Yogi Adityanath : బీజేపీ ఐటీ, సోషల్ మీడియా టీమ్స్ కు యోగీ ఆదిత్యనాథ్ టిప్స్..
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి యూపీ నుంచి అత్యధిక స్ధానాల్ని బీజేపీకి అందించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే రెండోసారి యూపీలో అధికారంలోకి వచ్చాక లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు బీజేపీలోని ఐటీ, సోషల్ మీడియా విభాగాల్ని సైతం ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వాటికి పలుసూచనలు కూడా చేశారు.
ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ లోపాల్ని ఎక్కడికక్కడ ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వాటికి ఎక్కడికక్కడ కౌంటర్లు ఇచే వ్యూహాల్ని పక్కాగా అమలు చేయాలని బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగాలకు యోగీ ఆదిత్యనాథ్ సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఈ కార్యక్రమం వేగవంతం చేయాలని యోగీ సూచించారు.

యూపీలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో యూపీ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం నిర్వహించిన 'శంఖనాద్ అభియాన్' వర్క్‌షాప్‌లో యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ సోషల్ మీడియా బృందాన్ని ఆయన కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏ అబద్ధానికైనా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ద్వారా సమాధానం చెప్పాలని సూచించారు. ఇది ప్రత్యర్థుల అబద్ధాలను బహిర్గతం చేయడమే కాకుండా వారికి తగిన సమాధానం ఇస్తుందన్నారు. ప్రతికూల సమాచారానికి సకాలంలో సమాధానం ఇవ్వడం అవసరమన్నారు.
ఇవాళ దాదాపు ప్రతీ వ్యక్తి స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారని, దేశం, రాష్ట్రంలో జరుగుతున్న సానుకూల మార్పుగురించిన వాస్తవ చిత్రం అందరికీ చేరువకావాలని యోగీ ఆదిత్యనాథ్ సూచించారు. ఇందుకు సోషల్ మీడియా కంటే శక్తివంతమైన వేదిక మరొకటి ఉండదని ఆయన అన్నారు. గతంలో పలు ఎన్నికల్లో సోషల్ మీడియా సాయంతో బీజేపీ ఎలా గెలిచిందో యోగీ వారికి వివరించారు. ఈసారి కూడా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications