Yogi Adityanath : అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న యోగీ-మిషన్ మోడ్ లో పనిచేయాలని ఆదేశం..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ప్రజా సంక్షేమం విషయంలోనూ అధికారులు ఏమరుపాటుగా ఉండకుండా పరుగులు తీయిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అధికారులకు యోగీ తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు మిషన్ మోడ్ లో పనిచేయాలని యోగా ఆదేశించారు.
ప్రజల నుంచి వెల్లువలా వస్తున్నఫిర్యాదుల్ని అంతేవేగంగా మిషన్ మోడ్ లో (యంత్రంలా) పనిచేస్తూ పరిష్కరించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ప్రజల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై మాత్రం కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలు రాష్ట్రంలో అధికారులు అందరికీ వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

మెరిట్ ఆధారితంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సీఎం యోగీ అధికారులకు అందించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ సామాన్యుల అవసరాలు తీర్చేందుకు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినవేనని ఆయన అన్నారు. పరిపాలనతో సంబంధం ఉన్న అధికారులు లేదా సిబ్బంది అందరూ దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
సామాన్య ప్రజల ఫిర్యాదులు, సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (ఐజీఆర్‌ఎస్, సీఎం హెల్ప్‌లైన్) చాలా ఉపయోగకరమైన మాధ్యమమని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఐజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను కోరారు. ఇందులో ఎలాంటి అలసత్వం, అలక్ష్యం, ఆలస్యాన్ని ఉపేక్షించబోమని యోగీ స్పష్టం చేశారు. ప్రభుత్వం నేరాలు, నేరస్థులకు వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications