వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంలో ఎవరి పాత్ర ఎంత?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోలవరం

"పోలవరం ప్రాజెక్టును 2018 మార్చి నాటికే పూర్తి చేస్తాం. రాసిపెట్టుకో.." అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాటలివి.

2016 మార్చి 10న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.

"తొందరెందుకు కన్నా! 2021 డిసెంబర్ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం"

ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలోనూ, వెలుపలా చెప్పినవి.

2020 డిసెంబర్‌లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.

ఈ ఇద్దరు మంత్రులు చెప్పిన మాటలూ అమలుకి నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం పూర్తయిన పోలవరం పనులు ఇలా ఉన్నాయి.

  • ఎర్త్ వర్క్స్ : 88శాతం
  • ఎం బ్యాక్‌మెంట్ : 34 శాతం
  • కాంక్రీట్ పనులు : 81శాతం
  • గేట్లు: 72.12శాతం
  • ఎడమ కాలువ ఎర్త్ వర్క్స్: 91.69శాతం
  • ఎడమ కాలువ స్ట్రక్చర్ : 62.78 శాతం
  • కుడికాలువ ఎర్త్ వర్క్స్: 100 శాతం
  • కుడికాలువ స్ట్రక్చర్: 94.84 శాతం
  • భూసేకరణ: 67.26 శాతం

పునరావాసం, పరిహారం విషయంలో నేటికీ పదిశాతం వరకూ మాత్రమే పూర్తయింది. పెద్ద మొత్తంలో దానికే ఖర్చు చేయాల్సి ఉంది.

కీలకమైన ఈసీఎఫ్ఆర్ సహా ఇతర పనులు ఎప్పటికి పూర్తవుతాయి? ఆలస్యం ఎందుకు అవుతున్నాయన్నది చాలామందిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం.

పోలవరం

జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించడంతో చిగురించిన ఆశలు

ఏడెనిమిది దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో ప్రయత్నాలు జరిగి.. రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపించిన పోలవరం నిర్మాణానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో కొంత కదలిక వచ్చింది. జలయజ్ఞంలో భాగంగా డ్యామ్ పనులతో పాటు కాలువల పనులు కూడా కొంతవరకూ జరిగాయి.

ఆ తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కింది. దాంతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాలు వినిపించాయి. కేంద్రమే బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తుందని ప్రకటించడంతో ఎదురుచూపులు ఇక ముగిసినట్టేనని భావించారు.

తీరా చూస్తే, చట్టం చేసి 8 ఏళ్లు దాటుతున్నా పోలవరం పూర్తికాలేదు. మొత్తం పనులన్నీ 80శాతంలోపే జరిగాయి. ఆర్ అండ్ ఆర్ ఇంకా 80 శాతంపైనే జరగాల్సి ఉంది. ఈ దశలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం ఎలా అన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దోబూచులాటగా కనిపిస్తోంది.

పోలవరం

ఆర్థిక వనరులు సరిపోక..

టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తాము చెప్పిన మాటలను ఆచరణలో చూపించలేకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వనరులే.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. అయితే, నిర్మాణ బాధ్యతలను వేగంగా పూర్తి చేస్తామని చెప్పి 2016లో ఏపీ ప్రభుత్వం దీన్ని నెత్తినపెట్టుకుంది.

కాగా 2013 నాటి అంచనాల మేరకు మాత్రమే తాము నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదే పదే చెబుతోంది. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు అదే సమాధానం చెప్పారు.

2013 నాటి అంచనాల ప్రకారం రూ. 20,338 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. అందులో జాతీయ హోదా ఇవ్వకముందు చేసిన ఖర్చులు పోనూ మిగిలిన రూ. 15,667 కోట్ల నిధులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం చెబుతోంది.

ఇప్పటికే రూ. 11,000 కోట్లు ఇచ్చామని, మరో రూ. 2,100 కోట్లు రీయింబర్స్ చేసేందుకు పెండింగు బిల్లులున్నాయని ప్రకటించింది. ఆ బిల్లులను పరిశీలించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

నిర్మాణంలో జరిగిన జాప్యంతో పెరిగిన వ్యయానికి అనుగుణంగా అంచనా వ్యయం సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దానికి అనుగుణంగా 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 55,657 కోట్లుగా నిర్ణయించాలని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు.

అంతకుముందు కూడా పలుమార్లు ఈ అంశాన్ని సీఎం సహా, ఏపీ ప్రభుత్వ వర్గాలు పలుమార్లు ప్రస్తావించాయి. కానీ కేంద్రం నుంచి ఆమోదం దక్కడం లేదు.

పోలవరం

ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే...

పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూ. 47,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి ఆమోదం లభించింది.

అది జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో కొర్రీలు వేస్తున్నారు. పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలి. జలశక్తి శాఖ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ససేమీరా అనడంతో ఈ వ్యవహారం పెండింగులో పడింది. ప్రస్తుతం కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులతో పనులు సాగుతున్నాయి. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబడుతోంది.

2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.

"ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది" అంటూ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

"ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా, రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. కానీ పోలవరంలో దానికి భిన్నంగా కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే అనడం సమజసం కాదు. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు సవరించేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను" అంటూ ఏపీ సీఎం నేరుగా ప్రధానికి విన్నవించారు.

పోలవరం

నిర్వాసితుల ఆందోళనలు

పోలవరం ప్రాజెక్టులో భాగంగా స్పిల్ వే నిర్మాణ పనులు కొలిక్కి వస్తున్నాయి. 2021 జూన్‌లో ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తిగా మూసివేసి గోదావరి వరద నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించారు. దానిమూలంగా ఇప్పటికే పోలవరం, దేవీపట్నం, వీఆర్ పురం మండలాల్లోని పలుగ్రామాల్లోకి నదీ జలాలు చేరాయి.

ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు.

పోలవరం నిర్మాణం పూర్తయితే 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. పునరావాస కాలనీల్లో 3,110 గృహాల నిర్మాణం పూర్తయ్యింది.

తొలిదశలలో 41.15 మీటర్ల వద్ద నీటిని నిల్వ ఉంచడానికి అనుగుణంగా కాంటూర్‌ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి అనుగుణంగా కాలనీలు నిర్మించలేదంటూ బాధితులు ఆందోళనలకు పూనుకున్నారు.

"మా గ్రామం ఖాళీ చేసి కాలనీలకు వెళ్లాలని అన్నారు. వరదల మూలంగా ఇళ్లల్లోకి నీరు చేరింది. కాఫర్ డ్యామ్ మూసివేసిన తర్వాత చిన్న వరదలకు కూడా ఊళ్లు మునిగిపోతున్నాయని బయటకు వచ్చేశాం. అద్దె ఇళ్లల్లో ఉంటున్నాం. కాలనీలు పూర్తి చేయలేదు. చాలా సమస్యగా ఉంది.

పరిహారం కూడా సగం సగం ఇచ్చారు. అధికారులను కలిస్తే గడువులు పెంచుకుంటూ పోతున్నారు. మాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అందుకే న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నాం" అంటూ పోలవరం మండలం కరుటూరు సర్పంచ్ రామ్ భూపాల్ రెడ్డి బీబీసీతో అన్నారు.

గడిచిన కొన్ని నెలలుగా పోలవరం నిర్వాసితులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు.

కేంద్రం చెబుతున్న 2013 నాటి లెక్కల ప్రకారం భూసేకరణకు రూ. 5035 కోట్లు, పునరావాసం కోసం రూ. 7,278 కోట్లు ఖర్చవుతుంది.

కానీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది సుమారుగా రూ. 29వేల కోట్లకు పైమాటేనని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అందులో కేవలం రూ. 5వేల కోట్లు వరకూ మాత్రమే ఖర్చు చేశారు. దాంతో, ఆర్ అండ్ ఆర్ వ్యవహారమే ఇప్పుడు అతి పెద్ద ఖర్చుగా కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

'ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు'

"పోలవరం ప్రాజెక్టు‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు. రివర్స్ టెండరింగ్ అంటూ అన్నీ రివర్స్‌లో నడుపుతోంది. 2024లోగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అందుబాటులోకి వస్తుంది.

ప్రాజెక్టు పూర్తి చేయకుండా డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలనే ప్రతిపాదనలు చేయడం సరికాదు. దానివల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది" అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యన్నారాయణ.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు.

క్షేత్రస్థాయిలో పనుల తీరును బీబీసీ పరిశీలించింది. ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్ చానెల్ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది.

మొన్నటి వరదల సమయంలో 22 లక్షల క్యూసెక్కుల పైబడిన గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ వైపు దిగువకు వదిలారు. దానికి అనుగుణంగా అప్రోచ్ చానెల్ సహా అన్నింటినీ ఈ కాలంలో సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.

ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్ చానెల్ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది.

డయా ఫ్రమ్ వాల్ లోపమే జాప్యానికి కారణం

"ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మొన్నటి డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామనే అనుకున్నాం. కానీ అది జరగలేదు. దానికి కారణాలున్నాయి. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ లోపాలు అందుకు ఆటంకం. హడావిడిగా నీటిని మళ్లించాలనే తొందరలో గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి ఫలితమే నిర్మాణంలో జాప్యానికి అసలు కారణాలు.

అయినా మా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్రం సహకరించాలి. అంచనాలు సవరించాలి. నిధులు సకాలంలో ఇవ్వాలి. వచ్చే ఖరీఫ్‌ నాటికి నీటిని అందించాలనే సంకల్పంతో ఉన్నాం. నిర్వాసితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది" అని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

ఏపీలో అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఆర్థికంగా అవస్థల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయాలంటే కేంద్రమే ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అంచనాలు సవరించడం, ఆర్ అండ్ ఆర్‌కి అవసరమైన మేరకు నిధులు కేటాయించడం సహా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే పోలవరం కల నెరవేరే అవకాశం ఉంది. లేదంటే నిర్మాణం మరింత జాప్యం అవుతుంది. దానివల్ల అంచనా వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the role of delay in construction of Polavaram project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X