యోగీ సర్కార్ మరో కీలక నిర్ణయం- ఇకపై యూపీలో అధికారుల ప్రజాదర్బార్ లు...
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాలనలో విన్నూత్న మార్పులు చేపడుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం యోగీ మాత్రమే ప్రజా దర్బార్ లు నిర్వహిస్తుండగా..ఇప్పుడు అధికారులు కూడా వీటిని తమ ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. తద్వారా ఎక్కువ మంది ప్రజల ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తోంది.
తాజాగా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రజలతో అధికారులు మరింత సన్నిహితంగా మెలగాలని సూచించారు. వారి ఫిర్యాదుల్ని తీసుకునేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు ప్రజా విచారణలను నిర్వహించాలని ఆదేశించారు. అందులో వారు చేసే ఫిర్యాదులకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని యోగీ ఆదేశించారు.

ప్రజల్లో సంతృప్తే మీ పనితీరుకు నిదర్శనమని యోగీ అధికారులకు తెలిపారు. ఇకపై అధికారులు తమకు పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో రాత్రిపూట తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలన్నారు. అలాగే అధికారులు అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇందులో అధికారుల పాత్ర ఉంటే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పలు జిల్లాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుండటంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని పరుగులు పెట్టించేందుకు వీలుగా తరచుగా సమీక్షలు నిర్వహించాలని, తద్వారా వాటిని సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా నోడల్ ఆఫీసర్లను నియమించి, వాటిని పూర్తి చేసే విషయంలో వారినే బాధ్యుల్ని చేయాలని కూడా యోగీ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications