Nobel Peace Prize: నామినేట్ అయినా గాంధీజీకి నోబెల్ ఎందుకు దక్కలేదు? కమిటీ పశ్చాత్తాపం!
Nobel Peace Prize: నోబెల్ పురస్కారాల గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఇండియాలో ప్రతీ ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న తలెత్తుతుంది. అదే.. మహాత్మాగాంధీకి ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు? అహింసా మార్గంలో భారత్‌కు స్వాతంత్య్రం సాధించి ప్రపంచానికే శాంతిదూతగా నిలిచిన గాంధీజీని 5 సార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసినా.. ఆయనకు మాత్రం ఈ గౌరవం దక్కలేదు. మహాత్మా గాంధీని ప్రపంచం మొత్తం అహింసకు పూజారిగా, శాంతి ప్రతీకగా ఆరాధిస్తుంది. "సాబర్మతి కే సంత్ తూనే కర్ దియా కమాల్, దే దీ హమే ఆజాదీ బినా ఖడగ్, బినా ఢాల్..." అనే పాట ఇండియాలో ప్రతీ ఒక్కరి నోటా వినిపిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు అస్తమించడని చెప్పేవారు, కానీ గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించి వారిని భారత్ నుంచి పారదోలారు.
గాంధీజీ 5 సార్లు నామినేట్
మహాత్మగాంధీ మొదటిసారిగా దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అహింస ద్వారా ప్రజలను ఏకం చేసినందుకు గానూ నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. 1937, 1938, 1939లలో నామినేట్ అయ్యారు. ఆ తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమైన 1947లో మరోసారి నామినేట్ అయ్యారు. చివరికి 1948 జనవరిలో ఆయన హత్యకు గురికావడానికి కొద్ది రోజుల ముందు కూడా ఆయన పేరు నామినేషన్ల జాబితాలో ఉంది. 5 సార్లు నామినేట్ అయినప్పటికీ, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు.

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నోబెల్ కమిటీ
నోబెల్ శాంతి బహుమతిని గాంధీజీకి ఇవ్వకపోవడం తమ పెద్ద తప్పిదమని నోబెల్ కమిటీలోని తరువాతి సభ్యులు బహిరంగంగా అంగీకరించి, పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం అందించినప్పుడు కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇది "కొంతవరకు మహాత్మా గాంధీ స్మృతికి నివాళులర్పించడం" లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గాంధీజీని విస్మరించినందుకు కమిటీ ఎంతగా చింతిస్తుందో తెలియజేస్తుంది.
నోబెల్ కమిటీ చూపిన అభ్యంతరాలు, సాకులు
గాంధీజీకి నోబెల్ బహుమతి ఇవ్వకపోవడానికి నాటి కమిటీ సభ్యులు కొన్ని వింత వాదనలు, అభ్యంతరాలను లేవనెత్తారు. నోబెల్ ప్యానెల్‌లోని కొందరు విమర్శకులు, గాంధీజీ ఎప్పుడూ పూర్తి శాంతివాది కాదని అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన కొన్ని అహింసా ఉద్యమాలు హింసకు, అల్లర్లకు దారితీశాయని వారు వాదించారు. గాంధీజీ ఆదర్శాలు, ఆలోచనలు ప్రధానంగా భారతదేశానికి మాత్రమే పరిమితమయ్యాయని, అవి విశ్వజనీనం కాదని ప్యానెల్ సభ్యులు సాకుగా చూపారు.
శాంతి బహుమతి పొందిన ప్రముఖులు వీరే..
1901 నుంచి శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తున్నారు. ఈ పురస్కారం పొందిన ప్రముఖుల్లో కొందరి గురించి తెలుసుకుందాం. కొందరు ప్రముఖులలో మదర్ థెరిసా (1979), దలైలామా (1989), నెల్సన్ మండేలా (1993), మలాలా యూసుఫ్‌జాయ్ (2014), కైలాస్ సత్యార్థి (2014), మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (1964) వంటి వారు ఉన్నారు. భారతదేశానికి చెందిన 8 మంది వివిధ రంగాలలో నోబెల్ పురస్కారాలు అందుకున్నారు. భారత అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన గాంధీజీని నోబెల్ బహుమతికి అర్హుడిగా కమిటీ గుర్తించకపోవడం, చరిత్రలో నోబెల్ కమిటీ చేసిన అతిపెద్ద పొరపాట్లలో ఒకటిగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications