• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాషాయ జెండా

కొన్ని సంవత్సరాల కిందటి వరకు, లౌకిక దేశమైన భారతదేశాన్ని 'హిందూ దేశం'గా మారుస్తాం అని ఎవరైనా అంటే, వాటిని కేవలం ఊహగానాలుగా పరగణించేవారు. నేడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న తరణంలో, హిందూ దేశం గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా బహిరంగంగా మీడియాలో చర్చిస్తున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు. వీడియోలు చేస్తున్నారు.

ఈమధ్యే హరియాణాకు చెందిన బీజేపీ శాసనసభ్యులు ఒకరు భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చి తీరుతాం అని శపధం చేశారు. బిహార్ బీజేపీ నుంచి కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అన్న డిమాండ్ వచ్చింది.

భారతదేశం హిందూ దేశమని, ఈ విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలకు తావు లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

2025 నాటికి హిందూ దేశాన్ని స్థాపిస్తామని గోవాలో అఖిల భారత హిందూ రాష్ట్ర మహాసభలు నిర్వహించిన హిందూ జనజాగృతి సమితి తెలిపింది.

హిందూ దేశ స్థాపనకు సంబంధించి చట్టపరమైన, సామాజిక అంశాల సంక్లిష్టతలు నాణానికి ఒకవైపు అయితే, ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువెళ్లడంలో హిందుత్వ సంస్థలు, నాయకులు పోషించిన పాత్ర మరొకవైపు. ఇలాంటి సంస్థల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. ఎంత అన్నది కచ్చితంగా తెలీదు.

ఈ సంస్థలు తమ రోజువారీ సాధారణ కార్యక్రమాల ద్వారా, వివాదాస్పద, మత ఉద్రిక్తలను రెచ్చకొట్టే ప్రసంగాల ద్వారా సామాన్య హిందువులలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాయి. ఎక్కువ మందికి తమ ఉద్దేశాలను చేరవేయడానికి సోషల్ మీడియా వేదికలను ఎలా వాడుకోవాలో, మీడియాలో ప్రైమ్‌టైమ్‌ను తమ గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలో వీళ్లకి చాలా బాగా తెలుసు.

ఈ సంస్థలు కేవలం ఉన్మాద సంస్థలని, గుప్త సైన్యాలని, వీటి ప్రభావం పరిమితం అని కొందరు భావిస్తుండగా, ఇవి చిన్న చితకా సమూహాలు కావని, ఇవే ప్రధాన స్రవంతి సంస్థలని, మతం పేరుతో సమాజంలో ద్వేషాన్ని పెంచుతున్నాయని మరికొందరు భావిస్తున్నారు.

ఇవి హైందవ సమాజం ఆలోచనా విధానాన్ని భారీ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి అనే అభిప్రాయం కూడా సమాంతరంగా ఉంది. అయితే, అన్ని మతాలలోనూ ఈ విధంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే మతోన్మాద సంస్థల పాత్ర, పని తీరు ఒకేలా ఉంటుంది.

ఇటువంటి సంస్థలు వృద్ధి చెందటం వలన రాజకీయంగా లాభపడేది ఎవరు? ఇటువంటి "ఉన్మాద మూకలకు" సామాన్య ప్రజానీకంలో ఆదరణ ఎందుకు పెరుగుతోంది?

రచయిత, జర్నలిస్ట్ అయిన ధీరేంద్ర ఝా హిందుత్వ భావజాలానికి పెరుగుతున్న మద్దతు, ఆదరణ, వాటి వెనుక కారణాలపై చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు, రాస్తున్నారు. గత మూడు దశాబ్దాలలో భారతదేశంలో చాలా ఆశ్చర్యకరంగా, విస్మయం కలిగించే రీతిలో హిందుత్వ రాజకీయాలు బలపడ్డాయని తన పుస్తకం 'షాడో అర్మీస్, ఫ్రింజ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ హిందుత్వ' లో రాశారు.

హిందుత్వ రాజకీయాలు అనేక అంశాల సమాహారమని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాకుండా, ఈ పార్టీ నీడలో పని చేసే అనేక సంస్థలు కూడా కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాయని రాశారు.

"వీరందరూ కూడా ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఒక సమాజంగా హిందువులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండాలని, అలాగే భారతదేశ అస్థిత్వాన్ని హిందువులే నిర్ణయించాలన్నదే వారి లక్ష్యం" అని ధీరేంద్ర ఝా రాశారు.

ఆయన ఉద్దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లాంటి సంస్థలు ఇటువంటి రాజకీయాలకు నాయకత్వం వహిస్తూ, ముందుకు తీసుకువెళ్తున్నాయి.

హిందువుల హితం అని మాట్లాడే హిందుత్వ సంస్థలకు ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా వాటి ఆలోచనా విధానం, ఎజెండా ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా ప్రభావితమయ్యాయి అనే వాదన కూడా ఉంది.

ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనాపరులు, పార్లమెంట్ సభ్యులు రాకేశ్ సిన్హా ఈ ఆరోపణలను తిరస్కరించారు.

"130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వైవిధ్యత కారణంగా అప్పుడప్పుడు విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విభేదాల కారణంగా అప్పుడప్పుడు చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చెదురుమదురు వ్యాఖ్యలు అన్ని వేపుల నుంచి వినిపిస్తున్నాయి. మీరు కొన్ని సంస్థల పేర్లు చెబుతున్నారు కదా. ఆ సంస్థల చిరునామా బోర్డులు, ఆ సంస్థలలో కొంత మంది వ్యక్తుల పేర్లు తప్ప సామాన్యులకి వారి గురించి తెలుసా? వాళ్లని ఎవరైనా గుర్తుపడతారా? వాళ్లకి ఎవరైనా మద్దతు ఇస్తున్నారా? ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే వీళ్ల గురించి ప్రపంచానికి తెలిసేదే కాదు. మీడియా రంగంలో ఉన్న పరిస్థితులు దీనికి కారణం. దానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా బాధ్యత వహిస్తుంది?" అని ఆయన బీబీసీతో అన్నారు.

హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు?

కొన్ని హిందుత్వ సంస్థల గురించి, వాటితో పనిచేస్తున్నవారి గురించి తెలుసుకుందాం. తమ భావజాలాన్ని వారు ఎలా అర్థం చేసుకుంటున్నారు, అలాగే తమ భావజాలాన్ని అమలు చెయ్యటానికి వారు ఎంత దూరం వరకు వెళ్తారు అనే విషయాలు తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

రాజకీయ క్షేత్రంలో వీరి పాత్ర పరిమితం అనిపించవచ్చు. అయితే తమ భావజాలాన్ని నిజం చెయ్యటానికి వీరు ఏ మార్గానైన్నా ఎంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత మూల్యం చెల్లించటానికైనా సిద్ధంగా ఉన్నారు.

ఇటువంటి పతాకధారుల జాబితా పెద్దదే. అందులో భజరంగ్ ముని ఒకరు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఉంటారు. జూమ్ ద్వారా ఆయనతో మాట్లాడాం.

భజరంగ్ ముని ఖైరాబాద్‌లోని మహర్షి శ్రీ లక్ష్మణ్ దాస్ ఉదాసీ ఆశ్రమం పూజారి. కొద్ది నెలల క్రితం ఒక వీడియో వైరల్ అయింది. అందులో భజరంగ్ ముని ముస్లిం మహిళలని రేప్ చేస్తామని బెదిరించారు. ఈ వీడియో వివాదాస్పదమైంది. దాని తరువాత, ఆయన క్షమాపణలు కోరారు. ఆయనకు ఏప్రిల్ నెలలో ఈ కేసులో బెయిల్ లభించింది.

https://twitter.com/aninewsup/status/1514257914642382852

https://twitter.com/ANINewsUP/status/1514276855741759495

"మీరు మా హిందూ మహిళలతో అలా చేస్తే మేం కూడా అలాగే జవాబు ఇస్తాం అని చెప్పాను. ఆ నాలుగు పదాలు అనుకోకుండా నా నోటి నుండి వచ్చాయని ఇప్పటికీ చెబుతున్నా. అది కూడా కండీషనల్ అన్న అర్థంలో వాడాను." అని భజరంగ్ ముని బీబీసీతో చెప్పారు.

ముస్లిం, క్రైస్తవుల పౌరసత్వం రద్దు చెయ్యాలని, జనాభా నియంత్రణ చట్టం చేయాలని భజరంగ్ ముని డిమాండ్ చేస్తున్నారు.

"మతం పేరు మీద దేశ విభజన జరిగింది. మనది మొదటి నుంచి కూడా హిందూ దేశమే. వాళ్లనే తరిమెయ్యాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

2021 ఫిబ్రవరిలో తనను గుర్తుతెలియని వ్యక్తులు వెన్నులో కత్తితో పొడిచారని, దాని కారణంగా నడవలేకపోతున్నానని, "ఇరవై నాలుగు గంటలు నొప్పితో బాధపడుతున్నాను" అని చెప్పారు.

"నా మీద తొమ్మిది సార్లు దాడి జరిగింది. నన్ను కత్తితో పొడిచారు. ఏ మీడియా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు." అని ఆయన అన్నారు.

భజరంగ్ ముని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో అవ్వార్ అనే గ్రామంలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి మధ్యప్రదేశ్ పోలీసు విభాగంలో పని చేసేవారు. ఇండోర్‌లో బీబీఏ పూర్తి చేశాక 2007లో కోయంబత్తూరులో జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. అక్కడే ఆయనకు సాధువులతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా ఆయన హిందుత్వ వైపు ఆకర్షితులయ్యారు. మొదట్లో ఆయన గోరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేవారు.

"ఆవులను దొంగిలించి, తరలించే వాహనాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ పట్టుకునే ప్రయత్నాలు చేస్తుండేవాడిని" అని భజరంగ్ ముని చెప్పారు.

ఆస్ట్రేలియా పౌరులైన గ్రహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటనలో నిందితుడు ధారాసింగ్‌ను భజరంగ్ ముని "దేవదూత"గా భావిస్తారు. ఎందుకు అంటే "ఆయన (ధారా సింగ్) నిస్వార్ధ భావనతో పనిచేశారు" కాబట్టి.

గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలను 1999లో ఒడిశాలోని ఒక గ్రామంలో తగలబెట్టి చంపేశారు. గ్రాహం స్టెయిన్స్ అక్కడ పేద హిందువులను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారన్నది అతివాద హిందూ సంస్థల ఆరోపణ.

"లౌకిక వాదులు ధారా సింగ్ తప్పు చేశాడు అంటారు. ఆ మనిషి పందొమ్మిది ఏళ్ల నుంచి కారాగారంలో ఉన్నాడు. సాటి హిందువులు తనకు కనీసం రొట్టె ముక్క కూడా పెట్టడం లేదు. తను అక్కడ ఎంతో హింసను అనుభవిస్తున్నాడు. ఇంకెవరైనా అయితే మరో మాట చెప్పేవాళ్లు కానీ, ధారా సింగ్ మాత్రం నేను జైలు నుంచి విడుదలైతే, హిందూ మతాన్ని సంరక్షించే పనిలో పడతానని చెబుతున్నాడు" అని భజరంగ్ ముని అన్నారు.

'తాజ్ మహల్‌ కాదు.. తేజో మహల్'

సీతాపూర్‌కు కొద్ది దూరంలో ఉన్న మరొక పట్టణంలో నివసించే గోవింద్ పరాశర్ జాతీయ హిందూ పరిషత్ అధ్యక్షులు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఒకప్పుడు తేజో మహల్ గుడి అని, దానిని కూలగొట్టారని 38 సంవత్సరాల పరాశర్ అభిప్రాయం. అయితే, ఆయన చెప్పేదానికి ఎటువంటి చారిత్రక, పురాతత్వ ఆధారాలు లేవు.

కొన్ని సంవత్సరాల క్రితం గోవింద్ పరాశర్, మరికొన్ని హిందుత్వ సంస్థలు తాజ్ మహల్‌లో పూజ చేస్తాం అని డిమాండ్ చేశాయి. దాంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.

తాజ్ మహల్‌లో ఉన్న సమాధుల గురించి ఆయన ఇలా అంటాడు.. "అవి సమాధులు కావు. అవి తేజో మహల్‌లోని కడ్డీలు. వాటి మీద నీటి చుక్కలు కారుతూ ఉంటాయి".

గోవింద్ పరాశర్ మొదట్లో భజరంగ్ దళ్ సంస్థలో పని చేసేవారు. అక్కడ ఆయన గోవులని రక్షించడం, 'లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడడం' మొదలైన పనులు చేసేవారు. తరువాత తాజ్ మహల్‌లో పూజ చేస్తాం అని డిమాండ్ చేశాక ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

తాను కారాగారంలో ఉన్నప్పుడు భజరంగ్ దళ్ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదన్నది గోవింద్ పరాశర్ ఆరోపణ, అందుకే తను ఆ సంస్థ నుంచి బయటకి వచ్చి తన సొంత సంస్థ ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. తమ సంస్థకు దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారని పరాశర్ చెప్పారు.

"హిందువులను వృద్ధిలోకి తీసుకురావడం, తమ తోటి హిందూ సోదర సోదరీమణులకు ఎలా సహాయం చేయాలో, ఆవులను ఎలా కాపాడాలో అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పడం" మొదలైన కార్యక్రమాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పని చేస్తున్న హిందుత్వ సంస్థ సంస్కృతీ బచావో మంచ్ నినాదం.. ’మన సంస్కృతి, మన వారసత్వం".

ఈ మంచ్‌కి చెందిన చంద్రశేఖర్ తివారి ఉద్దేశంలో ప్రేమికుల దినోత్సవం, రెయిన్ డాన్స్ పార్టీ లాంటివి భారతీయ సంస్కృతిని నాశనం చేసే కుట్రలు.

హిందూ-ముస్లింల మధ్య జరిగే పెళ్లిళ్లను ఆపటం, "హిందూ బాల బాలికలకు విషయాలను విప్పిచెప్పడం, సంస్కారాల గురించి శిక్షణ శిబిరాలు నిర్వహించటం, ప్రజలు గుడికి వెళ్లేలా, అక్కడ రామాయణం, హనుమాన్ చాలీసా చదివేలా ప్రోత్సహించడం" మొదలైన కార్యక్రమాలను ఈ మంచ్ నిర్వహిస్తుంది.

పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు గత కొద్ది కాలంలోనే వెలుగులోకి వచ్చారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా సనాతన సంస్థ, హిందూ యువ వాహిని, భజరంగ్ దళ్, శ్రీ రామ్ సేనే, హిందూ ఐక్య వేది లాంటి సంస్థలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి.

నేడు క్షేత్రస్థాయిలో రామ్ సేన, హిందూ సేన, సనాతన ధర్మ ప్రచార సేవా సమితి, కర్ణి సేన, విశ్వ హిందూ మహాకాళ్ సేన లాంటి హిందుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి.

హిందూ రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు?

ఈ సంస్థలు ఎలా పని చేస్తాయి?

రచయిత ధీరేంద్ర ఝా అభిప్రాయంలో గత కొద్ది సంవత్సరాలలో పుట్టుకొచ్చిన హిందుత్వ సంస్థల సంఖ్య చెప్పటం అసంభవం. ఎందుకంటే ఇందులో చాలా సంస్థలు కొద్ది కాలం మాత్రమే ఉనికిలో ఉంటాయి. ఈ సంస్థలు ఏదైనా వివాదం రేగినప్పుడు ఉనికిలోకి వచ్చి, అది సద్దుమణిగాక మాయమైపోతుంటాయి.

"గత కొద్ది సంవత్సరాలలో ఏర్పడిన ఇటువంటి సంస్థలు ఏదో ఒక వివాదం లేదా విషయం నేపధ్యంలో ఏర్పడినవే. ఈ సంస్థల పదాతి దళాలు చిన్న చిన్న ప్రలోభాలకు లోనై వాటిలో చేరుతూ ఉంటారు. అయితే ఈ సంస్థల నాయకుల ట్రాక్ రికార్డ్ కనుక చూసినట్లయితే వీరందరూ కూడా ఏదో ఒక వేళ్లూనిన హిందుత్వ సంస్థతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం కలిగినవారై ఉంటారు" అని ఆయన అన్నారు.

గత నాలుగైదు సంవత్సరాలలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతంలో దాదాపు 60 సంస్థలు ఏర్పడ్డాయని, ఇందులో చాలా సంస్థల గురించి ఎవరికీ తెలీదని ఆగ్రాకి చెందిన ఒక సీనియర్ పాత్రికేయులు చెప్పారు. ఆయన తన పేరు చెప్పటానికి ఇష్టపడలేదు. అయితే, అవేవీ రిజిస్టర్ అయిన సంస్థలు కాదని, వాటిని నడుపుతున్నవారు తమ ఇష్టానుసారం నడుపుతారని ఆయన అన్నారు.

తక్కువ సభ్యులు కలిగి ఉండే ఈ సంస్థలు పెద్ద సంస్థల నీడలో పనిచేస్తాయని, ఆలాగే ఏదైనా వివాదం చెలరేగినప్పుడు ఈ పెద్ద సంస్థలు వీటిని వదిలించుకుంటాయని ఆయన అన్నారు.

ఈ సంస్థలు ఏదో ఒక గుడి నుంచి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి, అలాగే వ్యాపారులు, సామాన్య ప్రజానీకం నుంచి డబ్బులు వసూలు చేసి తమ కార్యక్రమాలు నడుపుతాయని ఆయన చెప్పారు.

"ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి హిందుత్వ సంస్థల గ్రాఫ్ పెరిగింది. ఈ విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం" అని అఖిల భారత హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ తెలిపారు.

"హిందుత్వ భావన నేడు మేల్కొన్నది. రాముడి పట్ల, కాషాయం జెండా పట్ల అభిమానం పెరిగింది. మొఘలుల చేతిలో అణిచివేయబడ్డవారు గత ఎన్నో దశాబ్దాలుగా నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఎన్నో కొత్త సంస్థలు పుట్టుకువచ్చాయి" అని ఆయన అన్నారు.

గత కొద్ది సంవత్సరాలలో హిందుత్వ సంస్థల సంఖ్య ఎందుకు పెరిగింది?

బీజేపీ అధికారంలోకి వచ్చాక "కొంతమంది తమ ప్రాణాలు కాపాడుకోవటానికి కాషాయం వైపు వచ్చారు. కొంతమంది నేరస్తులు కూడా ఈ సంస్థలలో చేరారు. ఒక వంద రూపాయల కండువా కొనుక్కుని వేసుకోవటం, కాషాయధారిగా మారిపోవటం, ఏదో ఒక సంస్థలో దూరిపోవటం. కొంతమంది అయితే సంఘ్ పరివార్ సంస్థలలో కూడా చేరిపోయారు" అని గోవింద్ పరాశర్ అన్నారు.

"ఈ సంస్థలకు చెందినవారు ఏదైనా నేరం చేసి పోలీసులకు చిక్కినప్పుడు తాము ఫలానా హిందుత్వ సంస్థకు చెందిన వారమని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే తాము అటువంటి సంస్థకు చెందినవారిమని పోలీసులకి తెలిస్తే తమతో సున్నితంగా ప్రవర్తిస్తారని. పోలీసులు కూడా వీళ్లతో సున్నితంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్లు అధికారంలో ఉన్నారు, అలా ప్రవర్తించకపోతే నానా గొడవ చేస్తారు అని పోలీసులు భావిస్తారని" గోవింద్ పరాశర్ అన్నారు.

"గత 7-8 సంవత్సరాలలో ఇటువంటి అనేక సంస్థలు చాలా చురుకయ్యాయి. కారణం ఏమిటంటే వీరికి అధికార వర్గాల మద్దతు ఉండటం. ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో, ఆయా రాష్ట్రాలలో ఈ సంస్థలు బాగా చురుకుగా పనిచేస్తున్నాయి. బీజేపీ రాజకీయ కార్యక్రమమే ప్రజలను విభజించటం. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, కాబట్టి రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యవలసిన పరిమితి దాని మీద ఉంది. అందువలన వాళ్లకు ఎంతో అవసరమైన పనిని వాళ్లు ప్రత్యక్షంగా చెయ్యలేకపోతున్నారు. అదే ప్రజలని మతం పేరు మీద విభజించటం. ఆ పనిని ఈ హిందుత్వ సంస్థలు చేస్తున్నాయి" అని ధీరేంద్ర ఝా అన్నారు.

అయితే బీజేపీ నాయకులు మాత్రం తమవి మత విద్వేష రాజకీయాలు కావని, తమ నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అని చెబుతున్నారు.

"ఇటువంటి వివాదాల గురించి జరిగే చర్చలు సమాజంలో ఇతర చర్చలను ముందుకు రాకుండా చేస్తాయి. వీటి కారణంగా సమాజంలో అవసరమైన ఆలోచనలు వృద్ధి చెందవు. అటువంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మనం మనలోని దురభిమాన ఆలోచనలని (ప్రెజుడిస్) సమాజంలోకి వదులుతున్నాం. హిందుత్వ ఉద్యమంతో, ఆర్‌ఎస్‌ఎస్‌తో చారిత్రక అనుబంధం కలిగిన సంస్థలను, ఉద్యమాలను దోషులుగా చిత్రీకరించడానికి, వారి మీద దాడి చెయ్యటానికి అణిచివేతకు గురయిన ప్రజల మాటలు, చేతలను వాడుకుని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థలను, ఉద్యమాలను, వాటి నాయకత్వాన్ని, వాటి భావజాలాన్ని బోనులో నిలబెట్టడానికి ఈ దుష్ప్రచారం ఒక సాధనం. దాని నుంచి బయటపడవలసిన అవసరం ఉంది" అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రాకేశ్ సిన్హా అన్నారు.

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ విశ్వవిద్యాలయంలో సీనియర్ పరిశోధకులు, మానవ శాస్త్ర అధ్యాపకులు సతేంద్ర కుమార్ ఇటువంటి సంస్థలు పెరగటానికి గల కారణాలు వివరించారు.

"దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. రాజకీయ శత్రువులను సృష్టించడం జరిగింది. సమాజంలో చివరి అంచులలో ఉన్న ప్రజలలో తాము హిందువులుగా గుర్తింపబడాలి అని, హిందువులుగా అవ్వాలనే కోరిక బలపడింది. ఆంగ్ల భాష ప్రావీణ్యమే మెరిట్‌గా భావించే కులీన వర్గాల పట్ల భారతీయ భాషలు మాట్లాడే ప్రజలకు వ్యతిరేకత ఏర్పడింది. డిగ్రీ చదివాక కూడా యువత ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. అస్థిత్వ రాజకీయాల ప్రభావం పెరిగింది. ప్రభుత్వ సంస్థలు తమకు మానసిక రక్షణ ఇవ్వవు అనే అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడింది" అని ఆయన పేర్కొన్నారు.

"ఉద్యోగం లేకపోవటం కారణంగా గౌరవం లేదు. అలాంటి పరిస్థితులలో ఇటువంటి ఏదైనా సంస్థ సభ్యులు అయితే కనుక తమని ఎవ్వరూ ఏమి చేయలేరు అనే భావన వాళ్లల్లో ఏర్పడుతుంది" అని ఆయన అన్నారు.

"నిరుద్యోగ శాతం ఈ స్థాయిలో ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపించకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నది. దీని ఫలితం ఏమిటంటే యువత చాలా సునాయాసంగా ఈ ద్వేషం ఉచ్చులో పడిపోతున్నారు. అక్కడ తమకి అధికారం ఉంది అనే భావన వాళ్లల్లో కలుగుతున్నది" అని ధీరేంద్ర ఝా అన్నారు.

సతేంద్ర కుమార్ తాను ఉత్తర్ ‌ప్రదేశ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పుడు, అక్కడ విద్యార్ధులలో చాలా మంది హిందూ సంస్థలలో సభ్యులుగా ఉండేవారన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

"యువతలో ఒక భారీ వర్గానికి ఎటువంటి అవకాశాలు భవిష్యత్తులో కనిపించడం లేదు. అవకాశాలు అంటూ ఉంటే అవి నెలకి ఎనిమిది, పది వేల రూపాయల జీతం తెచ్చేవి మాత్రమే. అటువంటి వారి దగ్గర సేవింగ్స్ అంటూ ఏమి ఉండవు, సొంత ఇల్లంటూ ఉండదు, ఆరోగ్య సదుపాయాలు ఉండవు. వాళ్లు తమ తల్లిదండ్రులతోనే ఉంటూ ఉంటారు.

అదే సమయంలో తమ శత్రువులు తమకి రావాల్సిన ఉద్యోగాలు సొంతం చేసుకున్నారని చెబుతూ వారి చుట్టూ ఒక సాంసృతిక ఉచ్చు పన్నటం జరుగుతోంది. ఆ శత్రువుల జాబితాలో వలస వచ్చినవారు ఉన్నారు, ఇతర మతాలకి చెందిన వారు ఉన్నారు. మతమే అస్థిత్వం అయి కూర్చుంది. ఇక్కడ మతం అనేది నైతికతకో, విలువలకో సంబంధించింది కాదు. అది కేవలం మేము హిందువులం, మేము ఎవ్వరికీ తక్కువ కాదు అనే ఒక భావనని చూపించటానికి మాత్రమే.

ఆంగ్లం లేదా పంజాబీ మాధ్యమంలో చదువుకుని వచ్చిన వాళ్లని వీళ్లు అవమానించే ప్రయత్నం చేస్తుంటారు. తాము పాశ్చాత్య సాంసృతిక దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనే భావనలో ఉంటుంటారు. హిందువులమని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హిందువులని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కాబట్టి. ఇటువంటి అనేక కారణాలు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి" అని సతేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

"2014లో ఈ అంశాలు అన్నీ ఒక్కసారిగా కలిసికట్టుగా పని చేశాయి. ఈ అంశాలు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ఇందులో గత ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. ఎవరో బయట నుంచి వచ్చి మన మీద పెత్తనం చేసి, మనల్ని పాలించి వెళ్లిపోయారు అనే భావన ప్రజలలో ఉంది. ఈ భావనని ఈ సంస్థలు వాడుకుంటున్నాయి" అని ఆయన అన్నారు.

హిందుత్వ సిద్ధాంత‌క‌ర్త వి.డి.సావ‌ర్క‌ర్

హిందుత్వ సంస్థలలో 'అగ్ర కులాల' పెత్తనం?

''హిందుత్వ సంస్థలలో క్షేత్రస్థాయిలో పని చేసేవారిలో ఎక్కువ మంది సమాజం 'క్రింది కులాలుగా' పరిగణించే కులాలకి చెందిన వారే. అయితే ఏ హిందుత్వ కోసమైతే తాము తమ జీవితాన్ని ధారపోస్తున్నామో అది బ్రాహ్మణత్వం తప్ప మరేమీ కాదు అనే విషయాన్ని వారు గుర్తిస్తున్నట్టు లేదు’’ అని రచయిత ధీరేంద్ర ఝా తన పుస్తకం 'షాడో ఆర్మీస్, ఫ్రింజ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ హిందుత్వ'లో రాశారు.

"వాళ్లు హైందవ ధర్మంలో పెరుగుతున్న మతాధిపత్య ధోరణులతో, 'ఇతరుల' పట్ల ద్వేషంతో ఎంతగా కబోదులుగా తయారయ్యారంటే వారు ఏ హిందుత్వ కోసమైతే పనిచేస్తున్నారో ఆ హిందుత్వకి బ్రాహ్మణుల, ఇతర అగ్ర కులాలకు చారిత్రకంగా ఉన్న ఆధిపత్య స్థాయిని తిరిగి పునఃప్రతిష్ట చెయ్యటమే లక్ష్యం అనే విషయాన్ని తెలుసుకోలేకపొతున్నారు" అని ఆయన తన పుస్తకంలో రాశారు.

ప్రమోద్ ముతాలిక్‌కు చెందిన శ్రీ రామ్ సేనలో ఉన్న క్రింద కులాలకి చెందిన కార్యకర్తలు సంఘ్ పరివార్‌లో తమని కులం ఆధారంగా ఎలా వివక్షకి గురిచేశారో చెప్పిన విషయాన్ని ఆయన తన పుస్తకంలో రాశారు.

"సంఘ్‌లో ఈ విషయం ఎవ్వరూ చెప్పరు కానీ అక్కడ జరిగే ప్రతి పని కూడా బ్రాహ్మణులకి లాభం చేకూర్చేదే అయ్యి ఉంటుంది. క్రింది కులాలకి చెందిన వారు క్రింది స్థాయి పనులు చెయ్యక తప్పదు. ఆ పనిని మీరు చెత్త పని అని కూడా పిలవచ్చు. ఉదాహరణకి రోడ్ల మీద గొడవలు చెయ్యటం లాంటివి." అని ఒక కార్యకర్త చెప్పటం జరిగింది.

ఆర్‌ఎస్‌ఎస్ లో బ్రాహ్మల, అగ్రకులాల ఆధిపత్యం పూర్తిగా ఉన్నది అనే విమర్శ ఎప్పటినుండో ఉన్నదే.

అయితే, సంఘ్ ఈ విమర్శని ఒప్పుకోదు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు మోహన్ భగవత్ హిందూ సమాజంలో అస్పృస్యత, అసమానత రెండు పెద్ద సమస్యలు అని, అవి తీరటానికి సమయం పడుతుంది అని చెప్పారు.

ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ లో ఒక దళితుడు కూడా సంఘ్ ప్రముఖ్ అవ్వొచ్చు అని అన్నారు.

కుల వివక్ష గురించి పదునైన మాటల్లో మాట్లాడుతూ మేము కుల వివక్షను విశ్వసించం, పాటించం అని అన్నారు. సంఘ్ లో మేము వారి కులం ఏమిటి అని అడగం. అది మా సంస్కృతి కాదు అని అన్నారు.

భోపాల్‌కు చెందిన చంద్రశేఖర్ తివారి మొదట్లో భజరంగ్ దళ్‌లో ఉండేవారు. ఆయన పన్నెండు సంవత్సరాల వయసు నుండి గుడిలో సేవ చెయ్యటం మొదలుపెట్టి "హిందుత్వ కోసం" మూడు దశాబ్దాలకి పైగా పని చేస్తున్నారు.

పద్దెనిమిది సంవత్సరాల కిందట కాంగ్రెస్ హయాంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంస్కృతీ బచావో మంచ్ స్థాపించారు. ఈ సంస్థ నినాదం.. మన సంస్కృతి, మన వారసత్వం.

హిందుత్వ సంస్థలలో 'అగ్ర కుల' పెత్తనం అనే వాదన కేవలం ఒక భ్రాంతి అని, హిందూ సమాజం ఒక్కటవ్వకుండా ఉండటానికి తీసుకువచ్చిన వాదన అని ఆయన అన్నారు.

"మా జిల్లా అధ్యక్షులు ధనుక్ కులానికి చెందిన వారు. మేము గత ఎనిమిది సంవత్సరాలుగా చునారి యాత్ర చేస్తున్నాము. అలాగే మా విధి-విధానాల ప్రకారం ఆ గుడిలో మేము ఇద్దరం కలిసే పూజ చేస్తాము. అక్కడ నుండే మా ఈ యాత్ర మొదలవుతుంది." అని ఆయన చెప్పారు.

అయితే పూర్వ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, 1991లో జరిగిన మొదటి కరసేవలో పాల్గొన్న భన్వర్ మేఘవంశీ దీనితో విభేదిస్తున్నారు.

