమంతా ఒకేసారి ప్రారంభం అవుతుందనుకుంటున్న సమయంలో హుజూరాబాద్ నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

"నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో(సాచురేషన్ మోడ్‌లో) వర్తింప చేస్తారు" అని సీఎం కార్యాలయం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే దళిత బంధు పథకం రూ.1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

అయితే, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందని సీఎం అన్నారు.

దీని కోసం అదనంగా మరో రూ.1500 నుంచి రూ.2000 కోట్లను హుజూరాబాద్‌లో ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

తెలంగాణా దళిత బంధు పథకం కోసం ప్రత్యేక డెబిట్ కార్డు తయారు చేశారు. దానిపై పథకం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉన్నాయి. పథకం ప్రారంభంలో భాగంగా 'దళితబంధు' చెక్కులు, ప్రత్యేక డెబిట్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

హుజూరాబాద్ నియోజక వర్గంలోని శాలపల్లిలో ఆగస్టు 16న నిర్వహించిన బహిరంగ సభలో ఈ పథకం విశేషాలను వివరించారు.

తెలంగాణ దళిత బంధు

దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ మాటల్లో:

  • రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మూడేళ్ల కాలంలో దళిత బంధు పథకం అమలు చేస్తాం.
  • తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ కింద 1.70 లక్షల కోట్లను కేటాయిస్తాం.
  • పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అర్హులైన దళితులందరికీ ఈ పథకం అందిస్తాం.
  • ఈ పథకం అమలు పర్యవేక్షణకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి ఉంటారు.
  • ఈ స్కీమ్ కింద ఎంపికలు ఉండవు. దళితులందరూ అర్హులే.
  • రాబోయే 15 రోజుల్లో హుజూరాబాద్‌లో ఈ స్కీమ్ అమలుకు మరో రూ.2 వేల కోట్లు కేటాయించారు. కొద్ది రోజుల కిందటే రూ.500 కోట్లు విడుదల చేశారు.
  • ఏటా రూ.30-40వేల కోట్లు కేటాయించుకుంటూ పోతాం. మూడేళ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ లబ్ది చేకూరుతుంది.
  • లబ్ధిదారుడికి ఇచ్చే రూ.10 లక్షల నుంచి రూ.10వేలు కట్ చేసి దళిత రక్షణ నిధికి జమ చేస్తారు. దీనికి సమానంగా ప్రభుత్వం ఈ నిధికి డబ్బు జమ చేస్తుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కమిటీల్లో 25 వేల సభ్యులు ఉంటారు.
  • బ్యాంకులు పాత బాకీలు కట్ చేసుకోకుండా కొత్తగా దళిత బంధు బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు.
  • నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు అమలు కమిటీలు ఏర్పాటు చేస్తారు.
  • దళిత బంధు పథకం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సైతం వర్తిస్తుంది.
  • ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఇచ్చే రూ.10 లక్షలను ఏం చేసుకోవాలన్న సందేహం ఉన్నవారికి జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు.
  • అదే నియోజక వర్గంలో ఖర్చు పెట్టాలని ఏం లేదు. ఎక్కడైనా ఈ స్కీమ్ డబ్బులు ఖర్చు చేసుకోవచ్చు.
  • కొంతమంది గ్రూప్ గా ఏర్పడి అందరి డబ్బులతో వ్యాపారం చేసుకోవచ్చు.
  • దళిత బంధు పథకం అందుకున్న వారికి పెన్షన్, రైతుబంధు, రేషన్ కార్డ్...ఇలా గతంలో అందుకున్న అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి.
  • హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ అనుభవాల ఆధారంగా ఈ స్కీమ్ గైడ్‌లైన్స్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయి.
తెలంగాణ దళిత బంధు

ఈ డబ్బును ఏం చేసుకోవాలి?

ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ డబ్బును సొంత వ్యాపారానికి ఖర్చు పెట్టుకోవచ్చంటూ 47 రకాల వ్యాపారాలను కూడా సూచించింది.

డెయిరీ ఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, బార్లు, వైన్ షాపులు కూడా నిర్వహించవచ్చు.

అవి కాకుండా వేరే వృత్తి ఏదైనా ఎంచుకోవాలని అనుకున్నా దళిత కుటుంబాలు తమ ఆలోచనల ప్రకారం నడుచుకోవచ్చు. కలసి పెట్టుబడులు పెట్టుకొని పెద్ద వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు

దళితుల్లో వ్యాపార అవకాశాలు కల్పించడానికి లైసెన్సుల్లో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

వైన్‌షాపులు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, రైసు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా వారికి లైసెన్సులలో రిజర్వేషన్లు కల్పిస్తుంది.

ఆర్ధిక సాయంతోపాటు దళిత రక్షణ నిధి కింద దళితుల్లో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకునేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసింది.

అయితే, ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల సొమ్మును పాత బాకీలు తీర్చడానికో, మరో అవసరానికో వాడుకుంటే ఏవైనా చర్యలు తీసుకుంటారా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ దళిత బంధు

దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యమేనా?

ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం సుమారు రూ.2 లక్షల కోట్లను ఈ పథకం కోసం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయవలసి ఉంటుందని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

ఈ పథకం కోసం రూ.1.7 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని శాలపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు.

ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు నిర్ణయించడం, అందులోనూ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం పట్ల విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల బరిలో దిగిన ఏ పార్టీ అయినా తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి వరాలు ప్రకటించడం సహజమే. కానీ, అధికారంలో ఉన్న పార్టీ ఇంత పెద్ద మొత్తంలో హామీలు కురిపించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

రూల్స్ ప్రకారం ఎన్నికల కోడ్ రాలేదు కాబట్టి, ప్రభుత్వం ఎక్కడైనా పథకాలు ప్రారంభించవచ్చు. కానీ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసీ, హుజూరాబాద్‌లో ఈ పథకం ప్రారంభించాలనుకోవడం నైతిక ప్రశ్నలను ముందుంచుతోంది.

''దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమిలాగే ఇది కూడా ప్రకటనలకు పరిమితమయ్యే పథకంలా కనిపిస్తోంది. విపక్షాలు కోర్టుకెక్కితే దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ వారిపై నిందమోపాలన్నది సీఎం ఆలోచన'' అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

ప్రభుత్వం ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెట్టినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి నిధులు ఎక్కడ నుంచి సమకూర్చుతుంది అనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి ఎన్నో పథకాల గురించి చెబుతున్నా, వాటిలో కొన్నింటినే అమలు చేయగలుగుతున్నారన్న విమర్శ కూడా ఉంది.

అంతేకాదు, రానున్న రోజులలో దళిత బంధు లాంటి పథకాలు తమకు కూడా కావాలని ఇతర వర్గాల నుంచి కూడా డిమాండ్లు రావచ్చు.

అలాంటప్పుడు ప్రభుత్వం ఆ డిమాండ్లకు ఎలాంటి సమాధానం చెప్పగలుగుతుందన్నది జవాబు దొరకని ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What is the 'Dalit Bandhu' scheme announced by Telangana CM KCR? How to get Rs 10 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X