తొలి వైట్ ఫంగస్ కేసు: కొవిడ్ నుంచి కోలుకున్న 70ఏళ్ల వృద్ధుడిలో గుర్తింపు -అలర్ట్ జారీచేసిన డాక్టర్లు
కరోనా విలయానికితోడు మరో మహమ్మారిలా బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళనలు పెరుగుతుంటే, దానికంటే ప్రమాదకారి వైట్ ఫంగస్ ఇప్పుడిప్పుడే జడలు విప్పుతున్నది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి వైట్ ఫంగస్ కేసులు డాక్టర్లు గుర్తించారు. యూపీలోని మవూ జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి వైట్ ఫంగస్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవలే కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న ఆ వ్యక్తి అంతలోనే మరో మహమ్మారి కాటుకు గురికావడం కలకలం రేపుతున్నది..
ఉత్తరప్రదేశ్‌లో ఇది తొలి వైట్ ఫంగస్ కేసుగా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 70 ఏళ్ల మవాకు చెందిన వృద్ధుడిలో ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించామని, అతను కొవిడ్ వ్యాధికి ఏప్రిల్‌లో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు.

కరోనా చికిత్స సమయంలో వృద్ధుడికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇచ్చారని విట్రియో-రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ క్షితిజ్ ఆదిత్య పేర్కొన్నారు. ఆ తర్వాత అతడిలో నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తాయని, క్రమంగా కంటి చూపు కోల్పోయాడని తెలిపారు. బాధితుడిని పరీక్షించినప్పుడు రక్తం ద్వారా కంటికి ఇన్ఫెక్షన్ (ఎండోజెనస్ ఫంగల్ ఎండోఫ్తాల్మిటిస్) సోకినట్టు గుర్తించినట్టు వివరించారు. ఆ తర్వాత నిర్వహించిన విట్రియస్ బయాప్సీలో వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించినట్టు తెలిపారు.
కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం చూపు మందగిస్తే ముఖ్యంగా స్టెరాయిడ్స్ తీసుకున్న వారు, మధుమేహం ఉన్నవారు వెంటనే నేత్ర వైద్యులను కలవాలని మరీ ముఖ్యంగా రెటీనా స్పెషలిస్టులను కలవాలని డాక్టర్ క్షితిజ్ ఆదిత్య సూచించారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మధుమేహంతో బాధపడుతున్నవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు వైట్ ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువ. అలాగే, కరోనా వైరస్ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నవారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. కళ్లు, ఊపిరితిత్తులు, మెదడు, గోళ్లు, చర్మ, కిడ్నీలు, రహస్య భాగాలకు ఇది సులభంగా సోకుతుంది.












Click it and Unblock the Notifications