1991లో తాను ఒక మాట విన్నానని ఆయన చెప్పారు. హిందూ సంస్థలకు చెందిన సాధువులు ఆయన ఇంట్లో భోజనం చేయలేదని, తాను భోజనాన్ని ప్యాక్ చేసి పంపినప్పుడు పక్కగ్రామంలో తినబోతూ ఇది దళితుడి ఇంట్లో వండిన అన్నం అంటూ ఆ ప్యాకెట్లను విసిరికొట్టారని ఆయన చెప్పారు.

రాజస్థాన్ లో భిల్వార జిల్లాలో సర్దియాస్ గ్రామానికి చెందిన వారు భన్వర్ మేఘవంశి. ఇప్పుడు ఆయన జైపూర్ లో ఉంటున్నారు. "నాకు అప్పుడు అనిపించింది. నేను మీ కోసం, రామ మందిరం కోసం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్ననే. కానీ మీరు మా ఇంట్లో భోజనం చెయ్యటానికి కూడా సిద్ధంగా లేరు"

స్థానిక సంఘ్ నాయకుల దగ్గరికి భన్వర్ ఈ ఫిర్యాదుని తీసుకుని వెళ్ళాను. అయితే అక్కడ నుండి ఎటువంటి జవాబు లేకపోవటంతో నేను సంఘ్ పరివార్ నుండి బయటకి వచ్చేశాని అని ఆయన తెలిపారు.

ఈ మధ్య కాలంలో హిందూ సంస్థలలో చేరుతున్న దళిత, ఓబీసీ వారి సంఖ్య పెరుగుతున్నా కూడా నేటికీ అధికారం 'అగ్రకులాల' చేతిలోనే ఉన్నదన్న విషయం ఆయన చెప్పారు.

పీఠాధిపతులు

భవిష్య భారతం

హిందుత్వ సంస్థలు అనుక్షణం దేశాన్ని హిందూ దేశంగా మార్చటం గురించి మాట్లాడుతున్నాయి.

"భారత దేశం హిందూ దేశంగా మారాలి అని మేం కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు హిందుత్వ వైపు ఆకర్షితులు కావాలి అని కూడా. నేపాల్ ఒకప్పుడు పూర్తిగా హిందూ దేశం. అయితే, ఇప్పుడు అది కూడా పోయింది. మన కళ్ల ముందే పోయింది" అని ఉత్తర్ ప్రదేశ్‌లో హిందూ యువ వాహిని సంస్థాపక సభ్యులు రాంలక్ష్మణ్ అన్నారు.

2002లో ఏర్పడిన హిందూ యువ వాహిని ముఖ్య పోషకులు నేటి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

రాజకీయాలకి అతీతంగా సాంస్కృతిక రంగంలో పని చేసే తమ సంస్థ "ఎక్కడైతే హిందువుల మీద దమనకాండ జరుగుతున్నదో, ఎక్కడైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో, ఎక్కడైతే హిందూ మతం, సంస్కృతి ప్రమాదంలో" ఉన్నాయో అక్కడ పనిచేస్తుంది అని రాంలక్ష్మణ్ తెలిపారు.

వారి సంస్థ పట్ల పోలీసుల తీరు ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు ఆయన " మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని జైలులో పెట్టాలి. అయితే హిందుత్వ పని చెయ్యటమే తప్పు అంటే, మేం ఆ తప్పు చేస్తూనే ఉంటాం. మేము రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం" అని ఆయన జవాబిచ్చారు.

అది యతి నరిసింహానంద్ కానివ్వండి లేదా ఇతర హిందుత్వ నాయకులు కానివ్వండి.. అధికార వర్గాలు, వారి మీద చర్యలు తీసుకోవటం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తుంటారు. అయితే ఈ విమర్శ మాత్రం వస్తూనే ఉంది.

ముస్లింలను లించింగ్ చేసిన ముద్దాయిలు కారాగారం నుంచి బయటకి వచ్చినప్పుడు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పూలమాలలతో స్వాగతం పలికిన విషయాన్ని ధీరేంద్ర ఝా గుర్తుచేశారు.

ఇటువంటి పరిస్థితులలో భవిష్యత్తులో దేశ విధి-విధానాలు, చట్టాల మీద ఈ హిందుత్వ సంస్థల ప్రభావం ఎంత వరకు ఉంటుంది, అలాగే దేశ రాజకీయాల మీద, ప్రజాస్వామిక ఎన్నికల మీద ఈ సంస్థలు ఎటువంటి ప్రభావం చూపుతాయి అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Who are carrying the Hindutva flag and are the soldiers preparing to build a Hindu nation?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X