రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తూనే, హిందూ కరోనా మృతులకు ముస్లింల అంత్యక్రియలు.. రియల్ వారియర్స్ !!
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భారతదేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది.మరికొన్ని చోట్ల మానవత్వం వెల్లివిరుస్తోంది. కులమతాలకు అతీతంగా కరోనా కష్టకాలంలోసాటివారిని ఆదుకోవాలన్న భావన చాలామందిలో కలగడం ఈ సమయంలో ప్రధానంగా కనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లక్నోలో కరోనా బాధిత మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లిం యువకులు
దేశం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సహాయం కోసం అర్థిస్తున్న సమయంలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల దయనీయ పరిస్థితులను ఎవరూ పట్టించుకోని పరిస్థితులలో , కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఓ ముస్లిం యువకుల బృందం ముందుకు వచ్చింది. ఒకపక్క రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు పాటిస్తూనే ఉత్తరప్రదేశ్ లక్నోలోని హిందూ కరోనా బాధిత మృతుల అంత్యక్రియలను సైతం ఓ ముస్లిం యువకుల బృందం కొనసాగిస్తుంది.

ఇంటర్నెట్ ద్వారా తమను సంప్రదించిన వారికి సహాయం
ఇంటర్నెట్ ద్వారా తమని సంప్రదించిన వారికి సహాయం చేయడానికి రంగంలోకి దిగింది యూపీలోని ఓ ముస్లిం యువకుల బృందం. పిపిఇ కిట్లు ధరించి, ఈ యువకులు కరోనా మహమ్మారి చేతిలో పోరాడి ఓడిన వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రపంచం భయంకర కరోనా వైరస్ మహమ్మారి తో పోరాడుతున్న సమయంలో మతాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ముందుకు వెళ్తున్నారు ఈ ముస్లిం యువకులు. మతసామరస్యానికి నిజమైన అర్ధం చెప్తున్నారు.

ఏడుగురు హిందువులకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం యువకులు
ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓల్డ్ సిటీలోని మక్బారా గొల్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్న ముప్పై మూడేళ్ల ఇమ్దాద్ ఇమాన్ ఒక స్టోర్ యజమాని మరియు గ్రాఫిక్ డిజైనర్. అతను తన వద్ద ఉన్న 22 మంది యువకుల బృందంతో కలిసి కరోనా కష్టకాలంలో పలువురికి సహాయం చేస్తున్నారు. ఏడుగురు హిందూ కరోనా మృతుల దహన సంస్కారాలను వారు నిర్వహించారు. వారు 30 మంది ముస్లిం కరోనా మృతులను సైతం ఖననం చేశారు.

కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో ముస్లిం యువకుల సాహసం
ఈ బాధితుల్లో చాలా మందికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ ముస్లిం యువకులు నడుంబిగించి మరీ అంత్యక్రియలను నిర్వహించారు.ఇమామ్ గత సంవత్సరం కోవిడ్ -19 మృతుల ఖననాలకు కమిటీని ప్రారంభించాడు. కరోనా బాధిత మృతుల అంత్యక్రియలను వారు నిర్వహిస్తున్న తీరు, పలు కేసుల దారుణ పరిస్థితుల నేపధ్యంలోనూ వీరు చూపించిన ధైర్యం వీరి సాహసోపేతమైన చర్యలను ప్రశంసించేలా చేస్తున్నాయి .

కరోనా సంక్షోభంలో మతాన్ని పక్కనపెట్టి మానవత్వంతో .. ఇదే కదా మత సామరస్యం !!
కరోనా బారిన పడిన కుటుంబ సభ్యుల మృతదేహాలను ముట్టుకోవడానికి కూడా సాహసం చెయ్యని బంధువులు ఉంటున్న నేటి రోజుల్లో, అలాంటి వారందరికీ అంత్యక్రియలు నిర్వహిస్తూ కరోనాపై భారతదేశం చేస్తున్న పోరాటంలో మేము సైతం అంటున్నారు ఈ ముస్లిం యువకులు.హిందూ, ముస్లిం అనే భేదభావం లేదని మనమంతా మనుషులమని, సాటి మనుషులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications