యోగీ ఆదిత్యనాథ్ చేతికి ఓబీసీ కమిషన్ రిపోర్ట్-మున్సిపల్ పోరులో కోటా అమలుకు రెడీ..
ఉత్తర్ ప్రదేశ్ స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ కోటాకు అలహాబాద్ హైకోర్టు నో చెప్పిన నేపథ్యంలో ఓబీసీ కమిషన్ రిపోర్ట్ తో దాన్ని అమలు చేసేందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు.
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ కోటా అమలుతో ప్రత్యర్ధులను చావుదెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా మరో అస్త్రం సంధించారు. హైకోర్టు ఓబీసీ కోటాకు నో చెప్పిన నేపథ్యంలో దాన్ని చట్టబద్ధం చేసేందుకు వీలుగా ఓబీసీ కమిషన్ ను నియమించిన యోగీ.. తాజాగా ఈ నివేదికను అందుకున్నారు. ఇక దాన్ని అమలు చేయడం ఒక్కటే మిగిలింది. దీంతో స్ధానిక పోరు రసవత్తరంగా మారబోతోంది.
యూపీలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించేందుకు యోగీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) రామ్ అవతార్ సింగ్, ఇతర సభ్యులు నిన్న సాయంత్రం సీఎంకు తమ నివేదికను సమర్పించినట్లు యూపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ శిశిర్ పిటిఐకి తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ చేసిన సిఫారసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓబీసీ కోటా అమలు కోసమే ఈ కమిషన్ ను నియమించినందున దానికి అనుకూలంగానే రిపోర్ట్ ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు ముసాయిదా ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ఒకరోజు తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీ కమిషన్‌ను నియమించింది. హైకోర్టు తీర్పు తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించబోమని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తేల్చిచెప్పి మరీ ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications