వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ డాన్స్ డే: ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి కుగ్రామంలోని సంప్రదాయ నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కూచిపూడి నృత్యం

శాస్త్రీయ నృత్యరూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచాన్ని చుట్టేసింది. పలు దేశాలలో కళా ప్రియులను ఆకట్టుకుంది. అనేక మంది శాస్త్రీయ నృత్యకారుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఒకనాడు ఒకే కులస్తులు, అందులోనూ కొన్ని కుటుంబాల్లోని మగవారు మాత్రమే చేసిన ఈ నాట్యం ప్రపంచానికి విస్తరించింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కూచిపూడి నృత్యం ఇంత విస్తృతం కావడానికి కారణాలు ఏంటి అనేది ఆసక్తికరం.

కూచిపూడి అనే గ్రామం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది. గతంలో దివి తాలూకా పరిధిలో ఉండేది. మొవ్వ మండలంలో ఈ గ్రామం ఉంది. సుమారు 4వేల జనాభా ఉన్న ఈ గ్రామంలోని బ్రాహ్మణ కులంలో కొన్ని కుటుంబాల సంప్రదాయ నృత్యంగా కూచిపూడి కళా రూపం మొదలైంది.

క్రమేణా పలువురి ఆదరణతో గిన్నిస్ రికార్డు వరకూ వెళ్ళింది. దాంతో ఈ కూచిపూడి గ్రామ కీర్తి దశ దిశలా వ్యాపించడానికి ఆ నృత్యమే కారణమైంది.

ప్రపంచమంతా ప్రదర్శనలకు నోచుకున్న ఈ కళ ద్వారా పలువురి దృష్టి కూచిపూడి మీద మళ్లింది. నేటికీ యువ కళాకారులు ఈ నృత్యాన్ని నేర్చుకుంటూ ప్రదర్శనలకు మొగ్గు చూపుతుండడం కూచిపూడి నృత్యానికి నవతరంలోనూ కనిపిస్తున్న ఆసక్తిని చాటుతుంది.

కూచిపూడి నృత్యం

2వ శతాబ్దం నాటి కళ

కూచిపూడి నృత్యం తరతరాలుగా మనుగడలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఈ నాట్యానికి సొంతం. క్రీ.శ.2వ శతాబ్దం నాటి కళగా చెబుతారు. సంగీతపరమైన ఈ నాటక కళను సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు.

అంతకుముందే శాతవాహనుల కాలంలో మంచి ఆదరణ లభించింది. విజయనగర సంస్థానంలో సైతం కూచిపూడి నృత్య కళాకారులకు గుర్తింపు దక్కింది.

వైష్ణవారాధనకు ఉపయోగించే ఈ నృత్య ప్రక్రియను భాగవత మేళ నాటకం అని కూడా అంటారు. దాంతో ఈ నాట్యం చేసేవారిని భాగవతులని కూడా పిలిచేవారు. భరతుని నాట్య శాస్త్రాన్ని అనుసరించి ఉంటుందని ఈ కళలో విశేష గుర్తింపు పొందిన వారి అభిప్రాయం.

కూచిపూడి నృత్యానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రిన్సిపాల్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి తెలిపారు.

''ఇప్పుడు కూచిపూడి నాట్యం తెలియని దేశం లేదు. ప్రదర్శన లేని నిమిషం లేదు. ప్రపంచం నలుమూలలా ప్రతీ నిమిషం కూచిపూడి ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇంతటి గుర్తింపు దక్కడంలో అనేక మంది కృషి ఉంది'' అని ఆయన అన్నారు.

కూచిపూడి నృత్యం

కూచిపూడిలోని 14 కుటుంబాల వారు ప్రారంభం నుంచి దీని అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, 13వ శతాబ్దం తర్వాత కూచిపూడి నృత్యానికి ఆదరణ పెరుగుతూ వచ్చిందని ఆయన తెలిపారు.

''1989లో సిద్ధేంద్ర కళాక్షేత్రం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఈ పీఠం ఆధ్వర్యంలో మరింత ప్రయత్నం జరుగుతోంది. దాంతో కూచిపూడి కీర్తి దశదిశలో విస్తరిస్తోంది'' అని రామలింగశాస్త్రి తెలిపారు.

కర్ణాటక సంగీతశైలిలో ఆలపించే కీర్తనలకు అనుగుణంగా నాట్యప్రదర్శన సాగుతుంది. దానిని నట్టువాంగం అని అంటారు. మృదంగం, వయొలిన్, వేణువు, తంబూరా వంటి వాద్యపరికరాలను అందుకోసం ఉపయోగిస్తారు.

లయబద్ధంగా పాదాలు కదుపుతూ, వివిధ భంగిమల తో పాటుగా కళ్లతో హావభావాలు ప్రదర్శించే తీరు అందరినీ అలరిస్తుంది. కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులుగా కనిపిస్తారు. అందుకే కూచిపూడి కీర్తి వివిధ ప్రాంతాలకు వ్యాపించినట్టుగా భావించాల్సి ఉంటుంది.

కూచిపూడి నృత్యం

ఆరంభంలో పరిమితులు

భరత నాట్యానికి కూచిపూడి నృత్యానికి కూడా అనేక పోలికలుంటాయనేది కళాకారుల అభిప్రాయం. అయితే కూచిపూడికి మాత్రం కొన్ని ప్రత్యేక నాట్యరీతులున్నాయని చెబుతారు.

కూచిపూడి ప్రదర్శనలను కలాపములు, భాగవత నాటకములని రెండు రకాలుగా చెబుతారు. సత్యభామా కలాపము, గొల్ల భామా కలాపము, చోడిగాని కలాపం వంటివి ఉంటాయి. తరంగం అనే రూపకం కూడా కూచిపూడి నృత్యంలో ఉంటుంది.

ఈ కూచిపూడి నృత్యంతో గుర్తింపు పొందిన కళాకారులు అనేకమంది ఉన్నారు. వారిలో వేదాంతం సత్యనారాయణ, వెంపటి చినసత్యం, రాధా రాజారెడ్డి, శోభానాయుడు, యామినీ కృష్ణమూర్తి వంటి వారికి విశేష ఆదరణ దక్కింది.

కూచిపూడి నాట్య ప్రదర్శనలో రాజారెడ్డి, రాధారెడ్డి సుప్రసిద్ధులు (ఫైల్ ఫొటో)

వాస్తవానికి కూచిపూడి నృత్యం ఆరంభంలో బ్రాహ్మణులు, అందులోనూ పురుషులకే పరిమితం కావడంతో పరిధి పరిమితంగా ఉండేది. ఆ తర్వాత సిద్ధేంద్ర యోగి చొరవతో జరిగిన పలుమార్పులు కూచిపూడి వ్యాప్తికి దోహదపడ్డాయని ప్రముఖ కూచిపూడి కళాకారులు వేదాంత రాధేశ్యామ్ తెలిపారు.

''ఈ నాట్యంలో కవిత్వం ఉంటుంది. శిల్పం ఉంటుంది. చిత్రలేఖనం ఉంటుంది. అన్ని కళారూపాల సమాహారమే నాట్యం. అప్పట్లో మగవారే స్త్రీ పాత్రలే వేశారు. అప్పట్లో స్త్రీలకు ఉన్న సమస్యల రీత్యా ఆడపిల్లలు బయటకు రాలేదు. పురుషులే స్త్రీ వేషం వేశారు. నాట్య ధర్మి అంటారు. లోకానికి అనుగుణంగా పురుషుడే ఆడవేషం వేసుకుని రంజింపజేయడం జరిగింది. భరతుడి నాట్య శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. తదుపరి వచ్చిన పరిణామాలతో అందరూ కూచిపూడి కి ఆకర్షితులు కావడంతో వేగంగా విస్తరించింది. 11 అంగాలతోనే ఉంటుంది. చూసేవారికి, వినేవారికి సంతోషం కలిగించేలా ఈ నాట్యం ఉంటుంది'' అని ఆయన వివరించారు.

సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ రామలింగశాస్త్రి

కొత్త తరంలోనూ ఆసక్తి

కొత్త తరంలో కూడా అనేక మంది కూచిపూడి నృత్య ప్రదర్శనలకు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 'అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనం' కూడా నిర్వహించారు. సిలికానాంధ్ర వంటి సంస్థలు కూచిపూడి నృత్యప్రదర్శనలతో పాటుగా కూచిపూడి గ్రామంలో అభివృద్ధికి కూడా కొంత ప్రయత్నం చేశాయి.

ఏపీ ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని 'నాట్యరామం'గా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లు ప్రకటించింది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసింది.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం కూడా నిర్వహించారు. గతంలో హైదరాబాద్, విజయవాడల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. రికార్డు స్థాయిలో వేలమంది కళాకారులు పాల్గొని నాట్యం చేయడం ద్వారా గిన్నిస్ రికార్డులు కూడా సాధించారు. 6 వేల మందికి పైగా కళాకారులతో దీనిని నిర్వహించారు.

''కొత్తతరం కూడా కూచిపూడి నృత్యానికి ప్రాధాన్యతనిస్తోంది. శాస్త్రీయ కళల్లో కూచిపూడికి ఆదరణ ఉంది. ఈ డ్యాన్స్ నేర్చుకునే వారి కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాను. కొత్త పిల్లలు చాలామందే వస్తున్నారు. అందుకే నేను కూడా మరింతగా నేర్చుకోవడానికి సిద్ధేంద్ర పీఠానికి వచ్చాను'' అని ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్ట్స్(బీపీఏ) కోర్సుని అభ్యసిస్తున్న అట్టాడి సాయి సురేఖ అన్నారు.

విశాఖలో స్థిరపడిన ఆమె గతంలో డిప్లోమా కోర్సులు అభ్యసించినప్పటికీ సిద్ధేంద్ర పీఠంలో బీపీఏ అభ్యసించడం తన అవగాహనను పెంచుతోందని అంటున్నారు.

కూచిపూడి నృత్యం

వృద్ధులు కూడా...

సిద్ధేంద్ర కళాక్షేత్రం ఆధ్వర్యంలో బ్యాచిలర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్ట్స్ సహా పలు కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీజీ, పీహెచ్ డీ వంటి కోర్సులలో చేరేందుకు వయసుతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల సహా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వస్తుండడం విశేషం.

ప్రస్తుతం 120 మంది వరకూ విద్యార్థులు ఉన్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. కూచిపూడికి ఉన్న ప్రత్యేకత రీత్యానే ఇక్కడ బీపీఏ కోర్సు చేసేందుకు వచ్చినట్టు కళాకారులు చెబుతున్నారు.

రామకృష్ణ ప్రసాద్ అనే 62 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కూడా ఈ కోర్సు అభ్యసిస్తుండడం విశేషం. ఆయన గతంలో సివిల్ సప్లైస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత, తనకున్న ఆసక్తితో కూచిపూడి నృత్యంలో బీపీఏ చేస్తున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
World Dance Day: How did the traditional dance of Kuchipudi hamlet in Andhra Pradesh become universal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X