
ఫేస్‌బుక్, ట్విటర్‌ల కథ ముగిసిపోతుందా?

గత వారం రోజులుగా దిగ్గజ టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతల వార్తలు వరసగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
గత 12 నెలల్లో దిగ్గజ టెక్ సంస్థలైన యాపిల్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ), అల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ)లకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు (రూ.244 లక్షల కోట్లు) వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరి అయింది.
నవంబరులో అమెజాన్‌తోపాటు చాలా టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటించాయి. ఈ నెల 21నాటికి మొత్తంగా 1,36,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్ తెలిపింది.
భారీగా ఉద్యోగాలను తీసేసిన సంస్థల జాబితాలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మొదటి వరుసలో ఉంది. సంస్థ 11,000 మందిని ఇంటికి పంపించేసింది. మరోవైపు ట్విటర్ కూడా తమ ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
దీంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లైన ఫేస్‌బుక్, ట్విటర్‌ల భవిష్యత్ ఏమిటి? సంక్షోభాలను తట్టుకొని ఈ సంస్థలు నిలబడగలవా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
- ట్విటర్: బ్లూ టిక్ అకౌంట్‌కు ఇకపై ఏడాదికి రూ. 8,000, ఎలాన్ మస్క్ ఇంకా ఏ మార్పులు చేయబోతున్నారు?

ఫేస్‌బుక్, ట్విటర్‌ల పరిస్థితి ఏమిటి?
పైన చెప్పినట్లుగా ఈ రెండు సోషల్ మీడియా వేదికలు ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
అంటే వ్యాపార లావాదేవీల్లోకి వచ్చే డబ్బు తగ్గిపోతోంది. ముఖ్యంగా ప్రకటనలపై సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది.
''టెక్నాలజీ ద్వారా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించే వారికి నిజంగా ఇది గడ్డుకాలం’’అని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన టెక్ నిపుణుడు, ప్రొఫెసర్ జోనథన్ నీ చెప్పారు.
''సోషల్ మీడియా వేదికలు సాధారణంగా ప్రకటనలపైనే ఎక్కువ ఆధారపడుతుంటాయి. అయితే, ఆర్థిక మందగమనంతో ఈ ప్రకటనలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా వీటి మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది’’అని జోనథన్ వివరించారు.
తాజాగా అక్టోబరు చివర్లో మెటా ఆర్థిక నివేదిక విడుదల చేసింది. దీనిలో సంస్థ రెవెన్యూ భారీగా తగ్గిపోయినట్లు ప్రకటించింది. దీంతో సంస్థ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. మరోవైపు టిక్‌టాక్ లాంటి సంస్థల నుంచి మెటాకు గట్టి పోటీ ఎదురవుతోంది.
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- ఇక ట్విటర్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరిస్తుందా

బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోకి వచ్చిన ట్విటర్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. రెవెన్యూ పడిపోవడంతోపాటు మస్క్ నాయకత్వ శైలి, ఆయన తీసుకునే నిర్ణయాలు సంస్థకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
తాజాగా ఒక పోల్ నిర్వహించిన తర్వాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించారు. ''క్యాపిటల్ అల్లర్ల’’ నడుమ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ ఏడాది జనవరి 8న ఆయన ఖాతాను ట్విటర్ స్తంభింపజేసింది.
మరోవైపు మస్క్ చేతికి ట్విటర్ రాకముందే, సంస్థ వృద్ధి ప్రతికూల బాటలో నడిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. ట్విటర్‌ను వారంలో ఆరు నుంచి ఏడు సార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా కోవిడ్-19 తర్వాత గణనీయంగా పడిపోయినట్లు రాయిటర్స్ పేర్కొంది.
''తరచూ ట్విటర్‌ను ఉపయోగించే వారి సంఖ్య మొత్తం వినియోగదారుల్లో పది శాతం వరకే ఉంది. కానీ, సంస్థ రెవెన్యూలో 90 శాతం ఈ ఖాతాల ట్వీట్ల నుంచే వస్తోంది’’అని రాయిటర్స్ వెల్లడించింది.
మరోవైపు మస్క్ రాకతో సంస్థ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఆయన ఆధీనంలోకి కంపెనీ వచ్చిన వారం రోజుల తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ఒక్క వారంలోనే మొత్తంగా ట్విటర్ దాదాపు పది లక్షల మంది యూజర్లను కోల్పోయిందని దీనిలో పేర్కొన్నారు.
- ఎథికల్ హ్యాకింగ్: భారత హ్యాకర్లు చట్టబద్ధంగా లక్షల డాలర్లు ఎలా సంపాదిస్తున్నారు..
- హ్యాకింగ్: మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...

