యూపీ ఇలా.. పాకిస్తాన్ అలా.. యోగీ ఆదిత్యనాథ్ ఆసక్తికర పోలిక...
యూపీలో ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు తీయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా సీఎం యోగీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టులకు శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో యూపీలో అభివృద్ధిని, పాకిస్తాన్ లో ఆహార సంక్షోభంతో పోలుస్తూ యోగీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రూ.8731 కోట్ల విలువైన ప్రాజెక్టు నిర్మాణానికి యోగీ నిన్న శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కు సమానమైనవంటూ యోగీ గుర్తుచేశారు. మనం అభివృద్ధి కోసం డబ్బు ఖర్చు చేస్తుంటే, పాకిస్థాన్ లాంటి దేశాలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నాయంటూ యోగీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాము స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం 17 మునిసిపల్ కార్పొరేషన్లను అనుసంధానించడానికి ప్లాన్ చేస్తున్నట్లు యోగీ వెల్లడించారు. స్మార్ట్ సిటీ మిషన్ అమలులో ప్రస్తుతం యూపీ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. గత 6 ఏళ్లలో 200కు పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏర్పాటయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి ఆగ్రా మెట్రో అందుబాటులోకి వస్తుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
రాష్ట్రంలోని ఐదు నగరాల్లో మెట్రో పనిచేస్తోందని, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా గరిష్టంగా ఇన్ని మెట్రోలు లేవన్నారు. కాశీలో రోప్‌వే సదుపాయానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఏడాది చివరి నాటికి ఆగ్రా మెట్రోను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. త్వరలో సీతాపూర్, ఉన్నావ్, బారాబంకి, రాయ్ బరేలీ వంటి అనేక జిల్లాలలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటుకి తెస్తున్నట్లు యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications