వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

World Blood Donor Day: బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రక్తం

World Blood Donor Day జూన్ 14న వస్తోంది. ఈ సందర్భంగా బీబీసీ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

దిల్లీకి చెందిన ఓ చిన్నారి గుండె సమస్యతో బాధపడుతోంది. పుట్టుకతోనే సమస్య ఉన్నప్పటికీ కొంత వయసు వచ్చిన తర్వాత సర్జరీ చేయవవచ్చన్న వైద్యుల సలహాతో ఏడేళ్లు వేచి చూశారు. చివరకు శస్త్ర చికిత్స చెయ్యాల్సిన రోజును నిర్ణయించారు వైద్యులు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కానీ, ఒక్క విషయంలో మాత్రం చివరి వరకు ఆందోళన తప్పలేదు. సాధారణంగా గుండె శస్త్ర చికిత్స చేసినప్పుడు రక్తం ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది కనుక, ముందుగానే అవసరమైన రక్తాన్ని సిద్ధం చేసుకోవాలని చెబుతుంటారు వైద్యులు. ఆ చిన్నారి విషయంలో కూడా అదే చెప్పారు.

సరిగ్గా అదే ఆ తల్లిదండ్రుల ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే, ఆ చిన్నారి రక్తం అత్యంత అరుదైన గ్రూపుల్లో ఒకటైన 'AB-నెగిటివ్' కావడమే. దేశ వ్యాప్తంగా ఏబీ గ్రూపు రక్తం ఉన్న వారి సంఖ్య కేవలం 8.18 శాతం మాత్రమే. అందులో AB పాజిటివ్ 7.7 శాతం కాగా, AB నెగిటివ్ 0.48 శాతం. సుమారు పది రోజుల పాటు ప్రయత్నించిన తర్వాత అదృష్టవశాత్తు దొరకడంతో ఆమె సమస్య పరిష్కారమైంది.

బ్లడ్ గ్రూప్

బ్లడ్ గ్రూప్స్ ఎన్ని... వాటిలో అరుదైనవి ఏవి?

సాధారణంగా మనిషి రక్తం A, B, AB, O గ్రూపులుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. అంటే ఎర్ర రక్త కణాలపై యాంటిజన్‌తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగిటివ్ అంటారు.

వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం మన దేశంలో A పాజిటివ్ బ్లడ్ 21.8%, A నెగిటివ్ బ్లడ్ 1.36%, B పాజిటివ్ బ్లడ్ 32.1%, B నెగిటివ్ బ్లడ్ 2% AB పాజిటివ్ బ్లడ్ 7.7%, AB నెగిటివ్ బ్లడ్ 0.48%, O పాజిటివ్ 32.53%, O నెగిటివ్ బ్లడ్ 2% మందిలో ఉంది.

ఈ గణాంకాలు చూస్తే ఇందులో అరుదైన బ్లడ్ గ్రూపులు ఏవన్నది చాలా సులభంగా అర్థమవుతోంది. దేశం మొత్తం మీద AB నెగిటివ్ బ్లడ్ 0.48% మందిలో మాత్రమే లభ్యమవుతుండగా, ఒ నెగిటివ్, బి నెగిటివ్ రక్తం కూడా అతి కొద్ది మందిలో మాత్రమే ఉంది.

AB పాజిటివ్, AB నెగిటివ్, O పాజిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూపు కాగా, రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూపు.

బ్లడ్ గ్రూప్

ఏమిటీ బాంబే బ్లడ్ గ్రూపు?

అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దీని వెనుక ఒక కారణం ఉంది. మొట్టమొదట 1952లో దీనిని భారత్‌లోని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం భెండె ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. అసలు ఈ గ్రూపు ఒకటి ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు.

చివరకు ఆ గ్రూపు రక్తం ఉన్న వారు తమది 'O' గ్రూపు రక్తం అనుకుంటూ ఉంటారు. కానీ రక్తదానం తర్వాత ఆ రక్తాన్ని'O' గ్రూపు వారికి ఎక్కిస్తున్నప్పుడు వారికి మ్యాచ్ కానప్పుడు, ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే వారి బ్లడ్ గ్రూపు ఏంటో తెలుస్తుంది. ఇది కేవలం ప్రతి 10 వేల మందిలో ఒక్కరిలో మాత్రమే ఉంటుందని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ఇంచార్జ్ అంకిత బీబీసీతో చెప్పారు.

బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో, ఎ, బి, హెచ్ యాంటిజెన్ ఉండదు. అందుకే, పరీక్షలో కూడా ఎ, బి, ఎబి బ్లడ్ గ్రూప్ రాదు. అందుకే తమది 'ఓ' బ్లడ్ గ్రూప్ అని చాలా మంది భ్రమలో ఉంటారు. కానీ దీనిని వివరంగా పరీక్షించాలంటే ఒక 'ఓ' సెల్ పరీక్ష కూడా చేయాలి. రక్తం 'ఓ' బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ పరీక్షలో రియాక్షన్ రాదు. కానీ 'బాంబే' బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల 'ఓ' సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దానితో అది 'బాంబే' గ్రూప్ అని తెలుస్తుంది.

దీని పరీక్షలో ఫార్వార్డ్, రివర్స్ టైపింగ్ రెండూ చేయాలి. ఆ రక్తం గురించి తెలుసుకోడానికి యాంటీ కేపిటెల్ 'ఎ' లాక్టిన్ టెస్ట్ కూడా చేయచ్చు.

ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఇది వంశపారంపర్యంగా రావడమే దీనికి కారణం. ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి వస్తోంది. అయితే కొందరు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో, ప్రస్తుతం 'బాంబే' బ్లడ్ గ్రూప్ ఉన్న వారు తెలుగు రాష్ట్రాలతో సహా ఇప్పుడు దేశవ్యాప్తంగా కొద్ది సంఖ్యలో ఉన్నారు.

బ్లడ్ గ్రూప్

బాంబే బ్లడ్ గ్రూపు రక్తం కావాలంటే ఏం చెయ్యాలి?

బాంబే బ్లడ్ గ్రూపు అవసరమైన వారి కోసమే ప్రత్యేకంగా సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ BombayBloodGroup.Org పేరిట ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ద్వారా రక్త దాతల వివరాలు, అలాగే బాంబే బ్లడ్ ఉన్న బ్లడ్ బ్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు.

అలాగే తమ అవసరాన్ని వారికి తెలియజేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన రక్తాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.

బాంబే బ్లడ్ గ్రూపుకు చెందిన వ్యక్తులు తమ పేర్లను ఈ వైబ్ సైట్లో రక్తదాతలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అవసరమైన వారికి సాయం చేసే అవకాశం ఉంది. అలాగే మీ రక్తం బాంబే బ్లడ్ గ్రూపుకు చెందినదా.. కాదా అన్న పరీక్ష చేయించుకోవడంలో కూడా సాయం చేస్తామని ఈ వెబ్ సైట్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరమైన వారు +91-9480044444 / +91-9880132850 ఈ ఫోన్ నెంబర్లలో కూడా సంప్రదించవచ్చని BombayBloodGroup.Org పేర్కొంది.

బ్లడ్ గ్రూప్

గోల్డెన్ బ్లడ్ గ్రూపు అంటే ఏమిటి?

బాంబే బ్లడ్ గ్రూపు కన్నా అత్యంత అరుదైనది ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు. నిజానికి ఆ పేరులోనే అది ఎంత ప్రత్యకమో అర్థమైపోతుంది. ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు. కానీ, వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకకపోవడం అత్యంత విచారకరమైన విషయం.

నిజానికి ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్(Rh null). ఈ గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటిజెన్ ఉండదు. అందుకే దీన్నీ ఆర్‌హెచ్‌ నల్(Rh null) అని పిలుస్తారు.

వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌ ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.

వంశపారంపర్యంగానే ఇలా జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు నటాలియా విల్లార్రోయా వివరించారు.

ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది, అలాగే ప్రమాదం కూడా. ఎందుకంటే, ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని.

ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

మరోవైపు చూస్తే, ఈ రక్తం కలిగిన వారిని కూడా విశ్వదాతలు అంటారు. ఎందుకంటే, వీళ్లు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. అంతేకాదు, ప్రాణాలను కాపాడటంలో ఇతర గ్రూపుల రక్తంతో పోల్చితే Rh null ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది.

బ్లడ్ గ్రూప్

గోల్డెన్ బ్లడ్ దొరికే అవకాశం ఉందా?

ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు. అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు. అయినా, చాలామందికి నిరాశే ఎదురైంది.

తెలుగు రాష్ట్రాల్లో రక్తం అవసరమైనప్పుడు ఎవరిని, ఎక్కడ సంప్రదించాలి?

ఆంధ్ర ప్రదేశ్ ఔషధ నియంత్రణ పరిపాలన(డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ గుర్తింపు పొందిన 121 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాలలోనూ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నవి కొన్ని కాగా, రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవి మరి కొన్ని. వాటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో కూడా మరి కొన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. పూర్తి వివరాలను https://dca.ap.nic.in/node/29 ఈ లింక్‌లో చూడవచ్చు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆ రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన(డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన 132 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ, అలాగే ప్రధాన పట్టణాల్లోనూ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను https://dca.telangana.gov.in/content.php?U=5 ఈ లింక్‌ను క్లిక్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కాకుండా హైదరాబాద్ నగర కేంద్రంగా ఫ్రెండ్స్ టు సపోర్ట్ పేరుతో ఆరుగురు వ్యక్తులు కలిసి రక్తదాతల డేటాబేస్ మొత్తాన్ని http://www.friends2support.org/ అనే వెబ్ సైట్లో పొందుపరిచారు. ఇందులో అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వివరాలు కూడా ఉన్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఫోన్ నెంబర్లను ఓ సారి సరిచూసుకోవడం మంచిది. ఇదే కాకుండా ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా రక్తదాతల వివరాలను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. అయితే వాటి కచ్చితత్వాన్ని ధ్రువీకరించే పరిస్థితి లేనందున ఆయా వివరాలను ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
World Blood Donor Day: What do you know about blood groups ... What are the rarest blood types?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X