పొత్తు అవసరం ఎవరికి: మోడీకా, చంద్రబాబుకా?
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవచ్చుననే ఊహాగానాలు రోజురోజుకూ ఊపందకుంటున్నాయి. తెలుగుదేశం తెలంగాణ నాయకులే కాకుండా సీమాంధ్ర నాయకులు కూడా బిజెపితో పొత్తుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మాత్రం తాము ఓ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే చెబుతున్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దక్షిణాది రాష్ట్రాల్లో సాధ్యమనన్ని లోకసభ సీట్లు సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెసు దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెసు ఆశలు పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా తిరిగి ఎక్కువ సీట్లు సాధించాలనే రాజకీయ ఉద్దేశంతో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమకు 50 సీట్లు వస్తే కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ గతంలో ఓసారి చెప్పారు.

కాగా, బిజెపికి, తమ పార్టీకి మధ్య పొత్తు ఇద్దరికీ అవసరమని తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల అన్నారు. పొత్తు తమ పార్టీకి ఎంత అవసరమో, బిజెపికి కూడా అంతే అవసరమని ఆయన అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం విశాఖపట్నంలో అన్నారు.
తెలుగుదేశం నాయకుల మాటల తీరు చూస్తుంటే బిజెపితో పొత్తు పెట్టుకోక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిని కలిపి ఎదుర్కోవడానికి, సీమాంధ్రలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి ఇరు ప్రాంతాల్లో కూడా బిజెపితో పొత్తు పనికి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపికి ఇరు ప్రాంతాల్లో ఉన్న బలం తమకు తోడైతే శాసనసభ ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాగా, బిజెపికి శాసనసభ సీట్ల కన్నా లోకసభ సీట్లు ముఖ్యమవుతున్నాయి. ఈ స్థితిలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొన్ని కీలకమైన లోకసభ స్థానాలను గెలుకోవాలనే ఉద్దేశంతో బిజెపి జాతీయ నాయకత్వం ఉన్నట్లు అనిపిస్తోంది. కృష్ణంరాజు, బండారు దత్తాత్రేయ తదితర కీలకమైన నేతలను తెలుగుదేశం పొత్తుతో బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని నరేంద్ర మోడీ ఆలోచనగా చెబుతున్నారు. కనీసం ఆరు సీట్లయినా తమకు వస్తాయని గతంలో ఓసారి బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రత్యేకంగా దృష్టి పెడితే కనీసం పది సీట్లు గెలుచుకోగలమని ఆయన అన్నారు.
ఏ మాత్రం సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా అది బిజెపికి కలిసి వచ్చే అంశమే అవుతుంది. దాంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారా కొన్ని సీట్లనైనా తమ ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, రాష్ట్ర నాయకత్వం ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపడం వల్ల తెలంగాణలో తమకు సానుకూల వాతావరణం ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీపై తెలంగాణలో వ్యతిరేకత ఉన్నందు వల్ల పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని రాష్ట్ర నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకుల అభిప్రాయం ఎలా ఉన్నా చివరికి నెగ్గేది జాతీయ నాయకుల మాటే కాబట్టి తెలుగుదేశంతో బిజెపి పొత్తు తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications