భూకబ్జాదారుల్ని వదిలిపెట్టొద్దు-యూపీ పోలీసులకు సీఎం యోగీ కఠిన ఆదేశాలు..
ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. ఇప్పుడు భూకబ్జాదారులపై చర్యలకు కఠిన ఆదేశాలు ఇచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లో భూకబ్జాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఓవైపు అభివృద్ధి, సంక్షేమం వైపు పాలన సాగిస్తుండగా.. భూకబ్జాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. దీంతో తాజాగా జనతా దర్బార్ కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గంలో నిన్న జనతా దర్శన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భూకబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతందని పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భూమాఫియాకు తగిన గుణపాఠం చెప్పాలని పోలీసులకు సూచించారు.

ల్యాండ్‌మాఫియా ఎవరి భూమిని ఆక్రమించకుండా చూడాలని, న్యాయపరమైన మార్గాల ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అధికారులు, పోలీసులను ఆదేశించారు. అధికారులు ఏ స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహించరాదని, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై త్వరితగతిన, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అదే సమయంలో బాధితుల నుంచి భూకబ్జాలపై తనకు అందిన ఫిర్యాదుల్ని సైతం ఆయన పోలీసులకు నేరుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగీని 500 మంది కలిశారు. వీరిలో చాలా మంది భూకబ్జాలపైనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోలీసుల పనితీరుపై సీరియస్ అయ్యారు.

మీరు దేనిపైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ సమస్యల పరిష్కారానికి త్వరిత, నాణ్యత, సంతృప్తికరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు యోగీ హామీ ఇచ్చారు. పరస్పర భూవివాదాల విషయంలో ముందుగా బాధిత వర్గాల మధ్య కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications