ఎవరీ విల్సన్ గార్డెన్ నాగ? దర్శన్‌తో లింక్ ఏంటీ?
Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప కష్టాలు మరింత పెరిగాయి. హత్యకేసులో అరెస్టయిన ఆయన జైలులో రాజభోగాలను అనుభవిస్తోన్నారంటూ వచ్చిన ఆరోపణలు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటో, వీడియో కాల్ ఆయన కొంపముంచింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయ్యారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

జైలులో దర్శన్ రాజభోగాలను అనుభవిస్తోన్నారని, ఓ రిసార్టులో ఉన్నట్లుగా అన్నింటినీ సమకూర్చుకున్నాడనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించింది.
ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరెట్‌తో కనిపించాడు దర్శన్ ఈ ఫొటోలో. అతనితో పాటు మరో ముగ్గురు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బేఫికర్‌గా ఉన్నట్లు తేలింది. తనకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడనే విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో మార్కెట్ ధర్మ అనే ఓ రౌడీ షీటర్ కొడుకుతో వీడియో కాల్‌లో మాట్లాడటం కూడా కలకలం రేపింది.
దర్శన్‌తో వైరల్ ఫోటోలో కనిపించిన వారిలో జే నాగరాజ్ అలియాస్ విల్సన్ గార్డెన్ నాగ ఉండటం చర్చనీయాంశమైంది. పోలీసుల రికార్డుల్లో అతనో హిస్టరీ షీటర్. అనేక కేసులు అతనిపై ఉన్నాయి. అయిదు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడు. పరప్పన అగ్రహార జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నాడు.
2017లో కోరమంగళ బబ్లీ అనే రౌడీ షీటర్ హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు విల్సన్ గార్డెన్ నాగపై ఉన్నాయి. 20 సంవత్సరాల్లో అతనిపై 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటే అతని నేర చరిత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో ఏడు హత్య కేసులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ధందాలకు లెక్కేలేదు.
2021లో నాగాపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అది ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. బెంగళూరుకే చెందిన గ్యాంగ్‌స్టర్లు సిద్ధాపుర మహేష్‌తో తరచూ గ్యాంగ్ వార్‌లను నడిపేవాడు. లింగరాజు అలియాస్ శాంతినగర్ లింగ హత్య తరువాత వారి మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి.
సిద్ధాపుర మహేష్ హత్యతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న విల్సన్ గార్డెన్ నాగ, అతని సన్నిహితుడు డబుల్ మీటర్ మోహన్ సహా మరో 20 మందిపై బెంగళూరు పోలీసులు కర్ణాటక వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టాన్ని ప్రయోగించారు. మార్చిలో బెంగళూరు పోలీసులు అతన్ని నగర బహిష్కరణ చేశారు. ఏడాది పాటు నిషేధించారు.
సిద్ధాపుర మహేష్ హత్య జరిగిన రెండు వారాల తరువాత అంటే ఈ నెల 18వ తేదీన నాగ, డబుల్ మీటర్ మోహన్ కోర్టు ముందు లొంగిపోయారు. పరప్పన అగ్రహార జైలులో విచారణలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా దర్శన్‌తో కలిసి కనిపించిన ఫొటో వెలుగులోకి రావడం దుమారం రేపుతోంది.












Click it and Unblock the Notifications