మహిళపై అమృతసర్‌లో గ్యాంగ్ రేప్, హత్య: ఇద్దరు మైనర్ల బాలికలపైనా..
అమృతసర్/ ఫిరోజ్‌పూర్: పంజాబ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరిగాయి. వేర్వేరు సంఘటనల్లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరగగా, మరో రెండు చోట్ల ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. అమృసర్‌లో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఆమె శవం అమృతసర్ శివారులోని ఓ భవనంలో పడి ఉంది. సోమవారంనాడు పోలీసులు ఈ విషయం చెప్పారు.
నగరం శివారులో నిర్మాణంలో ఉన్న నిర్మానుష్యమైన భవనంలో మహిళపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని పోలీసులు చెప్పారని డిప్యూటీ పోలీసు కమిషనర్ హర్జీందర్ సింగ్ సిద్ధు చెప్పారు. దుపట్టాతో గొంతు నులిమి ఆమెను చంపేశారు. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది. సంఘటన జరిగిన భవనం ఫతేగడ్ చురియాన్ రోడ్డులోని నంగ్లీ గ్రామం పరిధిలోని బాబా దీప్ సింగ్ కాలనీలో ఉందని సిద్ధు చెప్పారు. తల్లిదండ్రులు ఆమెను గుర్తించినట్లు తెలిపారు.
మృతురాలు అమృతసర్‌లోని వేర్కా ప్రాంతానికి చెందింది. భర్తతో వివాదం రావడంతో కొన్నాళ్లుగా ఆమె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఆడుకోవడానికి భవనంలోకి వెళ్లిన పిల్లలు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. హత్య కేసులో కీలకమైన ఆధారాలు లభించాయని డిసిపి సిద్ధు చెప్పారు. చిత్తుగా తాగేసి దుండగులు నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో కండోమ్స్ కూడా లభించినట్లు తెలిపారు.

ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్
ఇదిలావుంటే, రెండు వేర్వేరు సంఘటనల్లో ఫజికా జిల్లా అబోహర్ సమీపంలో ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. 16ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితలను సాగర్, మంగు, బన్సీలుగా గుర్తించారు. అత్యాచార ఘటనను వారు వీడియోలో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టారు.
విషయాన్ని బయటకి చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బాధితురాలిని భయపెట్టారు. వెబ్‌లో వీడియో ప్రసారం కావడంతో అమ్మాయి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు మైనర్ల అత్యాచారం
మరో సంఘటనలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న అమ్మాయిపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను గురుప్రీత్ సింగ్ (18), షేర్ సింగ్ (16)గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు - ఇద్దరు బాలురు అమ్మాయిని మార్కెట్ నుంచి తమ బైకుపై ఎత్తుకెళ్లి, శనివారంనాడు పొలాల్లో అత్యాచారం చేశారు.












Click it and Unblock the Notifications