దేశంలో రోజూ వెయ్యికి పైగా మరణాలు: ఇక సర్వసాధారణం? ఆశ్చర్య పడనక్కర్లేదట
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తోన్న కరోనా వైరస్.. దేశాన్ని కకావికలం చేసి పారేస్తోంది. ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపిన ఈ మహమ్మారి.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంది.. రోజూ వందలమందికి కాటేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 38 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజువారీ కరోనా లెక్కలు బిత్తరపోయేలా చేస్తున్నాయి. వేల సంఖ్యలో కొత్తగా పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్.. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతోన్న రాష్ట్రాల జాబితాలో టాప్-5లో కొనసాగుతున్నాయి.

మున్ముందు మరింత బీభత్సం..
కరోనా వైరస్ మున్ముందు మరింత బీభత్సాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతోన్న రోజువారీ మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనీ చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య సర్వ సాధారణంగా మారడానికి అవకాశం లేకపోలేదని అంటున్నారు. పంజాబ్‌లో కొత్తగా 100కు పైగా కరోనా మరణాలు నమోదు అయ్యాయి. పంజాబ్‌లో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు- 50 నుంచి 60 మధ్య కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఒకేసారి వందకు దాటుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రజల్లో భయాందోళనలు..
కరోనా మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షలను చేయించుకోవడానికి ముందుకొచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని చెబుతోంది. ఆరోగ్యం క్షీణించే వరకూ డాక్టర్‌ను సంప్రదించకపోవడం, కరోనా పరీక్షలకు అంగీకరించకపోవడం వంటి కారణాల వల్ల మరణాలు పెరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో- కరోనా వైరస్ ప్రాణాలను తీస్తుందనే భయాందోళనలు నెలకొనడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి ఓ కారణమౌతోందని స్పష్టం చేసింది.

పరిస్థితి చేయి దాటిన తరువాతే..
తమ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చేయి దాటిన తరువాతే డాక్టర్‌ను సంప్రదించే వారి సంఖ్య 67 శాతం వరకు నమోదవుతోందని పంజాబ్ వైద్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు తెలిపారు. ఫలితంగా తమ రాష్ట్రంలో కొత్తగా వందకు పైగా మరణాలు రికార్డు అయ్యాయని, ఈ పరిస్థితి మున్ముందు కొనసాబోదని చెప్పలేమని అన్నారు. కరోనా వైరస్‌తో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె, కిడ్నీ సంబంధ ఇబ్బందులు తలెత్తడం వల్ల కూడా మరణాల సంఖ్య పెరుగుదలకు ఓ కారణమౌతున్నాయని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలో రోజూ 400 వరకు
మహారాష్ట్రలో రోజూ 300 నుంచి 400 వరకు కరోనా మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 25 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇదివరకు నమోదైన మరణాలతో పోల్చుకుంటే.. ఈ సంఖ్యలో 40 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడుల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మరణాల్లో తమిళనాడు రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో ఉన్నాయి. ఏపీ నాలుగో స్థానాన్ని ఆక్రమించుకుంది. ఏపీలో ఇదివరకెప్పుడూ కరోనా మరణాలు 30 నుంచి 40కి మించలేదు. ప్రస్తుతం ఈ సంఖ్య 80 నుంచి 90 మధ్యన నమోదవుతోంది.
Recommended Video

తెలంగాణ సహా ఆ మూడు రాష్ట్రాల్లో లో-డెత్ రేట్..
ఈ పరిస్థితులు ఇదే తరహాలో కొనసాగితే.. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా మరణాలు వెయ్యికి పైగా నమోదు కావడం సర్వ సాధారణమౌతుందని చెబుతున్నారు. తెలంగాణ, అస్సాం, బిహార్‌లల్లో అతి తక్కువ మరణాల రేటు నమోదవుతోంది. ఈ మూడు చోట్ల కూడా లక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ.. ఆశ్చర్యకరంగా కరోనా మరణాలు అతి తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 850కి పైగా, అస్సాంలో 300కు పైగా కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications