ప్రధానీ..నోరు మెదపరేమి?: రాహుల్: బాలాకోట్ దాడులపై భారీగా ఉపన్యాసం: ఇప్పుడెందుకు మౌనం?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని భారత్ చైనా వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడులు రాజకీయ సెగను పుట్టిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ దాడుల్లో ఏకంగా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన పట్ల ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఎలాంటి స్పందనా వెలువడ లేదని, ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Why is the PM silent?
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020
Why is he hiding?
Enough is enough. We need to know what has happened.
How dare China kill our soldiers?
How dare they take our land?

ప్రధాని మౌనం ఎందుకు?
భారత జవాన్ల వీర మరణం పట్ల ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 20 మంది సైనికులు అమరులు అయినప్పటికీ.. ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఎందుకు దాక్కున్నారు? అని పరోక్షంగా నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. అసలు సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారని అన్నారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని మౌనం పట్ల
ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయిందని, వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భారత జవాన్లను చంపడానికి, భారత్‌కు చెందిన భూభాగాన్ని ఆక్రమించడానికి చైనాకు ఎంత ధైర్యం అని రాహుల్ గాంధీ నిలదీశారు. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రాణాంతక దాడుల పట్ల నెటిజన్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శలను చవి చూడాల్సి వస్తోంది. కిందటి నెల 5వ తేదీ నుంచి వరుసగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అధికారులు భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తున్నప్పటికీ.. కేంద్రం ఎందుకు స్పందించట్లేదని అన్నారు.

బాలాకోట్‌పై అలా..
దౌత్యపరంగా ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న చర్చల గురించి కూడా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్‌పై గత ఏడాది నిర్వహించిన వైమానిక దాడుల సమయంలో నరేంద్ర మోడీ గానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు గానీ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు దంచారని గుర్తు చేశారు.
Recommended Video

పారదర్శకత ఏదీ..
అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు చోటు చేసుకోవడం వల్ల ప్రధానమంత్రి.. తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల సభలోనూ బాలాకోట్ వైమానిక దాడుల అంశాన్ని ప్రస్తావించారని చెబుతున్నారు. అదే సమయంలో చైనాతో సరిహద్దుల్లో చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణల గురించి ఇప్పుడెందుకు మౌనం దాల్చుతున్నారని నెటిజన్లు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నారు. దౌత్యపరమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రత్యేకించి చైనాతో నెలకొన్న యుద్ధ వాతావరణ సమయంలో కేంద్రం మౌనం దాల్చడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications