కేజ్రీవాల్‌కి రిలీఫ్: రాత్రిపూట యోగేంద్ర చర్చ, కలుస్తానని భూషణ్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ సోమవారం రాత్రి పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. ఇది సంధికి సంకేతమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెంగళూరు నుండి ఢిల్లీకి వచ్చిన రోజునే సంధి చర్చలు జరగడం గమనార్హం.
ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఆ పార్టీలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇతర పార్టీలకు భిన్నం కాదని ఆ పార్టీ నిరూపించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యలో పార్టీ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం, ఆ తర్వాత చికిత్స కోసం బెంగళూరులో పది రోజులు ఉండటం జరిగింది.
ఆయన సోమవారం నాడు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ సమయంలో పార్టీలోని రెండు గ్రూపుల మధ్య చర్చలు సాగాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, అశుతోష్, ఆశిష్ కేతన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చర్చల అనంతరం కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ... యోగేంద్ర యాదవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. మరికొన్నిసార్లు తాము చర్చిస్తామని చెప్పారు. ఈ చర్చలు మంచి ప్రారంభమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోని సంక్షోభానికి తెరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సమావేశం అనంతరం అసంతృప్త నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. చర్చలు ఈ రోజు ప్రారంభించామని, బాగా అనిపించిందని చెప్పారు. చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. మరో అసంతృప్త నేత ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌తో భేటీ అయ్యేందుకు తాను సమయం కోరానని చెప్పారు.












Click it and Unblock the Notifications