ఎందుకు ఇలా?
అయితే, సోషల్ మీడియా కంపెనీల ''నేచురల్ లైఫ్ సైకిల్’’ చివరి అంకంలో ఈ పతనం భాగమని కొందరు నిపుణులు చెబుతున్నారు.
''ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఒక సైకిల్ ఉంటుంది. దీనిలో వృద్ధి, పతాక స్థాయి, పతనం లాంటివి ఉంటాయి. కొత్త ప్లాట్‌ఫామ్‌లు వచ్చేటప్పుడు సాధారణంగా పతన దశ మొదలవుతుంది’’అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని కమ్యూనికేషన్స్ అండ్ న్యూ మీడియా ఎక్స్‌పర్ట్ డాక్టర్ నటాలియే పాంగ్ చెప్పారు.
''ఇటు ఫేస్‌బుక్, అటు ట్విటర్ రెండు సంస్థలూ మార్కెట్‌లో విపరీతంగా వృద్ధి చెందాయి. కోవిడ్-19 లాంటి పతన సమయంలోనూ కోట్లాది మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వీటిని ఉపయోగించారు’’అని ఆమె వివరించారు.
''లాక్‌డౌన్‌ల సమయంలో డిజిటలైజేషన్ వల్ల ఈ టెక్ వేదికలు మరింత వేగంగా విస్తరించాయి. ఇప్పుడు ఆ వృద్ధిని అందుకోలేక, నష్టాలను తట్టుకోలేక సతమతం అవుతున్నాయి’’అని ఆమె వివరించారు.
మరోవైపు ఫేస్‌బుక్, ట్విటర్‌లు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌లో షెఫ్ఫీల్డ్ యూనివర్సిటీలోని డిజిటల్ మీడియా ఎక్స్‌పర్ట్ డాక్టర్ లియాన్‌రుయి జియా చెప్పారు.
''ఈ వేదికలు మార్కెట్‌లో సాధారణంగా కంటే ఎక్కువ సమయమే ఆధిపత్యం ప్రదర్శించాయి. కానీ, నేడు వీటిలో సమస్యలను యూజర్లు గుర్తిస్తున్నారు. దీంతో వాటి నుంచి వేరే వేదికలవైపు వెళ్తున్నారు’’అని జియా వివరించారు.
ఫేస్‌బుక్‌కు దాదాపు 300 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని 2022 మూడో త్రైమాసికంలో మెటా వెల్లడించింది. దీంతో ప్రపంచంలో అతిఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా ఇది రికార్డు సృష్టించింది.
అయితే, గత ఫిబ్రవరిలో 18 ఏళ్లలో మునుపెన్నడూ చూడలేని రీతిలో వినియోగదారులను కోల్పోయినట్లు మెటా ప్రకటించింది. ఆ తర్వాత సంస్థ షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి.
- 'మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?

2019 నుంచి ట్విటర్ తమ వినియోగదారుల చర్యలను పర్యవేక్షించేందుకు కొత్త మెట్రిక్‌లను అనుసరిస్తోంది. మొత్తం యూజర్లకు బదులుగా యాడ్‌లను చూసే యాజర్లను మాత్రమే సంస్థ పరిగణలోకి తీసుకుంటోంది. గత అక్టోబరులో మొత్తంగా తమకు యాడ్‌లు చూసే యూజర్లు 23.8 కోట్ల మంది ఉన్నారని సంస్థ తెలిపింది.
అయితే, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే విధానంలో మార్పులు, తాజా వార్తా విశేషాల కోసం వేరే మీడియాను ఉపయోగించడం, శృంగార సాహిత్యం పెరగడం లాంటి సమస్యలు సంస్థను ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా అడ్వర్టైజర్లు సంస్థను దూరం పెడుతున్నారు. మొత్తంగా ఇది సంస్థ రెవెన్యూపై ప్రభావం చూపుతోంది.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియంత్రణా విధానాలను కఠినతరం చేయడం వల్ల కూడా ఈ టెక్ సంస్థల కష్టాలు ఎక్కువైనట్లు బ్రిటన్‌లోని లాంకెస్టర్ యూనివర్సిటీలోని ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్ రెనాడ్ ఫోకార్డ్ చెప్పారు.
''ఇటీవల కాలంలో ఇటు అమెరికా, అటు యూరోపియన్ యూనియన్.. సోషల్ మీడియా వేదికల మధ్య ఆరోగ్యపరమైన పోటీ ఉండేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. ఫలితంగా మార్కెట్‌లో పోటీ ఎక్కువైంది. మరోవైపు గతంలో ప్రత్యర్థులైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను ఫేస్‌బుక్ కొనేసి మార్కెట్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రస్తుతం చేయకుండా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు’’అని ఆయన చెప్పారు.
నేడు అదే ఆదాయం, అదే వినియోగదారుల కోసం ఎక్కువ కంపెనీలు పోటీ పడుతున్నాయని ఆయన వివరించారు.
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- 'నా న్యూడ్ ఫొటోలను టెలిగ్రామ్ తొలగించట్లేదు’

మరచిపోవడమేనా?
కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికలు క్రమంగా మరుగునపడిపోతుంటాయి. ఒక్కోసారి వాటి ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది.
ఉదాహరణకు మైస్పేస్.కామ్‌ను తీసుకోండి. 2007లో దీనికి దాదాపు 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.
అయితే, ఫేస్‌బుక్ రాకతో ఇది మరుగునపడింది. ఇప్పుడు ఇది ఆన్‌లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా మాత్రమే పనిచేస్తోంది. నేడు కేవలం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు.
ఇదే దశాబ్దంలో గూగుల్ మద్దతున్న ఆర్కుట్ కూడా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఒక వెలుగు వెలిగింది. అయితే, 2014లో ఫేస్‌బుక్ విజృంభణతో ఇది కూడా చరిత్రలో కలిసిపోయింది.
నేటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా ఇంతేనా? అయితే, కొందరు నిపుణులు కాస్త భిన్నమైన అభిప్రాయాలను కూడా వ్యక్తంచేస్తున్నారు.
- సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. తప్పించుకోవడం ఎలా
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్.. పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్
''మార్కెట్ చాలా సంక్లిష్టంగా మారింది’’
సైబర్ రిపోర్టర్ జో టైడీ విశ్లేషణ
కొన్ని సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు తమ జీవిత చరమాంకంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. బెబో, మైస్పేస్, వైన్ ఇలా మరుగున పడ్డాయి కూడా.
అయితే, నేడు టెక్ ప్రపంచం అనేది చాలా సంక్లిష్టమైన దశలోకి అడుగుపెట్టింది. ఫేస్‌బుక్‌నే తీసుకోండి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను సంస్థ కొనుగోలు చేసింది.
ఫేస్‌బుక్ వృద్ధి అనేది ఇప్పటికే పతాక స్థాయికి చేరుకొని పతనం దిశగా వెళ్తూ ఉండొచ్చు. కానీ, సంస్థకు చెందిన మిగతా వేదికల్లో ఆ పతన సూచికలేవీ కనిపించడం లేదు.
మరోవైపు ట్విటర్ కూడా పతనావస్థలో ఉందని కొందరు చెబుతున్నారు. నిజంగా ప్రజలు ట్విటర్‌ను వదిలేస్తారా? నాకైతే సందేహమే.
గత ఐదేళ్లలో వినియోగదారులపై ఈ సోషల్ మీడియా వేదికలు పట్టు సంపాదించాయి. కొత్త ప్లాట్‌ఫామ్‌లు ఈ స్థాయికి చేరుకోడం అంత తేలిక కాదు.
అయితే, కొన్నిసార్లు టిక్‌టాక్ లాంటి సంస్థలు సవాళ్లు విసరవచ్చు. కానీ, క్లబ్ హౌస్, బీ రియల్ లాంటి చాలా వేదికలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయని మనం గమనించాలి.
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- 'పోర్న్సైట్లో నా వీడియో ఉందని స్నేహితులు చెప్పారు, ఆ వీడియో చూసినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాను’
పోటీ మంచిదే
ఇది ఫేస్‌బుక్, ట్విటర్‌లకు రోడ్డులో ఒక మలుపో, లేదా చివరి అంకమో ఇప్పుడే చెప్పలేం. అయితే, ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది మంచికే అనుకోవాలని కొందరు నిపుణులు అంటున్నారు.
''పోటీ పెరగడం వల్ల ఈ సోషల్ మీడియా దిగ్గజాలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిజానికి ఇది మంచిదే’’అని రెనాడ్ అన్నారు.
''మార్కెట్‌లో ఇలా కొత్త కంపెనీలు మెరుగైన సేవలతో మన ముందుకు రావడం సహజమే. వీటిని తట్టుకొని నిలబడాలంటే తమ సేవలను కంపెనీలు మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ఈ రూపంలో దిగ్గజ టెక్ సంస్థలకూ ఒక అవకాశం దొరుకుతుంది’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: స్టేడియంలో బీరు అమ్మకాల గురించి ఫీఫా ఎందుకు పోరాడుతోంది?
- ఫిఫా వరల్డ్ కప్: జాతీయ గీతాలాపనలో ఇరాన్ ఆటగాళ్ళ మౌనం, స్వదేశంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన
- జ్యూస్ ఇలా తాగారా ఎప్పుడైనా?
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)