Yogi Adityanath : జామా మసీదు మెట్రో స్టేషన్ పేరు మార్చేసిన యోగీ ఆదిత్యనాథ్..
యూపీలో ఎన్నికల వేళ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ నేతల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల కోణంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగ్రా మెట్రో పరిధిలోకి వస్తున్న జామియా మసీదు మెట్రో స్టేషన్ పేరును మారుస్తూ యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫతేహాబాద్‌లోని తాజ్ ఈస్ట్ గేట్ మెట్రో స్టేషన్‌లో ఆగ్రా మెట్రో హైస్పీడ్ ట్రయల్ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జామా మసీదు మెట్రో స్టేషన్ పేరు ఇకపై మంకమేశ్వర మందిర్ స్టేషన్ గా పిలవాలని స్పష్టం చేశారు. 2024 నాటికి ఆగ్రా మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జామా మసీదు మెట్రో స్టేషన్ పేరును మంకమేశ్వర్ మందిర్ స్టేషన్‌గా మార్చడంపై తాజ్ సిటీలో చర్చ మొదలైంది.

యోగీ సర్కార్ నిర్ణయంపై స్ధానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓ నగరం, మెట్రో లేదా బస్టాండ్ పేరు మార్చడానికి ఒక కమిటీ వేయాలి. అలాగే కమిటీ అనుమతి తర్వాత మాత్రమే పేరు మార్చాలి. కానీ యోగీ ప్రభుత్వం పేర్లను మార్చడం వివాదానికి కారణమవుతోంది. జామా మసీదు మెట్రో స్టేషన్ మినహా ఆగ్రాలోని ఏ మెట్రో స్టేషన్‌ను ఇప్పటివరకు పేరు మార్చలేదు.
గతంలో బీఎస్పీ ప్రభుత్వం తన హయాంలో అనేక జిల్లాల పేర్లను మార్చింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వాటిని పునరుద్ధరించింది. రెండు ప్రభుత్వాలు రాజకీయ మైలేజ్ కోసం ఇలా చేశాయి, కానీ సాధారణం మధ్యమధ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పేర్లు మార్చడంలో కాషాయ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మైళ్ల దూరంలో ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం జామా మసీదు స్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ గత ఏడాది కాలంగా కొనసాగుతోంది. గతంలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా జామా మసీదు స్టేషన్ పేరును మంకమేశ్వర ఆలయంగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల మధురలో ఉన్నప్పుడు జామా మసీదు పేరును కూడా మార్చాలని ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు.












Click it and Unblock the Notifications