Women Bill : లోక్ సభలో నేడే మహిళా బిల్లు ? రిజర్వేషన్ల అమలు మాత్రం 2029లోనే !
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ కొత్త పార్లమెంటులో తొలి బిల్లుగా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ లోక్ సభలో మధ్యాహ్నం మహిళా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ చారిత్రక బిల్లుకు ఆమోద ముద్ర వేయడం ద్వారా కొత్త పార్లమెంట్ ను ఘనంగా ప్రారంభించాలనేది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది.
పాత పార్లమెంటు భవనం నుంచి ఇవాళ కొత్త పార్లమెంటు భవనంలోకి మారిన తర్వాత సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీతో పాటు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సమక్షంలో ఉభయసభల కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఇందులో కొత్త పార్లమెంట్ ఆశలు, ఆకాంక్షల్ని ఎంపీలకు వారు వివరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం మహిళా బిల్లును లోక్ సభ ముందుకు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళా బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు ఈ చట్టం అమలు చేయడం ఇబ్బందిగా మారబోతోంది. అందుకే దీన్ని 2029లో అమలు చేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇది అమలు అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు 2026లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం పెండింగ్ లో ఉంది. ఇది పూర్తయితే దేశంలో నియోజకవర్గాల స్వరూపమే మారిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాక ముందు మహిళా రిజర్వేషన్లను చట్ట ప్రకారం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవు. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు కారణాలతో 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications