రాముడు మన పూర్వీకుడు, ఈ దేశ ఆత్మ : యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు..
యూపీలో అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతున్న వేళ.. జనంలో భక్తిభావాన్ని సైతం అదే స్ధాయిలో నింపేందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 23న రామ్ లల్లాలో జలాభిషేకం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆయన్ను కలిశారు. షిండేతో భేటీ తర్వాత యోగీ రాముడిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మర్యాద పురుషోత్తముడైన రాముడు మన పూర్వీకుడని, ఆయన మన దేశ ఆత్మ అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.ప్రధాని మోడీ రాముడి స్ఫూర్తితో ఈ దేశాన్ని రామరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో అయోధ్య ప్రపంచ ప్రసిద్ధ నగరంగా, అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. అయోధ్యలో వేల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతున్నట్లు యోగీ తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యోగీ హిందువుల్లో నమ్మకాన్ని తిరిగి కల్పించారని షిండే తెలిపారు. యోగీ నాయకత్వంలో రాముడి నగరమైన అయోధ్య కొత్త శిఖరాలకు చేరుకుంటోందన్నారు. అయోధ్య జరుగుతున్న రామమందిర నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ సందర్భంగా షిండే ప్రశంసించారు.












Click it and Unblock the Notifications