
వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

''నేను చనిపోతున్నట్లు అనిపించింది. చాలా భయపడ్డాను’’అని 18ఏళ్ల వయసులో తాను హెపటైటిస్-బీ పాజిటివ్ అని తెలిసినప్పటి పరిస్థితులను వియత్నాంకు చెందిన లియెన్ ట్రాన్ గుర్తుచేసుకున్నారు.
''వియత్నామీస్‌లో హెపటైటిస్-బీను లివర్ ఇన్‌ఫ్లమేషన్‌గా పిలుస్తారు’’అని బీబీసీతో లియెన్ చెప్పారు.
''నాకు ఆరేళ్ల వయసులో మా అమ్మమ్మ లివర్ క్యాన్సర్‌తో మరణించారు. నాకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని భయమేసింది.’’
అయితే, ఇప్పటికి 20ఏళ్లు గడిచాయి. హెపటైటిస్-బీపై నెలకొన్న అపోహలు తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ''ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ సోకితే ఇక చనిపోవడమేనని మొదట్లో అనుకునేదాన్ని. కానీ, అది నిజం కాదని తెలుసుకున్నాను’’అని ఆమె చెప్పారు.
- నగరం వాలెంటైన్స్ డే జరుపుకొంటోంది.. ఆమె మాత్రం గదిలో ఒంటరిగా నిరీక్షిస్తోంది
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?

హెపటైటిస్ అంటే ఏమిటి?
కాలేయ కణజాల వాపును హెపటైటిస్‌గా పిలుస్తారు. దీన్నే చాలా దేశాల్లో లివర్ ఇన్‌ఫ్లమేషన్‌గా చెబుతారు.
దీనిలో ఏ, బీ, సీ, డీ, ఈ అనే రకాలున్నాయి. ఇవన్నీ భిన్నరకాల వైరస్‌ల ద్వారా వ్యాపిస్తాయి.
ఏళ్లపాటు హెపటైటిస్-బీ లేదా హెపటైటిస్-సీ పీడిస్తే సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌లు కూడా రావొచ్చు.

హెపటైటిస్ ఎంత మందికి వస్తోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం ప్రకారం, ప్రతి 30 సెకన్లకూ వైరల్ హెపటైటిస్‌తో ఒకరు మరణిస్తున్నారు. సంవత్సరానికి దీని వల్ల పది లక్షల కంటే ఎక్కువే మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి హెచ్ఐవీ, మలేరియా రెండింటినీ కలిపితే వచ్చే మరణాల సంఖ్య కంటే ఎక్కువే.
భిన్న రకాల హెపటైటిస్‌లతో ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది జీవిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.
ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వ్యాధిని మొదట్లోనే నిర్ధారించేందుకు, మెరుగైన చికిత్సా విధానాల కోసం జులై 28న ఏటా ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
''హెపటైటిస్-బీతో జీవిస్తున్న 29.6 కోట్ల మందిలో ఎక్కువ మంది ఆసియా, ఆఫ్రికాలోనే ఉన్నారు. 1.4 కోట్ల మంది యూరప్‌లో, 50 లక్షల మంది ఉత్తర, దక్షిణ అమెరికాల్లో హెపటైటిస్-బీతో జీవిస్తున్నారు’’అని వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ జేమ్స్ చెప్పారు.
- 'అన్ని' డిజైన్లకూ మగవాడే ప్రామాణికం... ఎందుకిలా...
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?

హెపటైటిస్ ఎలా సోకుతుంది? దీని లక్షణాలు ఏమిటి?
వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా హెపటైటిస్ సోకుతుంది. మరోవైపు కొన్ని రసాయనాలు, ఆల్కహాల్, డ్రగ్స్, కొన్ని జన్యుపరమైన రుగ్మతల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.
లియెన్ లాంటి చాలా మందికి వెంటనే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. చాలా కేసుల్లో లక్షణాలు పైకి కనిపించేందుకు దశాబ్దాల సమయం పడుతుంది.
హెపటైటిస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, తల తిరగడం, వాంతులు, కడుపు నొప్పి, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, మలం లేత పసుపు రంగులో రావడం, కాళ్ల నొప్పులు, పచ్చకామెర్లు దీనిలో ఉన్నాయి.
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
- ఒక్క ఏడాదిలో 12 లక్షల మంది పిల్లలు చనిపోయారు

అపోహలు చాలా..
వియత్నాం రాజధాని హనోయ్‌కు ఉత్తరంగా ఒక చిన్న గ్రామంలో లియెన్ జన్మించారు. హనోయ్ యూనివర్సిటీలో బయాలజీ చదివేందుకు ఆమె సీటు సంపాదించారు. ఆ తర్వాత యూరప్‌లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఆమెకు స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. అయితే, విదేశాలకు వెళ్లేందుకు పరీక్షలు చేయించుకున్నప్పుడు ఆమెకు హెపటైటిస్-బీ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.
''హెపటైటిస్-బీ వల్ల నేను విదేశాలకు వెళ్లడం కుదరదని మా డాక్టర్ చెప్పారు’’అని ఆమె చెప్పారు.
అయితే, ఈ విషయాలను అధికారులకు ఆమె చెప్పాలని అనుకోలేదు. కుటుంబ కారణాల వల్ల ఈ స్కాలర్‌షిప్ తీసుకోలేకపోతున్నానని వారికి ఆమె సమాధానం ఇచ్చారు.
''వియత్నాంలో హెపటైటిస్ రోగులపై చాలా వివక్ష చూపిస్తారు. వారిని హెచ్ఐవీ రోగులుగా భావిస్తారు’’అని ఆమె చెప్పారు.
లైంగిక చర్యల వల్ల తేలిగ్గా హెపటైటిస్-బీ సోకుతుంది. అయితే, ఈ వ్యాధి సోకిందని తెలిసే సమయానికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు సెక్స్‌ను వియత్నాంలో తప్పుగా చూస్తారు.
''హెపటైటిస్ గురించి నా చుట్టుపక్కల వారికి మంచి అభిప్రాయం లేదు. అందుకే నాకు ఇది సోకిందని చెప్పకూడదని అనుకున్నాను’’అని ఆమె చెప్పారు.
- సెక్స్ తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- అరచేతిలో పట్టే చిన్నారి, బరువు పావు కిలో కన్నా తక్కువే

చికిత్స ఏమిటి?
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత లియెన్‌కు మంచి ఉద్యోగం దొరికింది. దీంతో తన తల్లిని కూడా ఆమె ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆమెకు కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
''ఈ విషయం అమ్మకు చెప్పినప్పుడు.. ఆమె నా వైపు చూసి ఇది నాకు తెలుసని చెప్పింది. బహుశా నేను కడుపులో ఉన్నప్పుడే ఆమెకు ఈ విషయం తెలిసి ఉండొచ్చు’’అని లియెన్ చెప్పారు.
''ఈ సంగతి నీకు చెప్పకపోవడం నా తప్పేనని అమ్మ అంది’’అని ఆమె వివరించారు.
అయితే, లియెన్ తల్లి మాత్రం రోజూ యాంటీ వైరల్ ట్యాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఆమె మెడికల్ చెకప్‌లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ

వ్యాప్తి ఎలా ఉంటుంది?
కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ సోకుతాయి. హెపటైటిబ్ బీ, సీ, డీ మాత్రం ఈ వైరస్‌తో కలుషితమైన శరీరక ద్రవాలు మన శరీరంలో కలిసినప్పుడు వస్తాయి.
ఈ వైరస్‌లతో కలుషితమైన రక్తాన్ని ఎక్కించుకోవడం, వైద్య చికిత్సల సమయంలో ఈ వైరస్‌తో కలుషితమైన వైద్య పరికరాలను ఉపయోగించడం, ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు, లైంగిక చర్యల వల్ల ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
పెళ్లికి ముందే తనకు ఈ ఇన్ఫెక్షన్ ఉందని తనకు కాబోయే భర్తకు లియెన్ చెప్పారు. అయితే, భర్త ఆమెకు అండగా నిలిచారు. వీరిద్దరికీ పిల్లలు కూడా పుట్టారు.
''ఈ వైరస్ తల్లి నుంచి పిల్లలకు సోకే అవకాశముందని నాకు తెలుసు. అందుకే నా పిల్లలకు టీకాలు వేయించాను. ఇప్పడు వారిద్దరూ హెపటైటిస్ నెగిటివ్’’అని లియెన్ చెప్పారు.
- వీర్యంలో శుక్రకణాలు లేకపోతే.. మగతనంలో లోపమా? అజూస్పెర్మియా అంటే ఏంటి?
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
హెపటైటిస్‌కు వ్యాక్సీన్ ఉందా?
తీవ్రమైన హెపటైటిస్-బీతో 29.6 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా జీవిస్తున్నారు. చాలా కేసుల్లో ఈ ఇన్ఫెక్షన్ తల్లి నుంచి పిల్లలకు సోకుతుంది.
ఒక్క 2019లోనే 8,20,000 మరణాలు హెపటైటిస్-బీ వల్ల సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది.
హెపటైటిస్-బీ నుంచి 98 నుంచి 100 శాతం రక్షణ కల్పించే వ్యాక్సీన్లు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.
హెపటైటిస్-డీని అడ్డుకునే వ్యాక్సీన్ లేదు. అయితే, హెపటైటిస్-బీ వ్యాక్సీనే డీ నుంచి కూడా కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. హెపటైటిస్-ఏకు భిన్నమైన వ్యాక్సీన్ ఉంది.
మరోవైపు హెపటైటిస్-సీకి ఎలాంటి వ్యాక్సీన్ లేదు. అయితే, కొన్ని యాంటీ-వైరల్ ట్యాబ్లెట్లతో ఈ ఇన్ఫెక్షన్ దాదాపు 90 శాతం మందిలో తగ్గుతోంది.
హెపటైటిస్-ఈ విషయానికి వస్తే చైనాలో మాత్రమే హెచ్ఈవీ 239 పేరుతో వ్యాక్సీన్ అందుబాటులో ఉంది.
తన ఇద్దరు కుమార్తెల కోసం ఒక్కో వ్యాక్సీన్‌కు 100 డాలర్లు (రూ.7990) చొప్పున లియెన్ చెల్లించారు. ఆసియా, ఆఫ్రికాలలో చాలా మంది నెలవారీ మదుపు ఈ మొత్తానికి సమానం.
''రెండు డోసుల వ్యాక్సీన్‌ను సకాలంలోనే పిల్లలకు అందిస్తే, తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్-బీ సోకకుండా అడ్డుకోవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండే కేసుల్లోనూ ఈ వ్యాక్సీన్లు కొంతవరకు పనిచేస్తాయి’’అని క్యారీ జేమ్స్ చెప్పారు.
ఒక్కసారిగా పెరిగిన కేసులు
ఇటీవల కాలంలో అంతుచిక్కని లివర్ సమస్యలు చిన్న పిల్లల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. వీటిపై చేపట్టిన పరిశోధనలో రెండు రకాల వైరస్‌లు (హెపటైటిస్ ఏ, ఈ) మళ్లీ విజృంభిస్తున్నట్లు తేలింది.
''ఈ పిల్లల్లో చాలా మంది హెపటైటిస్ ఏ లేదా ఈ సోకినట్లు నిర్ధరణ అయ్యింది’’అని క్యారీ జేమ్స్ చెప్పారు.
ప్రస్తుతం 30 దేశాల్లో ఇలాంటి 1,010 అనుమానిత కేసులున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.
లండన్, గ్లాస్గోలకు చెందిన రెండు పరిశోధకుల బృందాలు ఈ పిల్లలపై పరిశోధనలు చేపడుతున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి వల్ల ఈ పిల్లలకు టీకాలు వేయడం ఆలస్యం కావడమూ ఈ ఇన్ఫెక్షన్‌లకు ఒక కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

అవగాహన కోసం..
కోట్ల మందికి ఈ వైరస్ సోకుతున్నప్పటికీ, ప్రజల్లో దీనిపై అవగాహన చాలా తక్కువగా ఉంటోంది.
''హెపటైటిస్‌తో పుట్టే పిల్లలకు మొదట్లోనే తగిన చికిత్సలు అందిస్తే లివర్ క్యాన్సర్ లేదా సిర్రోసిస్ లాంటి తీవ్రమైన వ్యాధులు సోకవు’’అని క్యారీ జేమ్స్ చెప్పారు.
''ఈ వ్యాధికి ఎక్కువగా ప్రభావితం అవుతున్న వారు కూడా ఎక్కువగా నిరుపేదలు జీవించే ప్రాంతాల్లోనే ఉంటున్నారు’’అని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత హెపటైటిస్‌పై ప్రజలకు అవాహన కల్పించేందుకు లియెన్ కృషి చేస్తున్నారు. మెల్‌బోర్న్ యూనివర్సీలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు.
అక్కడ చదువుతున్నప్పుడే లా ట్రోబ్ యూనివర్సిటీలో హెపటైటిస్-బీపై పరిశోధన చేపడుతున్న పరిశోధకులను ఆమె కలిశారు.
ప్రస్తుతంతో వారితో కలిసి ఆమె ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
''నేను ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు నెలల్లోనే విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ మినిస్టీరియల్ రౌండ్‌టేబుల్‌లో పాలుపంచుకొనే అవకాశం వచ్చింది’’అని ఆమె చెప్పారు.
ఇప్పుడు ఇతర రోగులకు ఆమె తన కథ చెబుతున్నారు.
''హెపటైటిస్ గురించి మాట్లాడేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఏదీ దాచిపెట్టడం లేదు.’’
''నాకు స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది.’’
ఇప్పుడు లియెన్ వయసు 38ఏళ్లు. ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడే పిల్లలకు ఆమె ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నారు.
''ఇదేమీ అంత పెద్ద విషయం కాదు. మీరు హెపటైటిస్ ఉన్నప్పటికీ సంతోషంగా జీవించొచ్చు. వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని హాయిగా ఆస్వాదించొచ్చు.’’
''హెపటైటిస్‌కు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు వైద్యుడి దగ్గరకు వెళ్లండి. వారిచ్చే మందులు వేసుకోండి. అవి చాలా చక్కగా పనిచేస్తాయి’’అని ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ''భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)