PM Modi: మహిళా బిల్లు, డీలిమిటేషన్ పై తేల్చేసిన ప్రధాని-దక్షిణాదికి హామీ..!
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై ఇవాళ లోక్ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ (PM Modi).. ఇది దాదాపు 30 ఏళ్లు ఆలస్యమైన ఆలోచన అన్నారు. 25-30 ఏళ్ల క్రితం, ఈ ఆలోచన తొలిసారిగా వచ్చినప్పుడే మనం దానిని అమలు చేసి ఉండాల్సిందన్నారు. ఈ రోజు మనం దాన్ని మరింత మెరుగుపర్చే వాళ్లమని గుర్తుచేశారు. అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు దానిలో సవరణలు చేసి ఉండేవాళ్ళమన్నాు. అదే ప్రజాస్వామ్యపు అందం అన్నారు. ఒక దేశ చరిత్రలో కొన్ని 'కీలక ఘట్టాలు' ఉంటాయని, మహిళా కోటా బిల్లు అలాంటి ఒక ఘట్టమేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం ఏ ఒక్క రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చదని, దేశ ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని ప్రధాని తెలిపారు. రాజకీయ జీవితంలో ముందుకు సాగాలనుకునే ఎవరైనా, గత 25 ఏళ్లలో లక్షలాది మంది మహిళలు క్షేత్రస్థాయి నాయకులుగా ఎదిగారన్న నిజాన్ని అంగీకరించాలన్నారు. మహిళల్లో క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందిన నాయకత్వాన్ని గుర్తించి, పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందువల్ల ఈ రోజు దీనిని వ్యతిరేకించే వారు చాలా కాలం పాటు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. వికసిత్ భారత్ అంటే కేవలం మంచి మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. అభివృద్ధి చెందిన భారతదేశ విధాన రూపకల్పనలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' స్ఫూర్తి ప్రతిబింబించాలని తాము కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. దేశ జనాభాలో 50 శాతాన్ని నిర్ణయాధికార ప్రక్రియలో భాగం చేయాలని, ఇది ప్రస్తుత అవసరమని అన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బలహీనపడిన ప్రాతినిధ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, దక్షిణ రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. తమ ప్పరభుత్వం భారతదేశాన్ని ఒకటిగా చూస్తుందని, భాగాలుగా కాదని తెలిపారు. ఈ బిల్లు ఎవరికీ అన్యాయం చేయదన్నారు. ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా నినాదాలు చేస్తుండగా, ఏ రాష్ట్రం పట్ల వివక్ష ఉండదుని ప్రధాని వారికి స్పష్టం చేశారు.
తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు. దాదాపు 50 శాతం మేర విస్తరించిన లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ... గతంలో దీనిని వ్యతిరేకించిన వారిని దేశ మహిళలు క్షమించలేదన్నారు. దాని ఫలితంగా జరిగిన ఎన్నికలలో వారు ఘోరంగా ఓడిపోయారన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఈ ముఖ్యమైన అవకాశాన్ని మనమందరం వదులుకోవద్దని కోరారు. దీనిని రాజకీయ కోణంలో చూడవద్దు, ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు.














Click it and Unblock the Notifications