అమెరికా వలస విమానాలు అమృత్ సర్ కే ఎందుకు ?
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని గుర్తించి స్వదేశాలకు పంపేస్తోంది. ఇలా మిలటరీ విమానాల్లో వివిధ దేశాలకు పంపుతున్న వలసల విషయంలో వ్యవహరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో భారత్ కు ఈ వలసల్ని తెస్తున్న విమానాలు పంజాబ్ లోని అమృత్ సర్ లోనే దిగడం వివాదాస్పదమవుతోంది.
గత వారం అమెరికా నుంచి 104 మంది భారతీయ వలసదారులతో వచ్చిన విమానం అమృత్ సర్ లో ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని కూడా చివరి నిమిషంలోనే వెల్లడించారు. అయితే రేపు మరో విమానం వలసలతో అమృత్ సర్ కే వస్తున్నట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం కూడా ఇంకో విమానం ఇలాగే అమృత్ సర్ రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇలా అమృత్ సర్ కే వలసల విమానాలు ఎందుకు పంపుతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే వలసల్ని సంఖ్యా పరంగా చూస్తే ఎక్కువగా గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల వారు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ లోని అమృత్ సర్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇలా రోడ్డు మార్గాల్లో బస్సుల ద్వారా, కార్ల ద్వారా వారిని స్వస్థలాలకు పంపడం ఎందుకన్న చర్చ మొదలైంది. అమృత్ సర్ ను బదనాం చేసేందుకే కేంద్రం ఇలా చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే భారత్ కు వచ్చిన అమెరికా విమానానికి ల్యాండింగ్ పాయింట్ గా అమృత్ సర్ ఎయిర్ పోర్టును కేంద్రం ఫిక్స్ చేసింది. ఇప్పుడు తర్వాతి విమానాలు కూడా అమృత్ సర్ కే వస్తున్నాయన్న సమాచారంతో విమర్శలు మొదలయ్యాయి. పంజాబ్ ఆర్ధిక మంత్రి హర్పాల్ సింగ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహాలున్నాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న,వలసలు ఎక్కువగా ఉన్న గుజరాత్, హర్యానాను వదిలిపెట్టి పంజాబ్ లో విమానాల్ని దింపడం ద్వారా తమ రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications