• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది. అక్కడ కల్లోలిత పరిస్థితుల నడుమ వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చేశారు.

విద్యార్థులు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి కోసం ''ఆపరేషన్ గంగ’’ పేరుతో భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. బాంబు దాడుల మధ్య నుంచి వీరికి సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు యుక్రెయిన్‌కు సరిహద్దుల్లోని దేశాలకు వెళ్లారు. మొత్తంగా 90కిపైగా విమాన సేవల్లో 22,500 మందికి ఇక్కడికి తీసుకొచ్చారు.

ఇక్కడకు వచ్చిన చాలా మంది విద్యార్థులు యుక్రెయిన్‌లో మెడిసిన్ చదివేవారే. వీరిలో కొందరు మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఉన్నారు.

ఇక్కడకు విద్యార్థులు వచ్చి ఆరు నెలలు గడుస్తున్నాయి. ఇప్పుడు వారి చదువు ఏమవుతుందనే ప్రశ్న వారిని వెంటాడుతోంది? తమ చదువును పూర్తిచేసేందుకు అందుబాటులోనున్న అన్ని మార్గాల్లోనూ వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారు సుప్రీం కోర్టు తలుపుతట్టారు.

అసలు విద్యార్థుల డిమాండ్లు ఏమిటి? వారు సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారు? ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

యుక్రెయిన్‌ నుంచి వచ్చిన భారత విద్యార్థులు

''మేం బాధితులం’’

రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల దాదాపు 20,000 మంది భారతీయ వైద్య విద్యార్థులపై ప్రభావం పడింది. వీరిలో కేరళకు చెందిన అపర్ణ వేణుగోపాల్ ఒకరు. 2017లో అపర్ణ నీట్‌లో ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇక్కడ ఆశించిన సీటు లభించకపోవడంతో ఆమె యుక్రెయిన్‌లోని ఒడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ మూడేళ్లపాటు చదువుకున్నారు. యుద్ధ వాతావరణం వల్ల భారత్‌కు ఆమె తిరిగివచ్చేశారు. తన చదువు విషయంలో ఆమె చాలా ఆందోళనతో ఉన్నారు.

''యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఆరేళ్లు చదవాలి. మొదటి మూడేళ్లు నాన్-క్లినికల్ ఉంటుంది. అంటే ఎలాంటి ప్రాక్టికల్స్ ఉండవు. ఇది ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. కానీ, ఆ తర్వాత మూడేళ్లు ప్రాక్టికల్స్ ఉంటాయి. దీంతో ఆన్‌లైన్‌లో చదవడం కష్టం. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు’’అని అపర్ణ చెప్పారు.

భారత్‌లోని ప్రైవేటు కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారామని అపర్ణ అన్నారు. ''యుక్రెయిన్‌లో అయితే, దాదాపు రూ.25 లక్షల్లో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసుకోవచ్చు’’అని ఆమె వివరించారు. ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి, ఏదో ఒక వైద్య కళాశాలలో మమ్మల్ని చేర్పించుకోవాలని ఆమె అడుగుతున్నారు.

యుక్రెయిన్‌ నుంచి వచ్చిన భారత విద్యార్థులు

''తరగతులకు బదులు యుద్ధం మొదలైంది’’

బిహార్‌కు చెందిన సౌరభ్ కుమార్ సిద్ధార్థ్ కథ కూడా ఇలాంటిదే. సౌరభ్ తండ్రి ఒక రైతు. వీరికి ఊళ్లో మూడు ఎకరాల పొలం ఉంది. దీనిలో వరి పండిస్తున్నారు. కొడుకు డాక్టరును చేసేందుకు బంధువుల దగ్గర సౌరభ్ తండ్రి అప్పులు కూడా చేశారు. మొత్తంగా గత ఫిబ్రవరిలోనే కొడుకును ఎంబీబీఎస్ చదివించేందుకు ఆయన యుక్రెయిన్ పంపించారు.

''ఖార్కియెవ్ నేషనల్ యూనివర్సిటీలో ఒక ఏడాది చదువు కోసం మా నాన్న రూ.7.17 లక్షలు (తొమ్మిది వేల డాలర్లు) కట్టారు. ఫిబ్రవరి 14న నేను అక్కడకు వెళ్లాను. 24వ తేదీ నుంచి తరగతులు మొదలుకావాలి. కానీ, అవి వాయిదా పడ్డాయి. కల్లోలిత పరిస్థితుల నడుమ మార్చి 8న నేను భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది’’అని సౌరభ్ వివరించారు.

డబ్బులు కట్టినప్పటికీ, భవిష్యత్ ఏమిటో తనకు అర్థం కావడంలేదని సౌరభ్ అన్నారు. సాయం కోరుతూ స్థానిక ఎంపీ, జిల్లా మేజిస్ట్రేట్ దగ్గరకు కూడా సౌరభ్ వెళ్లారు. కానీ, ఆయనకు ఎలాంటి భరోసా లభించలేదు.

మొత్తానికి ఎలాగోలా మొదటి సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లో సౌరభ్ పూర్తి చేశారు. సెప్టెంబరు నుంచి రెండో సెమిస్టర్ మొదలు కావాల్సి ఉంది. ఇది ఫిబ్రవరి 2023వరకు ఉంటుంది.

''మా అమ్మ 2015లో చనిపోయింది. మా నాన్న ఒక్కరే ఉంటారు. నా గురించి ఆయన చాలా భయపడుతున్నారు. ఆయన దాచుకున్న డబ్బు మొత్తం నా కోసమే ఖర్చు చేశారు. కానీ, ఇప్పుడు ఇలా జరిగింది’’అని సౌరభ్ చెప్పారు.

అపర్ణ, సౌరభ్‌లా బాధపడుతున్న విద్యార్థులు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం వీరి వైద్య విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయింది.


సుప్రీం కోర్టుకు


విద్యార్థుల తరఫున సుప్రీం కోర్టులో 12 రిట్ పిటిషన్లు, మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారణ చేపడుతోంది.

ఈ పిటిషన్లలో ''పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ యుక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’’ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. విద్యార్థులను వారికి దగ్గరల్లోని వైద్య కాలేజీల్లో ప్రభుత్వం చేర్పించుకోవాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.

ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌బీ గుప్తా మాట్లాడుతూ.. ''మేం మార్చిలోనే ఈ అసోసియేషన్‌ను మొదలుపెట్టాం. ప్రభుత్వానికి మా అభ్యర్థనను వినిపించాలని అనుకున్నాం. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కొందరు ఎంపీలు కూడా ప్రస్తావించారు. కానీ, ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు’’అని అన్నారు.

''గత ఏప్రిల్‌లో మేం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయలను కలిసి అభ్యర్థించాం. మే నెలలో మేం సంతకాల సేకరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. జూన్‌లో దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష కూడా చేపట్టాం. జులైలోనూ నాలుగు రోజులపాటు రామ్‌లీలా మైదాన్‌లో నిరాహార దీక్ష చేపట్టాం. దీనిలో దాదాపు 500 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కానీ, మాకు న్యాయం జరగడం లేదు’’అని గుప్తా అన్నారు.

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు.

''దేశంలో దాదాపు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. యుక్రెయిన్ నుంచి దాదాపు 20,000 మంది మాత్రమే వచ్చారు. వీరంతా నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే అక్కడకు వెళ్లారు. వీరిలో ఒక్కో కాలేజీలో ఐదుగురిని చేర్చుకున్నా సమస్య పరిష్కారం అయిపోతుంది’’అని గుప్తా చెప్పారు.భారత్‌లో కష్టం


విద్యార్థులను భారత్‌లోని మెడికల్ కాలేజీలో చేర్చుకోవడం కష్టమని, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టంలో దీని కోసం ఎలాంటి నిబంధనలూ లేవని సుప్రీం కోర్టుకు తాజాగా భారత ప్రభుత్వం వెల్లడించింది.

''మేం ఏదైనా మినహాయింపులు ఇస్తే, ఇక్కడ వైద్య విద్యా ప్రమాణాలపై అది ప్రభావం చూపే అవకాశముంది’’అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

''ముఖ్యంగా విద్యార్థులు రెండు కారణాలతో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లారు. అయితే, వీరికి నీట్‌లో తక్కువ మార్కులు వచ్చుండాలి. లేదా ఇక్కడి రుసుములు ఎక్కువని వీరు భావించాలి. తక్కువ స్కోరు వచ్చిన పిల్లలను ఇక్కడి వైద్య కళాశాలల్లో చేర్చుకుంటే ఆ తర్వాత చాలా కోర్టు కేసులు వస్తాయి’’అని కేంద్రం వివరించింది. అనంతరం కేసును శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.


ఏమిటీ మొబిలిటీ ప్రోగ్రామ్?

సెప్టెంబరు 6న యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ మొబిలిటీ ప్రోగ్రామ్‌కు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఒక దేశంలో ఎంబీబీఎస్ విద్యార్థులు వేరే దేశంలో తమ చదువును పూర్తిచేసుకున్నా భారత్ ఆమోదిస్తుంది.

అయితే, ఇది తాత్కాలిక ప్రోగ్రామ్. కేవలం యుక్రెయిన్‌లో ఎంబీబీసీ చేరిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.

దీని కోసం విద్యార్థులు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థులకు దీనితో ఎక్కువ ఉపయోగం ఉంటుంది.

అయితే, ఈ కార్యక్రమంపై ఒకవైపు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. హరియాణాకు చెందిన కుల్‌దీప్.. యుక్రెయిన్‌లో నీప్రో స్టేట్ మెటికల్ యూనివర్సిటీలో తన మూడేళ్ల చదువును పూర్తిచేశారు.

''యుక్రెయిన్‌లో కూడా చాలా యూనివర్సిటీలు మొబిలిటీ ప్రోగ్రామ్ గురించి చెబుతున్నాయి. కానీ, అంతా జార్జియా నేషనల్ యూనివర్సిటీతోనే ఒప్పందాలు చేరుకుంటున్నాయి. ఒకే యూనివర్సిటీకి ఎంత మందిని పంపిస్తారు? అసలు ఇది అసాధ్యం’’అని ఆయన అన్నారు.

''అసలు జార్జియాలో భారత దౌత్య కార్యాలయమే లేదు. అక్కడకు వెళ్లడం కూడా అంత సురక్షితం కాదు. మరికొంత మంది మాత్రం యుక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాల్లోని యూనివర్సిటీలకు వెళ్లాలని సూచిస్తున్నారు’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

కొత్త యూనివర్సిటీకి వెళ్లడంలో ఇబ్బంది ఏమిటి?

యుక్రెయిన్ నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు జార్జియాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, జార్జియా, రొమానియాల్లో చేరాలంటే మళ్లీ అదనంగా రుసుము కట్టాల్సి వస్తోంది. పైగా ఇది తాత్కాలికమే. మళ్లీ ఆ విద్యార్థులను యుక్రెయిన్‌కే పంపిస్తారు.

''యుక్రెయిన్‌లో అయితే, ఒక ఏడాదికి దాదాపు రూ.5 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, వేరే కొత్త దేశానికి వెళ్తే ఇది రూ.9 లక్షలకుపైనే పెరుగుతుంది. అంత డబ్బులు చాలా మంది విద్యార్థుల దగ్గర ఉండకపోవచ్చు’’అని ఆర్‌బీ గుప్తా అన్నారు.

మరోవైపు 18 నంబరు 2021 తర్వాత అడ్మిషన్ తీసుకున్న వైద్య విద్యార్థులకు ఈ మొబిలిటీ కార్యక్రమం వర్తించడంలేదని సౌరభ్ అన్నారు. దీంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.


గతంలో ఏం జరిగింది?


ఈ విషయంపై పార్లమెంటు వేదికగా ఒడిశాకు చెందిన బీజేడీ ఎంపీ భతృహరి మహ్తాబ్ గత జులైలో మాట్లాడారు.

''1930లో ఇలానే రంగూన్ వైద్య కళాశాలల నుంచి పెద్దయెత్తున విద్యార్థులు మన దేశానికి వచ్చేశారు. అప్పట్లో ఇక్కడ మెడికల్ సీట్లు చాలా తక్కువ ఉండేవి. అయినా సర్దుబాటు చేశారు. అలానే 1947లోనూ ఢాకా, కరాచీ, లాహోర్‌ల నుంచి వచ్చిన పిల్లలను ఇక్కడ వైద్య కళాశాలలో చేర్చుకున్నారు. అలానే యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాలి’’అని ఆయన అన్నారు.

మరోవైపు పోలండ్‌లో చదువుకు పూర్తిచేసేందుకు తను చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ అప్పట్లో చెప్పారు. యుక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని పోలండ్‌కు వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ''మీ చదువు మధ్యలో ఆగిపోయిందని భయపడొద్దు. పోలండ్‌లో మీరు చదువుకునేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం’’అని చెప్పారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విద్యార్థులను చేర్పించుకునేందుకు విదేశాల్లోని వర్సిటీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. అయినప్పటికీ ఈ విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థంకాగానే మిగులుతోంది.


ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is India not admitting Ukrainian medical students in its colleges?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X