వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టాక్స్

జనవరి 1 - ప్రతీ ఏడాది వచ్చేదే. అయితే, ఇది కొత్త సంవత్సరంలో కొత్తగా ఏమన్నా మారుతుందేమోనని, సానుకూల మార్పులేమైనా వస్తాయేమోనని అందరూ ఎదురు చూసే రోజు.

సాధారణంగా జనవరి 1 నుంచి కొన్ని వ్యవస్థాగత మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, పాత పథకాల్లో మార్పులు చేర్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది.

దీంతో, చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో, వ్యాపార సరళిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో, ఆర్థికపరంగా చోటు చేసుకునే మార్పులు మానవ జీవితాల పై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

కొత్త ఏడాదిలో విడుదలయ్యే సినిమాలతో పాటు ఈ ఏడాది డిసెంబరు31 తర్వాత ప్రముఖంగా చోటు చేసుకోబోయే మార్పులేంటి? అవి ఎవరిని ప్రభావితం చేయనున్నాయి?

జీఎస్‌టీ

జీఎస్టీలో మార్పులు

జీఎస్టీలో మార్పులనగానే అవి మనకి సంబంధించినవి కావని అనుకుంటూ ఉంటాం. కానీ, వ్యాపారాల పై పడే జీఎస్టీ భారం పరోక్షంగా వినియోగదారుని పైనే పడుతుంది.

భారతదేశంలో అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలులో జనవరి 01, 2022 నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీని వల్ల వినియోగదారుల జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి?

రోజూ ధరించే చెప్పులు, షూలు, రెడీమేడ్ దుస్తుల ధరలు ఇక పై పెరగనున్నాయి. వీటి పై ఇప్పటి వరకు 5% జిఎస్టీ చెల్లిస్తుండగా, జనవరి 01 నుంచి అది 12 శాతానికి మారబోతోంది. దీంతో, వీటి ఖరీదు భారం వినియోగదారుల పై పడనుంది. అయితే, కాటన్ దుస్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపు లభిస్తోంది.

ఇటీవల ఆన్‌లైన్‌లో కొంత మంది దుస్తుల వ్యాపారులు జనవరి 01కి ముందే మీ ఆర్డర్లు బుక్ చేసుకోండి. లేదంటే, 12% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందంటూ వినియోగదారులను ఆకర్షించే ప్రకటనలు కూడా చేశారు.

స్విగ్గీ, జొమాటో యాప్‌లే జీఎస్టీ చెల్లించాలి

ఫుడ్ యాప్ లైన స్విగ్గీ, జొమాటోలు రెస్టారెంట్ల నుంచి వసూలు చేస్తున్న జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను స్వయంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చార్జీలను రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఫుడ్ డెలివెరీ యాగ్రిగేటర్స్ వీటిని సరిగ్గా నమోదు చేయని కారణంగా సుమారు రూ.2000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పేర్కొందని హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ అనలిస్ట్ కే నగేంద్ర సాయి బీబీసీకి చెప్పారు.

అయితే, దీని వల్ల వినియోగదారుల పై అదనంగా పడే భారం ఏమీ ఉండదని అన్నారు.

కానీ, దీని వల్ల ఏడాదికి 20లక్షల లోపు ఆదాయం ఉన్న చిన్న చిన్న రెస్టారంట్ యజమానులకు కొంత వరకు ఇబ్బంది ఉంటుందని అన్నారు. .

ఓలా, ఊబర్ చార్జీలు తగ్గుతాయా?

నగరాల్లో అత్యధికంగా ఉపయోగించే ఓలా ఊబర్ ట్యాక్సీ సేవల పై కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఎటువంటి రవాణా సేవలకైనా పన్ను ఉంటుంది.

అయితే, దీని వల్ల వినియోగదారులకయ్యే బిల్ కొంత వరకు తగ్గే అవకాశం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పెరగనున్నలైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం

ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు పెరగనున్నాయి. అయితే, ముఖ్యంగా టెర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ఖరీదు 20% - 40% పెరిగే అవకాశం ఉందని నగేంద్ర సాయి చెప్పారు.

ఇది కచ్చితంగా జనవరి 01 నుంచి అమలులోకి రాకపోయినప్పటికీ, వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమలు కావచ్చని చెప్పారు. కోవిడ్ తర్వాత ఇన్సూరెన్సు క్లెయిమ్‌లు పెరగడంతో వీటి ఖరీదు పెరిగే అవకాశం ఉందని అన్నారు.

వినియోగదారులకు కూడా ఎల్‌ఐసి షేర్లు

మీరు ఎల్‌ఐ‌సి కడుతున్నారా? అయితే, మీరు కూడా ఎల్‌ఐ‌సి షేర్ హోల్డర్లుగా మారే అవకాశం ఉంది. అయితే, అందుకు వినియోగదారుల పాన్ నంబర్‌ను ఎల్ఐసి పాలసీకి అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

వచ్చే ఏడాది నుంచి ఎల్ఐసి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా షేర్ మార్కెట్‌లోకి రానుంది. కానీ, ఇది వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా అమలు కావచ్చని చెప్పారు.

డిసెంబరు 31లోపు ఈపీఎఫ్ నామినీ వివరాల నమోదు

"ఈపీఎఫ్ పోర్టల్ లో నామినీ వివరాలను ఈ డిసెంబరు 31లోపు నమోదు చేసుకోవాలి. ఈ గడువు దాటితే, పిఎఫ్ డబ్బును అసలు వ్యక్తి లేని పక్షంలో కుటుంబ సభ్యులెవరూ క్లెయిమ్ చేసే వీలుండదు"అని నగేంద్ర సాయి వివరించారు.

ఈ నామినీ వివరాలను ఆన్‌లైన్ లో చేయవచ్చని అయితే, అందుకు యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో పాటు సదరు వ్యక్తి ఈపిఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానమై ఉండాలని చెప్పారు.

డెబిట్ కార్డులు

టోకెనైజేషన్

దేశంలో 5,00,000 వరకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఈ -కామర్స్ సంస్థల దగ్గర నమోదైనట్లు ఒక అంచనా ఉంది. ఈ కార్డుల వివరాలను ఈ కామర్స్ సంస్థలు తర్వాత తమ డేటా బేస్‌లో స్టోర్ చేసుకునే వీలు లేదు. ఈ విధానం జనవరి 01 నుంచి అమలు కావాల్సి ఉండగా, ఈ-కామర్స్ సంస్థల అభ్యర్ధన మేరకు జులై 01వరకు ఈ గడువును పొడిగించారు.

దీని వల్ల వినియోగదారులు ఆన్ లైన్ సేవలు వినియోగించుకునే ప్రతి సారి కార్డు వివరాలు నమోదు చేయాలేమోననే అపోహ ఉంది. కానీ, అలా చేయాల్సిన పని లేదని సాయి చెప్పారు. మొదటి సారి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో రిజిస్టర్ చేసినప్పుడే ఒక టోకెన్ నంబర్ రిజిస్టర్ అవుతుంది. ఆ టోకెన్ నంబర్ ద్వారా ట్రాన్సక్షన్స్ చేసే వీలుంటుంది అని సాయి చెప్పారు.

ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకనుగుణంగా తప్పనిసరిగా పాటించాల్సిన నియమం అని చెప్పారు.

ఆర్బీఐ

ఏటీఎం ట్రాన్సాక్షన్ల పై చార్జీలు

డెబిట్ కార్డులతో ఏటీఎంలలో చేసే ట్రాన్సాక్షన్ల లిమిట్ దాటిన తర్వాత ప్రతీ అదనపు ట్రాన్సాక్షన్‌కు రూ. 21 వసూలు చేస్తారు. గతంలో ఇది రూ. 20 ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్ల వరకు, మెట్రో కేంద్రాల్లో ఉన్న ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా చేయవచ్చు. ఆ తర్వాత మాత్రం ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.21 చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

పెన్షన్ లబ్ధిదారుల వివరాలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వార్షిక లైఫ్ సర్టిఫికేట్‌ను డిసెంబరు 31లోపు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే, పెన్షన్ డబ్బులు ఖాతాలో పడటం ఆగిపోయే అవకాశం ఉంది.

టెక్నా లజీ

టెక్నాలజీలో వచ్చే ఏడాది నుంచి రాబోయే మార్పులు

"జనవరి నుంచి కచ్చితంగా టెక్నాలజీ రంగంలో కొన్ని మార్పులొస్తాయని చెప్పలేం కానీ, వచ్చే ఏడాది నుంచి చాలా మార్పులైతే వస్తాయి" అని టెక్ నిపుణులు శ్రీధర్ నల్లమోతు అన్నారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగమెంటెడ్ రియాలిటీ పెరిగే అవకాశం ఉందని వివరించారు.

వినోద రంగం పూర్తిగా రీ డిజైన్ కాబోతోందని చెబుతూ, ఏ వీడియో చూసినా 120 అంగుళాల వీడియోలో చూస్తున్నట్లు కనిపించే వర్చువల్ రియాలిటీ కళ్ళజోళ్ల ఉత్పత్తి పెరగవచ్చని చెప్పారు.

"హెడ్ మౌంట్ డిస్‌ప్లే కూడా ప్రాముఖ్యం కాబోతోంది" అని అన్నారు. దీంతో, ఎంత చిన్న స్క్రీన్ అయినా, 600 ఇంచీల వరకు స్క్రీన్ కనిపిస్తుంది. దీని వల్ల ఓటిటిలో చూసే సినిమాలు కూడా థియేటర్ లో చూసిన అనుభవం కలిగిస్తాయి" అని చెప్పారు.

"మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇప్పటికే 10 శాతం వరకు మార్కెట్ లో ఉన్నాయి. వీటి ద్వారా భవిష్యత్తులో చాలా రంగాల్లో మార్పులు తేనున్నాయి" అని అన్నారు.

రోబో ఎక్స్‌పోలో ఓ రోబో

ఏఐ విప్లవం

మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాను అనుసంధానం చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భౌగోళిక ప్రదేశాల్లో నివసిస్తున్నప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్య చరిత్ర, జీవన శైలిని గమనించి వాటి ఆధారంగా ముందుగానే ఆ జనాభాలో కలగబోయే క్యాన్సర్, డైయాబిటిస్ లాంటి రోగాలను అంచనా వేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

రైలులో తత్కాల్ టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా ఆ టికెట్ కంఫర్మ్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఈ టెక్నాలజీ ముందుగానే తెలియచేస్తుందని వివరించారు.

"మెషీన్ లెర్నింగ్ ద్వారా చాలా సంస్థలు మెరుగైన సేవలందించే అవకాశముంది. డేటా భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది" అని అన్నారు.

సెక్యూరిటీ పరంగా చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతూ, హ్యాకింగ్ విషయంలో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కూడా రక్షించలేని స్థాయిలో సైబర్ మోసాలు పెరగవచ్చని చెప్పారు.

ఇందుకోసం ఫోన్లు కంప్యూటర్లు సురక్షితంగా ఉంచుకోవలసి ఉంటుందని చెప్పారు.

"ఏ లింక్ పై క్లిక్ చేస్తున్నామనే విషయం నుంచి ఏ కంటెంట్ డౌన్‌లోడ్ చేస్తున్నాం అనే విషయం వరకూ యూజర్ చేసే యాక్టివిటీ ప్రకారమే ఆన్ లైన్ సురక్షత ఆధారపడి ఉంటుంది" అని శ్రీధర్ నల్లమోతు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What will change from January 1st, What can you do and what can't
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X