బీహార్‌లో దారుణం: మహిళను నగ్నంగా ఊరేగించి కొట్టిన గ్రామస్తులు
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు నగ్నంగా గ్రామంలో ఊరేగించిన ఘటన భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. 19 ఏళ్ల వ్యక్తిని చంపిందని ఆరోపణలపై ఆ మహిళను ఇలా ఊరేగించినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ఇలా ఉంది.
విమలేష్ సాహ అనే వ్యక్తి ఆదివారం నుంచి కనిపించడంలేదు. ఆయన మృతదేహాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై దొరికిందని భోజ్‌పూర్ ఎస్పీ అవకాష్ కుమార్ తెలిపారు. విమలేష్ మృతదేహం దొరికిందన్న వార్త ఆయన సొంత గ్రామం దామోదర్‌పూర్‌లో తెలియగానే గ్రామస్తులు రైల్వేట్రాక్ దగ్గరకు పరుగులు తీసుకుంటూ వచ్చారు. అయితే రైల్వే ట్రాక్ సమీపంలోని రెడ్ లైట్ ఏరియాకు చెందినవారే విమలేష్‌ను హత్య చేసి ఉంటారని ముందుగా అనుమానించారు.

విమలేష్ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే అక్కడి దుకాణాలకు, పరిసర ప్రాంతాలకు నిప్పు పెట్టారు. చాలా మందిని చితకబాదారు. ఇందులో భాగంగానే ఒక మహిళను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఆమెను వివస్త్రను చేశారు. నగ్నంగా నడిరోడ్డుపైనే ఊరేగించారు. ఆమెను కాలుతో తన్నారు. చెంపలకేసి కొట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఆ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పిన ఎస్పీ గ్రామస్తులు ఒకరైలు పైకి కూడా రాళ్లు రువ్వారని చెప్పారు. గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. అయితే గ్రామస్తులు కూడా కాల్పులు జరిపారని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారని చెప్పారు. త్వరలోనే కేసును నమోదు చేస్తామని ఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications