యూపీలో డ్రగ్స్ పై యోగీ సర్కార్ పోరు-సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకూ స్పెషల్ డ్రైవ్...
యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి డ్రగ్స్ సరఫరా, వాడకం సమస్యగా మారింది. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ బానిసల్ని దృష్టిలో ఉంచుకుని జనంలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అంటే పండిట్ దీన్ దయాళ్ జయంతి నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి వరకూ ఈ డ్రైవ్ నిర్వహించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు.
జాతీయ నార్కోటిక్స్ సమన్వయ పోర్టల్ రాష్ట్రస్దాయి సమావేశంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో డ్రగ్ ట్రాఫికింగ్ పై అధికారులతో చర్చించారు. దీన్ని కేవలం రాష్ట్ర సమస్యగా చూడొద్దని అధికారులకు యోగీ కోరారు. జాతీయ స్ధాయిలో ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం రాదన్నారు. అన్ని కోణాల్లో సమస్యను అధ్యయనం చేసి డ్రగ్స్ మూలాల్ని గుర్తించాలన్నారు. అలాగే ఇప్పటికే డ్రగ్స్ బాధితులైన వారి కోసం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్రంలో అక్రమ డ్రగ్స్ తయారీ, రవాణా, వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు తెలిపారు. ఇందుకోసం సున్నితమైన జిల్లాల్లో విజిలెన్స్, ఇంటిలిజెన్స్ ను బలోపేతం చేసి వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంతో పాటు హౌసింగ్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే గోరఖ్ పూర్ లో జాతీయ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేస్తున్న కొత్త జోనల్ హెడ్ క్వార్టర్స్ కు అవసరమైన సహకారం అందించాలని అధికారుల్ని యోగీ ఆదేశించారు.
డ్రగ్స్ తయారీ, రవాణా వ్యాపారంలో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తప్పవని యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. వారిని అరెస్టు చేయడంతో పాటు ఆస్తుల్ని కూడా అటాచ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వారిని సమాజానికి శత్రువులని, మానవత్వానికి నేరస్తులని యోగీ ఆదిత్యనాథ్ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications