వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతం అదానీ రూ. 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్‌లో తమాషా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. అది కూడా గౌతమ్ అదానీ సంస్థ 'అదానీ గ్రూప్' చుట్టూ ఈ బెట్టింగులు జరుగుతున్నాయి.

గత వారం అమెరికాకు చెందిన రీసెర్చ్ ఏజెన్సీ 'హిండెన్‌బర్గ్' నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు చిక్కుల్లో పడ్డాయి.

బుధవారం సాయంత్రం అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీఓను (భారతదేశంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌పీఓ) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో పెట్టుబడులు పెట్టినవారందరికీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని గౌతమ్ అదానీ ప్రకటించారు.

అయితే, మంగళవారం నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. అందుకే బుధవారం నాటి ప్రకటన ఆశ్చర్యం కలిగించింది.

దానికి ముందు, రిటైల్ ఇన్వెస్టర్లు దీనిపై ఎలాంటి ఆసక్తి చూపకపోవడంతో, వారి వాటాలో కేవలం 12 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది.

అదానీ గ్రూప్ ఉద్యోగుల కోసం రిజర్వు చేసిన షేర్లు కూడా పూర్తిగా అమ్ముడుకాలేదు. సుమారు 53 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

గౌతమ్ అదానీ గ్రూపు విశ్వసనీయత ప్రమాదంలో పడింది. చివరికి, కొన్ని పెద్ద సంస్థలు, పెట్టుబడిదారులు మొత్తం షేర్లను సబ్‌స్క్రైబ్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇది జరిగిన తరువాత, అనూహ్యంగా బుధవారం ఎఫ్‌పీఓను రద్దు ప్రకటన వెలువడింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏం చెబుతోంది?

అదానీ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన సమాచారం, పత్రికా ప్రకటనలో ఏం చెప్పిందంటే, "ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, అస్థిరత దృష్ట్యా, కంపెనీ తన పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని కోరుకుంటోంది. ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, షేర్‌హోల్డర్‌ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీ దానిని రద్దు చేస్తోంది. పెట్టుబడిదారులకు వాళ్ల డబ్బు మొత్తం వెనక్కి తిరిగి చ్చేస్తాం."

ఈ ప్రకటన తరువాత, అదానీ గ్రూప్‌లో పరిస్థితి బాగాలేదనే ఊహాగానాలు మొదలయ్యాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక బ్యాంకు, అదానీకి చెందిన కొన్ని కంపెనీల బాండ్ల ల్యాండింగ్ విలువను సున్నాకి తగ్గించిందని బ్లూమ్‌బెర్గ్‌లో ఒక నివేదిక వచ్చింది. అదానీ గ్రూపు ఎఫ్‌పీఓ రద్దు చేయడానికి ఇదీ ఒక కారణమని కొందరు భావిస్తున్నారు.

కొద్ది రోజుల్లోనే కథ మొత్తం తారుమారైందా?

వాస్తవానికి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2022 నవంబర్‌లో ఎఫ్‌పీఓను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో అదానీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో మంచి జోరుమీదున్నాయి. ఈ వేగం కారణంగానే, గౌతమ్ అదానీ మొదట భారతదేశంలో, తరువాత ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రికార్డుకెక్కారు.

2022 చివరి నాటికి అదానీ ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు.

ఆ తరువాత కథ మారిపోయింది. 2023 జనవరి 24 న్యూయార్క్‌లోని హిండెన్‌బర్గ్ రిసెర్చ్ అనే చిన్న పెట్టుబడి సంస్థ ఒక నివేదికను ప్రచురించింది. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ 'షార్ట్ సెల్లింగ్' చేసే సంస్థ.

అదానీ గ్రూప్ షేర్లలో కృత్రిమ పెరుగుదలను చూపించిందని, కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నాయని ఈ నివేదికలో ఆరోపించారు.

అయితే, ఈ నివేదికను ఖండిస్తూ అదానీ గ్రూపు 413 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక "పూర్తిగా తప్పు" అని, "ఒక ప్రణాళిక ప్రకారం భారతదేశంపై చేసిన దాడి" అని పేర్కొంది.

అదానీ గ్రూప్ ఎప్పుడూ "అన్ని నియమాలు, నిబంధనలను అనుసరిస్తూనే ఉందని" కూడా తెలిపింది.

ఈ వివరణ పెట్టుబడిదారుల్లో అపోహలు తొలగిస్తుందని భావించారు కానీ, అలా జరగలేదు. హిండెన్‌బర్గ్ నివేదిక అప్పటికే స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల విలువ ఎఫ్‌పీఓ ఇష్యూ ధర కన్నా పడిపోయింది. దాంతో, రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఓ పట్ల ఆసక్తి చూపలేదు.

అయితే, ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కూడా అబుదాబిలోని ఒక పెద్ద ఫండ్ సహా పెద్ద పెట్టుబడిదారులు దేశీయ, విదేశీయ బ్యాంకులు, బీమా కంపెనీలు అదానీ గ్రూపు ఎఫ్‌పీఓ షేర్లను కొన్నాయి. ఇది అదానీకి మార్కెట్‌పై ఉన్న పట్టును, బలాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

2023 జనవరి 30 నాటికి ఎఫ్‌పీఓలో కేవలం 3 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. మర్నాడు జనవరి 31కి 100 శాతం కంటే ఎక్కువ సబ్‌స్క్రైబ్ అయింది.

ఇక్కడే కథలో ట్విస్ట్ వచ్చింది.

బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలతో మళ్లీ మార్కెట్ కళకళలాడడం ప్రారంభించింది.

అప్పుడే బ్లూమ్‌బర్గ్ నివేదిక వెలువడింది. ఐరోపాలోని ప్రసిద్ధ బ్యాంకు 'క్రెడిట్ సుయిస్' అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీల బాండ్ల ల్యాండింగ్ విలువను సున్నాకు తగ్గించిందని ఈ రిపోర్ట్‌లో తెలిపారు.

అంతే.. పైకి వెళుతున్న అదానీ గ్రూపు షేర్లు దబ్బున పడిపోయాయి. మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రూపు షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

బాండ్ల ల్యాండింగ్ విలువ జీరోకు రావడం అంటే ఏమిటి?

పెద్ద పెద్ద సంస్థలు మార్కెట్ నుంచి పెట్టుబడి పొందడానికి బాండ్లు జారీ చేస్తాయి. ఇందులో పెట్టుబడిదారులకు ఒక నిర్దిష్ట రాబడి హామీగా ఉంటుంది.

పలు ప్రైవేట్ బ్యాంకులు కంపెనీ బాండ్లపై ఖాతాదారులకు లోను ఇస్తాయి.

"చాలా బ్యాంకుల్లో కంపెనీ బాండ్లను తాకట్టు పెట్టి లోను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. బాండ్ల మొత్తం విలువలో 70 నుంది 80 శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. అయితే, బ్యాంకు రుణాలు ఇచ్చేముందు ఆ సంస్థ వాల్యుయేషన్, బ్యాలెన్స్ షీట్‌ను నిశితంగా పరిశీలిస్తుంది" అని మార్కెట్ విశ్లేషకుడు ఆసిఫ్ ఇక్బాల్ వివరించారు.

క్రెడిట్ సూయిస్ బ్యాంకు అదానీ కంపెనీల బాండ్ల ల్యాండింగ్ విలువను సున్నాకు తగ్గించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అంటే, అదానీ గ్రూపు బాండ్లను తాకట్టి పెట్టి ఆ బ్యాంకులో రుణాలు తీసుకునే వెసులుబాటును తొలగించారు.

సూటిగా చెప్పాలంటే, క్రెడిట్ సూయిస్ బ్యాంకులో అదానీ గ్రూపుకు చెందిన కంపెనీ బాండ్లకు రుణాలు ఇవ్వరు. దీనికి ముందే బాండు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే, ఆ రుణాన్ని కొనసాగించడానికి అదనపు పూచీకత్తు అందించాలి. అలా చేయలేదంటే బ్యాంకు వారి బాండ్లను అమ్మేసి, ఆ డబ్బుతో రుణాన్ని భర్తీ చేస్తుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, అదానీ గ్రూపుకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ బాండ్ల ల్యాండింగ్ విలువను క్రెడిట్ సూయిస్ బ్యాంకు సున్నాకు తగ్గించింది.

అయితే, అనేక ఇతర విదేశీ బ్యాంకులు ఇప్పటికీ తమ ఖాతాదారులకు అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లపై రుణాలు ఇస్తున్నాయి.

ఎఫ్‌పీఓ

ఎఫ్‌పీఓ అంటే ఏంటి?

"ఈరోజు (బుధవారం) స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు పతనాన్ని చూశాయి. ఇలాంటి అనిశ్చితి దృష్ట్యా, ఈ ఎఫ్‌పీఓతో ముందుకు వెళ్లడం నైతికంగా తప్పు అని బోర్డు భావించింది. మాకు పెట్టుబడిదారుల ప్రయోజనాలే ముఖ్యం. వారికి నష్టం కలగకుండా ఉండేందుకు ఎఫ్‌పీఓను వెనక్కి తీసుకుంటున్నాం" అంటూ అదానీ గ్రూపు ఒక ప్రకటన విడుదల చేసింది.

మార్కెట్‌లో స్థిరత్వం వచ్చిన తరువాత, కంపెనీ మళ్లీ క్యాపిటల్ మార్కెట్ వ్యూహంపై పునరాలోచన చేస్తుందని ఆ ప్రకటనలో తెలిపింది.

ఇంతకీ ఎఫ్‌పీఓ అంటే ఏమిటి? కంపెనీలు దానిని ఎందుకు తీసుకువస్తాయి?

FPO అంటే 'ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్'. అప్పటికే స్టాక్ మార్కెట్‌లో ఉన్న లిస్టెడ్ కంపెనీ పెట్టుబడిదారులకు లేదా వాటాదారులకు కొత్త షేర్లను ఆఫర్ చేస్తుంది.

అంటే, అంతకు ముందే ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) కింద షేర్లు విక్రయించిన కంపెనీ, మరిన్ని పెట్టుబడులు సేకరించడానికి లేదా రుణభారం తగ్గించుకోవడానికి మళ్లీ కొత్తగా షేర్లు విక్రయిస్తుంది. దీన్నే ఎఫ్‌పీఓ అంటారు. చాలావరకు వీటిని కంపెనీ ప్రమోటర్లు జారీ చేస్తారు.

కాబట్టి, ఐపీఓ ప్రక్రియ పూర్తయితేనే ఎఫ్‌పీఓ తీసుకురాగలరు.

అదానీ

అదానీ గ్రూపుకు ముందున్న కష్టాలేంటి?

అదానీ గ్రూపుకు దేశ, విదేశాల్లో పలు కంపెనీలు ఉన్నాయి. భారత్‌లో పలు ప్రధాన ఓడరేవుల నిర్వహణ అదానీ గ్రూపు చేతుల్లో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక ఇజ్రాయెల్‌లో కూడా చాలా పోర్టులు అదానీ గ్రూపు నిర్వహణలో ఉన్నాయి.

సిమెంట్, పవర్ ట్రాన్స్‌మిషన్, విమానాశ్రయాలు, ధాన్యం గిడ్డంగులలో అదానీ గ్రూపు ఆధిపత్యం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అదానీ గ్రూపు ముందున్న అతిపెద్ద సవాలు. విదేశీ పెట్టుబడిదారులు కూడా ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధం కాకపోవచ్చు.

మిగతా మార్కెట్లతో పోల్చి చూస్తే గతవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

అందుబాటులో ఉన్న ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, జనవరి 27, జనవరి 30 తేదీల్లో కేవలం రెండు ట్రేడింగ్ సెషన్‌లలోనే గ్లోబల్ ఫండ్స్ రూ.12,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.

"అదానీ గ్రూప్‌ గురించి అన్ని వైపుల నుంచీ ప్రతికూల వార్తలు వస్తున్నాయి. పెట్టుబడిదారుల ఆందోళనను తగ్గించడం అదానీ గ్రూప్‌ ముందున్న అతిపెద్ద సవాలు" అని ఏయూఎం క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ రాజేష్ అగర్వాల్ అన్నారు.

ఇన్‌ఫ్రావిజన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వినాయక్ ఛటర్జీ మాట్లాడుతూ, "ఇది కంపెనీ క్రెడిట్ యోగ్యతపై లేదా దాని భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని నేను అనుకోను. ఇన్‌ఫ్రా నిపుణుడిగా నేను చాలా కాలంగా ఈ గ్రూప్‌ను అనుసరిస్తున్నాను. ఆ గ్రూపుకు చెందిన ఎయిర్‌పోర్ట్‌లు, సిమెంట్, పునరుత్పాదక శక్తికి సంబంధించిన అనేక ప్రాజెక్ట్‌లు బలంగా, స్థిరంగా ఉన్నాయి. మంచి రాబడిని ఇస్తున్నాయి. స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల వల్ల అవి ప్రభావితం కావు" అని అన్నారు.

"అదానీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు అదానీ గ్రూపు ఏ రంగంలో ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు" అని వినాయక్ అంటున్నారు.

అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ గ్రూపుపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు సెబీ దర్యాప్తు ప్రారంభించవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

"సెబి లేదా ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పెట్టుబడిదారుల భయాందోళనలను తొలగించడానికైనా వారు మాట్లాడాలి" అని ఇండిపెండెంట్ రీసెర్చ్ అనలిస్ట్ హేమింద్ర హజారీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
Why Gautam Adani had to cancel the Rs 20,000 crore public offer?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X