Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లైంగిక వేధింపుల గురించి మహిళా క్రీడాకారులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?

లైంగిక వేధింపులు

భారత్‌లోని ప్రముఖ రెజ్లర్లలో ఒకరైన వినేశ్ ఫోగట్ 2023 జనవరి 18న దిల్లీలో ధర్నాకు కూర్చున్నారు. ఈ ఘటన భారత్‌లోని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

వినేశ్‌తోపాటు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లు కూడా ధర్నాలో పాల్గొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కు ప్రెసిడెంట్‌గా పనిచేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పది మందికిపైగా మహిళా రెజ్లర్లను వేధించారని వీరు ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండిస్తూ వచ్చారు. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణకు కేంద్ర యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఒక కమిటీ కూడా ఏర్పాటుచేసింది.

ఈ ఆరోపణలను భారత స్పోర్ట్స్‌లో ''మీ టూ’’ ఉద్యమంగా కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే, అసలు ఈ వేధింపుల గురించి వినేశ్ లేదా ఇతర రెజ్లర్లు ఇప్పటివరకు ఎందుకు పెదవి విప్పలేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

''ఆమె ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు?’’అని చాలా మంది ప్రశ్నించారు. ఇప్పుడేకాదు, దేశంలో ఎక్కడ వేధింపుల కేసులు బయటకు వచ్చినా.. ఇప్పటివరకు వారు ఎందుకు పెదవి విప్పలేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

అయితే, వేధింపుల గురించి మాట్లాడటం అంత తేలిక కాదని సైకాలజిస్టులు, హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

మరోవైపు భారత్‌లోని స్పోర్ట్స్ వాతావరణంలో అమ్మాయిలు ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడటం మరింత కష్టమని వారు అంటున్నారు.

బ్రిజ్ భూషణ్

భారత్ స్పోర్ట్స్‌లో అలా..

భారత్‌లోని ప్రధాన స్పోర్ట్స్ ఫెడరేషన్లలో దాదాపు అన్నింటికీ పురుషులే నేతృత్వం వహిస్తున్నారనేది అందరికీ తెలిసిన వార్తే. వీరిలో చాలా మంది రాజకీయ నాయకులే ఉంటారు. కొందరు అధికారిక వర్గాల నుంచి వస్తారు. మరికొందరు వ్యాపారవేత్తలు ఉంటారు.

జాతీయ స్థాయిలో మాత్రమే కాదు. స్థానికంగానూ శక్తిమంతమైన నాయకులే స్పోర్ట్స్ సంస్థల్లో కీలకమైన పదవులు చేపడుతుంటారు.

''నిందితుడు శక్తిమంతుడు అయ్యేటప్పుడు అతడిపై చర్యలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారు’’అని ఒక వెయిట్ లిఫ్టర్ బీబీసీతో చెప్పారు. ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.

''అలాంటి శక్తిమంతమైన నాయకులు మౌలిక సదుపాయాల ఏర్పాటులో సాయం చేయగలరు. స్పోర్ట్స్‌లో అనుకూలమైన వాతావరణాన్ని వారు సృష్టించగలరు కూడా. కానీ, కొందరు మాత్రం ఆ సంస్థకు వారు యజమాని అయితే, అథ్లెట్లకు కూడా తాము యజమానిగా ఫీల్ అవుతారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం అంత తేలికకాదు’’అని ఆమె చెప్పారు.

వారు చెప్పినట్లు నడుచుకోకపోతే, కొన్నిసార్లు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె అన్నారు. ''జట్టులో నుంచి ఆ అథ్లెట్లను తొలగించడం లేదా మానసికంగా వారిని కుంగదీయడం లాంటివి చేస్తారు. అదే వెయిట్ లిఫ్టింగ్‌లో అయితే, ప్లేయర్లు పూర్తిగా స్పోర్ట్స్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

లైంగిక వేధింపులు

ఈ పవర్ పాలిటిక్స్ అనేవి కోచ్/మెంటర్, అథ్లెట్ల మధ్య కూడా ఉంటాయని కొందరు అథ్లెట్లు చెబుతున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ''2010 నుంచి 2020 మధ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 45 లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 29 ఫిర్యాదులు కోచ్‌లపైనే వచ్చాయి. అయితే, వీటి విషయంలో తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. కేవలం ఐదుగురు కోచ్‌ల జీతాలు తగ్గించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరిని విధుల నుంచి తొలగించారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌లో మహిళల సంఖ్య పెరిగితే, మహిళా క్రీడాకారిణుల పరిస్థితి కాస్త మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, నేడు నైపుణ్యవంతులైన మహిళా కోచ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని వారు వివరిస్తున్నారు.

ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ జడ్జి అండ్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కోచ్ వర్ష ఉపాధ్యాయ్ అన్నారు.

''ట్రైనింగ్‌లో భాగంగా ప్లేయర్లను కోచ్‌లు ముట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్లేయర్, కోచ్‌ల మధ్య రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం’’అని వర్ష అన్నారు.

''మీకు ఒకవేళ మగ కోచ్‌లు ఉన్నప్పటికీ, అక్కడ సాయం అందించేందుకు మహిళా అసిస్టెంట్లు ఉండాలి. కానీ, ఇలాంటి నిబంధనలను ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి?’’అని ఆమె ప్రశ్నించారు.

''కాలం మారిందని కోచ్‌లు అర్థం చేసుకోవాలి. అసలు మేం చెప్పిందే వేదం అనే రోజులు పోయాయని వారు ముందు తెలుసుకోవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

లైంగిక వేధింపులు

ఆ కమిటీలు ఏమయ్యాయి?

ఒకవేళ స్పోర్ట్స్‌లోని మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడాలి అనుకుంటే, వారు ఎక్కడికి వెళ్లాలి? ఇక్కడ వారి ముందున్న మార్గాలు చాలా తక్కువ. ఒక్కోసారి అసలే ఉండవు.

నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా 2011 ప్రకారం.. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే బాధ్యత స్పోర్ట్స్ ఫెడరేషన్‌లదే.

ఫిర్యాదుల కోసం మొదట ఇంటర్నల్ కంప్లైట్స్ (ఐసీ) కమిటీలను వీరు ఏర్పాటుచేయాలి. ఈ కమిటీకి మహిళలు నేతృత్వం వహించాలి. మరోవైపు మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులకు దీనిలో సభ్యత్వం కల్పించాలి. మొత్తంగా ఈ కమిటీలో మహిళల వాటా 50 శాతం కంటే ఎక్కువే ఉండాలి.

అయితే, చాలా ఫెడరేషన్లు ఇలాంటి కమిటీలను ఏర్పాటుచేయలేదు. కొన్ని ఫెడరేషన్‌లు మాత్రమే దీని గురించిన వివరాలను తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకే ఒక మహిళా సభ్యురాలు ఉన్నారు.

'’50 శాతం మహిళలు ఉండేలా చూడటం తప్పనిసరి. కానీ, మన దేశంలో ఇలాంటి తప్పనిసరి నిబంధనల్లో ఎన్ని పాటిస్తున్నారు. కానీ, ఇప్పుడు నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది’’అని ఒక షూటింగ్ కోచ్ బీబీసీతో మాట్లాడారు.

ఈ అవగాహన స్పోర్ట్స్‌కు వెలుపల కూడా సానుకూల మార్పులకు దారితీస్తుందని ఆమె భావిస్తున్నారు.

లైంగిక వేధింపులు

అర్జునా అవార్డు గ్రహీత, ఒలింపియన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలాకు భారత్‌లో స్పోర్ట్స్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.

తాజా లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ''అవును.. ఇలాంటివి జరుగుతున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వర్గాల అభిప్రాయాలను మేం పరిగణలోకి తీసుకుంటాం’’అని ఆయన చెప్పారు.

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా మాజీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ నేతృత్వంలో సేఫ్‌గార్డింగ్ అథ్లెటిక్స్ ఫ్రమ్ హరాస్‌మెంట్ అండ్ అబ్యూస్ ఇన్ స్పోర్ట్స్‌ (ఎస్ఏహెచ్ఏఎస్) ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలోని సభ్యుల్లో మహిళల వాటా 50 శాతానికిపైనే ఉంది.

''మహిళలు, పిల్లలను వేధింపుల నుంచి రక్షించడమే మా ప్రధాన కర్తవ్యం. అయితే, ఎవరైనా దురుద్దేశ పూర్వకంగా ఫిర్యాదులుచేస్తే, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం’’అని ఆదిల్ చెప్పారు.

స్పోర్ట్స్‌కు సంబంధించిన సంస్థల్లో మరింత మంది మహిళలు ఉండాల్సిన అవసరముందని ఆదిల్ కూడా అభిప్రాయం వ్యక్తంచేశారు.

బ్రిజ్ భూషణ్

తోడుగా ఉండాలి..

''సోర్ట్స్‌లో ప్లేయర్‌లు తమను తాము మెరుగుపరచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వారికి వారే ఒక సురక్షితమైన వాతావరణం ఏర్పరుచుకోవాలి కూడా. తోటి ప్లేయర్లతో మాట్లాడుతూ, వారికి అండగా నిలవాలి’’అని మాజీ ఒలింపిక్ షూటర్ బీబీసీతో చెప్పారు.

''షూటింగ్‌లో పాల్గొనే నా స్నేహితులతో నేను తరచూ మాట్లాడుతుంటాను. వారు గేమ్‌లో నాకు ప్రత్యర్థులే కావొచ్చు. కానీ, తోటి ప్లేయర్లు కూడా. నాకు ఏదైనా కాస్త అసౌకర్యంగా అనిపిస్తే, నేను వారితో మాట్లాడుతుంటాను. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చినట్లుగా అనిపిస్తుంది’’అని ఆమె వివరించారు.

''కానీ, నేడు ఆ నెట్‌వర్క్ తగ్గిపోతోంది. పోటీ పెరుగుతోంది. అలా కాకుండా ప్లేయర్ల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలి. అంతా కలిసి ముందుకు వస్తేనే, ఏదైనా చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుంది’’అని ఆమె అన్నారు.

''నిజానికి చాలా స్పోర్ట్స్ విభాగాల్లో ఇలాంటి నెట్‌వర్కింగ్ కనిపించడం లేదు. దూకుడుగా ముందుకు వెళ్లడానికే ప్లేయర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి దూకుడుతత్వమే ఒక్కోసారి వేధింపులకు.. ఆ తర్వాత లైంగిక వేధింపులకు కారణం అవుతోంది’’అని ఆమె అన్నారు.

స్పోర్ట్స్

స్విట్జర్లాండ్‌కు చెందిన అథ్లెట్ హక్కుల కార్యకర్త పయోషిని మిత్ర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

''లైంగిక వేధింపులు మాత్రమే కాదు.. స్పోర్ట్స్ సంస్థల్లోని కొందరు ప్రవర్తన చాలా ఆవేశపూరితంగా ఉంటోంది. వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియాల మాటలు విన్నప్పుడు నాకు అదే అనిపించింది’’అని మిత్ర అన్నారు.

''స్పోర్ట్స్‌ సంస్థల్లో చిన్నపెద్ద అనే తేడా ఉంటుంది. ఇక్కడ పైస్థాయిలో ఉండేవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటారు. ఇప్పుడు ప్రముఖ అథ్లెట్లే వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది చాలా పెద్ద విషయం అని తెలుస్తోంది’’అని ఎన్‌డీటీవీతో మిత్ర చెప్పారు.

''స్పోర్ట్స్‌లో మహిళలను మార్గనిర్దేశకులుగా చూస్తాం. కానీ, వారు కూడా మనుషులే, వారికి భావోద్వేగాలు ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి’’అని ఆమె అన్నారు.

2018లో అమెరికా జిమ్నాస్ట్ టీమ్ డాక్టర్ ల్యారీ నాసర్‌ 150 మందికిపైగా జిమ్నాస్ట్‌లను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి రుజువయ్యాయి కూడా. దీంతో ఆయనకు 175 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అమెరికా లాంటి దేశాల్లోనూ లైంగిక వేధింపులు ఉంటాయని ఈ ఘటనలు రుజువు చేశాయి.

అమెరికన్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ కూడా ఇలాంటి వేధింపులపై మాట్లాడేటప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో ఇదివరకు మీడియాతో చెప్పారు.

విపరీతమైన ఒత్తిడి వల్ల వేధింపులపై స్పోర్ట్స్‌లోని మహిళలు మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.

ఒత్తిడి ఎలా ఉంటుంది?

ఈ ప్రశ్నపై వర్ష మాట్లాడుతూ.. ''చాలా మంది అమ్మాయిలు పేదరికం, లేదా మధ్య తరగతి కుటుంబాల నుంచి వస్తుంటారు. వారికి స్పోర్ట్స్ అనేది పేదరికం నుంచి బయటపడేసే ఒక మార్గం. దీనిలో వారికి ఉద్యోగాలు వస్తాయి. వారి జీవితాలు మారుతుంటాయి. కానీ, వేధింపులతో వారి జీవితాలే తలకిందులు అవుతున్నాయి’’అని ఆమె చెప్పారు.

''జిల్లా స్థాయి నుంచే వారిలో ఒత్తిడి మొదలవుతుంది. తల్లిదండ్రులు వారు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. ఎలాగైనా గెలవాలని వారు చెబుతారు. కొన్ని సార్లు వేధింపుల గురించి చెప్పినా వారు పట్టించుకోరు. ఇక్కడ కొన్ని హద్దులు ఉంటాయని, వాటిని ఎవరూ దాటకూడదని తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. కోచ్-ప్లేయర్ల మధ్య కూడా ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఉండాలి’’అని ఆమె వివరించారు.

ప్రస్తుతం ప్రముఖ రెజ్లర్లు దీని గురించి మాట్లాడటంతో, పరిస్థితులు మారే అవకాశముందని వర్ష ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

నేడు ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి పర్యావసానాలు ఉంటాయో ప్లేయర్లకు తెలుసు. ఆరోపణలపై నిరసన తెలుపుతున్నప్పుడు, వినేశ్ ఫోగట్ ఈ విషయంపై మాట్లాడారు.

''ఈ వేధింపుల గురించి ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసిన తర్వాత నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు. నేను ఈ రోజు బయటకువచ్చి మాట్లాడుతున్నాను. కానీ, రేపు నేను బతికుంటానో లేదో నాకు తెలియదు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+