పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఆయనేనా-వచ్చే ఎన్నికలకు సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్-కాంగ్రెస్ వ్యూహమిదే

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో... సహజంగానే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది.శనివారం(సెప్టెంబర్ 18) సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈసారి నాన్ సిక్కు వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ బలపడుతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైన నేపథ్యంలో... నాన్ సిక్కు వర్గానికి ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైతే తదుపరి సీఎం జాబితాలో ఓ నేత పేరు బలంగా వినిపిస్తోంది...

సునీల్ కుమార్ జఖర్... తదుపరి సీఎం?

సునీల్ కుమార్ జఖర్... తదుపరి సీఎం?

అమరీందర్ సింగ్ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రిగా సునీల్ కుమార్ జఖర్ పేరు జాబితాలో ముందు వరుసలో ఉంది.పంజాబ్‌లోని అబోహర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు(2002-2017) ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ చేతిలో ఓటమిపాలయ్యారు.2012-2017లో పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. కాంగ్రెస్ నాన్ సిక్కు వర్గానికి ప్రాధాన్యమిస్తే సునీల్ కుమార్ జఖరే పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్...

సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్...

సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం నవజోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్‌గా ఆయన్ను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి పదవిని నాన్ సిక్కు వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.తద్వారా అటు అటు సిక్కుల్లో,ఇటు నాన్ సిక్కు వర్గాల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. నిజానికి ఇప్పటికిప్పుడు అమరీందర్ సింగ్‌ను పార్టీ నుంచి తప్పిస్తారని ఎవరూ ఊహించలేదు.అయితే అమరీందర్‌పై రోజురోజుకు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత పెరుగుతుండటం... పదేపదే ఆయన వ్యతిరేక వర్గం అమరీందర్‌పై ఫిర్యాదులు చేస్తుండటంతో... అధిష్ఠానం ఇక ఆయన్ను తప్పించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చింది.

బలం పుంజుకుంటున్న ఆమ్ ఆద్మీ

బలం పుంజుకుంటున్న ఆమ్ ఆద్మీ

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా తమ ప్రభను కోల్పోయిన కాంగ్రెస్ పంజాబ్‌లో మాత్రం పట్టు నిలుపుకుంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తుండటంతో కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఇటీవలి ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి 35శాతం ఓట్లతో 55 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.కాంగ్రెస్ కేవలం 42 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ దృష్టి సారించిందనే వాదన వినిపిస్తోంది. సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్‌లో ఎన్నికలు వెళ్లాలనే వ్యూహానికి ఇదే కారణమంటున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై అమరీందర్...

భవిష్యత్ కార్యాచరణపై అమరీందర్...


కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి కొద్ది గంటల ముందు అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.అంతకు కొద్ది నిమిషాల ముందు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సందేశాన్ని పంపించారు. రాజీనామా తర్వాత అమరీందర్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నన్నిలా అవమానించడం ఇది మూడోసారి.నా శక్తి సామర్థ్యాలపై వారికేమైనా సందేహాలున్నాయేమో.వారికి నచ్చినవారిని... నమ్మకస్తులనే సీఎంగా పెట్టుకోనివ్వండి.నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను.భవిష్యత్ కార్యాచరణపై నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.'అని అమరీందర్ సింగ్ వెల్లడించారు.

వ్యతిరేక వర్గంతో విసిగిపోయిన అమరీందర్

వ్యతిరేక వర్గంతో విసిగిపోయిన అమరీందర్

పంజాబ్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైన సంగతి తెలిసిందే.పదేపదే ముఖ్యమంత్రిపై వారు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు.అయినప్పటికీ అమరీందర్ సింగ్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్ రావత్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇటీవల అమరీందర్ వ్యతిరేక వర్గం మరోసారి కాంగ్రెస్ అధిష్ఠానికి లేఖలు రాసింది.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి నాయకత్వ మార్పు చేపట్టాల్సిందేనని కోరింది.దీనిపై మొదట ఒక కమిటీని పంజాబ్‌కు పంపించి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవాలని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజల్లోకి అది తప్పుడు సంకేతాలు పంపిస్తుందేమోనని వెనక్కి తగ్గినట్లు సమాచారం. అదే సమయంలో అమరీందర్‌ను రాజీనామా చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్లు చెబుతున్నారు.మరోవైపు అమరీందరే కాంగ్రెస్ తీరుతో విసిగిపోయి రాజీనామా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

సిద్దూ ప్రోద్బలమేనా...?

సిద్దూ ప్రోద్బలమేనా...?

పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజోత్ సింగ్ సిద్దూకి అప్పగించడంపై అమరీందర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాటను లెక్క చేయకుండా సిద్దూకి పదవి కట్టబెట్టడంపై అమరీందర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సిద్దూ,అమరీందర్ మధ్య చాలాకాలం పాటు కోల్డ్ వార్ నడిచింది.దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిచి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది.అయితే
ఇటీవల ఈ కోల్డ్‌వార్ సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ... తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇరువురి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే ఉంది. సిద్దూ ప్రోద్బలంతోనే అమరీందర్ సింగ్‌ వ్యతిరేక వర్గం ఆయనపై తిరుగుబాటు చేస్తూ వస్తోందనే వాదన ఉంది.తాజాగా అమరీందర్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి లేఖ రాయడం వెనుక కూడా సిద్దూ హస్తం ఉందనే వాదన లేకపోలేదు.అటు అమరీందర్ సింగ్ కూడా అధిష్టానం తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందనే భావనలోనే ఉన్నారు.ఇంత ఒత్తిడి నడుమ సీఎంగా కొనసాగడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.ఏదేమైనా ఎన్నికలకు కొద్ది నెలలు ముందు జరుగుతున్న ఈ కీలక మార్పులు పార్టీకి మేలు చేస్తాయో,చేటు చేస్తాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+